15, మే 2014, గురువారం

పేరుకుపోయిన కార్పొరేట్ బకాయిలు..


18:36 - May 14, 2014
ఢిల్లీ: గత మూడేళ్లలో ప్రభుత్వ బ్యాంకులకు చెందిన 23వేల కోట్ల రూపాయలు అక్రమార్కుల పాలయ్యాయి. లక్షా 64వేల కోట్ల మొండి బకాయిలు సవాల్‌గా మారాయి. వాణిజ్య బ్యాంకులను నిండా ముంచే మొండి బకాయిలు లక్షా 64వేల కోట్లకు పైమాటే. ఇందులో 400 మంది బడా పారిశ్రామిక వేత్తలు కంపెనీలవే 70వేల కోట్లుకు పైగా ఉంటుందని బ్యాంకు ఉద్యోగ సంఘాలంటున్నాయి. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఫోర్జరీ సంతకాలతో దొంగ డాక్యుమెంట్లతో రూ.22వేల 743 కోట్ల ప్రజాధనాన్ని నేరగాళ్లు దోచుకున్నారు. ఇప్పటివరకూ బ్యాంకు మోసాలకు సంబంధించి లక్ష 69వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇన్వెస్టర్లు కార్పొరేట్‌ సంస్థలు, రాజకీయ పలుకుబడి ఉన్న వారే.
పెరుగుతున్న ఆర్ధిక నేరాలు..
        
దేశంలో ఆందోళనకర స్థాయిలో ఆర్ధిక నేరాలు పెరుగుతున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం వైఫల్యాన్ని మూటగట్టుకుంటోంది. నేరం జరిగినట్టు నిఘా సంస్థలు గుర్తిస్తాయి. కానీ అన్యాక్రాంతమైన డబ్బు మాత్రం రికవరీ కాదు. వేల కోట్ల కుంభకోణాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ రికవరీ చేసేది వందల కోట్లు మాత్రమే. మానీ లాండరింగ్‌ యాక్ట్ లో కూడా విచారణ జరిపి డబ్బు రికవరీ చేసేలోపు హవాలా రూపంలో విదేశాలకు చేరుతోంది. ఇందులో ఏ ఒక్కరినీ నిందించలేమంటున్నాయి సిబిఐ, విజిలెన్స్, కాగ్‌ వంటి సంస్థలు. ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల అవినీతి, కంపెనీల ఆడిటర్లలో లోపించిన నిజాయితీ, మోసగాళ్లకు అండగా నిలుస్తున్న పెద్దలు దీనికి బాధ్యత వహించాలని సిబిఐ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కాగ్‌ నివేదికలను మంత్రులే తప్పుబట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్ధిక నేరాలపై విచారణ జరుగుతున్న సమయంలో సిబిఐపై ఒత్తిడి పెంచిన ప్రభుత్వాలున్నాయి. నిఘా, దర్యాప్తు సంస్థలకు కోరలు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మోసాలు పెరగడానికి కారణమని 8వ కార్పొరేట్‌ ఫ్రాడ్‌ సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు.
కార్పొరేట్‌ కంపెనీల అత్యుత్సాహం..
     
పోటీ ప్రపంచంలో ప్రైవేటు రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. కానీ వేగంగా బిలియన్‌ డాలర్‌ కంపెనీగా ఎదగాలన్న కార్పొరేట్‌ సంస్థల అత్యుత్సాహం ఆర్ధిక మోసాలకు కారణమవుతోంది. సంస్థ లేదా పరిశ్రమ స్థాపించిన తక్కువ సమయంలోనే వేల కోట్లు టర్నొవర్‌ సాధించాలన్న అత్యాశ వారిలో పెరిగింది. అది సరైన మార్గాల్లో సాధిస్తే మంచిదే కానీ అడ్డదారుల్లో అయినా ఫర్వాలేదనుకోవడమే దేశ ఆర్ధిక వ్యవస్థకు సవాల్‌గా మారింది.
 ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపించాలి. దర్యాప్తు సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరముంది. లేదంటే ప్రజాధనం కొందరు పెద్దలకు ఫలహారంగా మారుతుంది. దేశీయ బ్యాంకింగ్‌ రంగం మరింత సంక్షోభంలో పడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి