29, మే 2014, గురువారం

వివాదాల వలయంలో పోలవరం ప్రాజెక్టు..


21:45 - May 28, 2014
00:00
     ఒకచోట పోరాటం. మరో చోట బతుకుల్లో వెలుగు నిండుతుందనే ఆశ. పోలవరం ప్రాజెక్టు చుట్టూ ఎన్నో వివాదాలు. మరెన్నో ఆకాంక్షలు. అసలీ ప్రాజెక్టు వివాదంగా ఎందుకు మారుతోంది? ఎన్ని జీవితాలు బలికొంటోంది? ఎక్కడ వెలుగులు పంచబోతోంది? వాస్తవాలేంటి? భ్రమలేంటి? సమస్యలకు పరిష్కారాలేంటి? అందరికీ ఉపయోగపడే ప్రాజెక్టులు కడితే మంచిదే. ఎవరూ కాదనరు. కానీ, దానివల్ల లక్షల మంది బతుకుల్లో చీకట్లు నిండుతుంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిందే. అసలు డిజైన్ మార్చితే ఏం జరుగుతుంది? మార్చకపోతే ఎలాంటి నష్టముంది? పోలవరం గిరిపుత్రుల బతుకుల్ని శాసించబోతోందా? ఆర్డినెన్స్ ఆదివాసీల బతుకుల్ని ఛిద్రం చేయబోతోందా? భ్రమలు వదిలి, వాస్తవాల్ని క్రిస్టల్ క్లియర్ గా చూద్దాం.
ఆర్డినెన్స్ తో ముంపు గ్రామాల్లో పరిస్థితి
 
ఇప్పుడక్కడ ఎవరూ ఛేదించని నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎవరూ ఓదార్చలేని విషాదం ఆ గ్రామాల్ని నింపుతోంది. అందరి మదిలో ఎన్నో ప్రశ్నలు. మరెన్నో భయాలు. తమ భవిష్యత్తేంటి? తమ జీవితాలేం కానున్నాయి? ఏ మలుపులు తీసుకోబోతున్నాయనే ప్రశ్నలు వారి మనసుల్ని తొలిచేస్తున్నాయి. ఏ తప్పు చేశాం. ఎందుకీ శిక్ష మాకు అంటున్నారు. మా సమాధుల మీద మీ బతుకులు నిర్మించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కళ్లముందు బతుకు చేజారిపోతుంటే, రగిలిపోతున్న గుండెలతో, ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. పోలవరం ముంపు గ్రామాలతో పాటు ఆర్డినెన్స్ తో ఇబ్బందులు పడే గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి ఇది.
నిపుణుల మాట ఎందుకు పట్టదు?
  
అభివృద్ధి అవసరమే. కాదనేవారెవరూ ఉండరు. కానీ, దానికోసం ఏం వెచ్చిస్తున్నామన్నది కూడా ముఖ్యమే. సిమెంటు, ఐరన్, కరెన్సీ నోట్లు మాత్రమే ఖర్చుపెడితే సమస్యేం లేదు. కానీ, లక్షలాది మంది బతుకుల్ని ఛిద్రం చేస్తూ, కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు, ఆకాశం విరిగి నేలమీద పడుతున్నట్టుగా మారితే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ప్రత్యామ్నాయాలున్నాయా అని వెతకాల్సిన అవసరం ఉంది. కనీసం జరగబోయే నష్టాన్ని, విపత్తును తగ్గించే అవకాశాల కోసమైనా చూడాలి. కానీ, ఇక్కడ ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? డిజైన్ మార్చితే వేలాది మంది బతుకుల్ని కాపాడవచ్చని నిపుణులు చెప్తుంటే ఎందుకు పట్టించుకోవటం లేదు?
పోలవరం నిర్మాణంతో లాభమేమిటి? వరాలేమిటి?
  
7 లక్షల 21 వేల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, కృష్ణా బ్యారేజీకి 80 టిఎంసీల నీటి మళ్లింపు, విశాఖ పారిశ్రామిక అవసరాలకు, మరో 543 గ్రామాల తాగునీటి అవసరాలను తీర్చటం ఇదీ బ్రీఫ్ గా పోలవరం ప్రాజెక్టు లక్ష్యాలు. ఇదంతా ప్రాజెక్టు ఎత్తు ముందు అనుకున్నట్టుగా 150 అడుగులు ఉంటే. 30 ఏళ్ల క్రితమే పోలవరం ప్రాజెక్ట్ ప్రతిపాదన వచ్చింది. అంతే స్థాయిలో వ్యతిరేకతలూ వచ్చాయి. వైఎస్‌ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. దీన్ని 150 అడుగుల ఎత్తులో నిర్మించాలనేది ప్రతిపాదన. గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని ఈ నీటిని ప్రాజెక్టుకు మళ్లించడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సగటున 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందన్న అంచనాతో 150 అడుగుల ఎత్తుమేర ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
నష్టాల మాటేమిటి? దానికి సమాధానం ఏమిటి?
  
పోలవరం ప్రాజెక్ట్ గిరిజనుల పాలిట శాపం అనే విషయం అందరూ ఒప్పుకునేదే. పోలవరం నిర్మిస్తే 278 నుంచి 350 గ్రామాల దాకా మునిగిపోతాయనే అంచనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 276 గ్రామాలు, ఛత్తీస్ ఘడ్ లో 10 గ్రామాలు, ఒరిస్సాలో 10 గ్రామాలు ముంపుకు గురవుతాయి. 630 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ప్రాంతం మాయమవుతుంది. 3 లక్షల మంది నిర్వాసితులు కానున్నారు. 2 లక్షల ఎకరాల భూమి, లక్షల ఎకరాల అటవీ భూమి నీట మునగనుంది. అంతేకాదు. ఔషధ విలువలు కల వనమూలికలు, ఖనిజ నిక్షేపాలు నీళ్ల పాలవుతాయి. గిరిజన సంస్కృతి కనుమరుగు కానుంది. ఇదంతా ప్లాన్ ప్రకారం 150 అడుగుల ఎత్తులో కడితే.
ముంపు గ్రామాల భవిష్యత్తేంటి?
  
గత కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం డివిజన్ లోని ముంపు గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలిపే ప్రయత్నం చేసింది. మొదట పోలవరం ముంపు ప్రాంతాన్ని మాత్రమే సీమాంధ్రకు కేటాయించారు. అయితే ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వడం కష్ఠమవుతుందని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్రానికి విన్నవించారు. దీంతో నిర్వాసితుల పునరావాసంపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్యసభలో కేంద్రం హామీ ఇచ్చింది. దీనిపై సమీక్షించిన కేంద్రం ముంపు గ్రామాలున్న ఏడు మండలాలను పూర్తిగా సీమాంధ్రకిస్తే భూపంపిణి ఈజీగా ఉంటుందని భావించింది. దీంతో భద్రాచలం పట్టణాన్ని మినహాయించి మిగిలిన ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ విభజన చట్టానికి సవరణ తెచ్చింది.
పలు సంఘాల అభ్యంతరం
  
కేంద్ర నిర్ణయంపై పలుసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విభజనపై గెజిట్ వెలువడిన తర్వాత కేంద్రం సవరణ చేయడంపై విమర్శలొచ్చాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ సైతం కేంద్ర ఆర్డినెన్స్ న్యాయబద్దం కాదంటూ ప్రణబ్ కు లేఖరాశారు. ఆర్డినెన్స్ ను ఆమోదించవద్దంటూ కేసీఆర్ కూడా రాష్ట్రపతికి లేఖరాశారు. ఒకవేళ ఆమోదించినా దానిపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతం తగ్గుతుందని మరికొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఆర్డినెన్స్ జారీపై రాష్ట్రపతి వెనక్కితగ్గారు.. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్య మళ్లీ మొదటి కొచ్చింది. కొత్త ప్రభుత్వం రానే వచ్చింది. క్యాబినెట్ లో ఆమోదించింది. రాష్ట్రపతి సంతకమూ పూర్తయింది.
నిర్వాసితుల సంగతేంటి? పునరావాసం ఏ మేరకు వర్కవుట్ అవుతుంది?
  
విశాలమైన అడవులే వారి ప్రపంచం. పశుపోషణ, అటవీ ఉత్పత్తులే వారి బతుకులకు ఆదరువు. ప్రకృతి ప్రసాదించిందే పరమాన్నం. కొండ కోనల్లో నుంచి పారేనీరే వారికి అమృతం. అడవి చెట్లు, జంతువులే నేస్తాలు. ఆనందమొచ్చినా, కష్టమొచ్చినా అడవే ఆత్మబంధువు. మరి వాళ్ల భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందా? పోలవరం దెబ్బకి మైదాన ప్రాంతంలో దిక్కులేని వాళ్లవబోతున్నారా? అడవిలో ఎలాంటి కష్టకాలంలో అయినా ధైర్యంగా బతికిన అడవి బిడ్డలు ఇప్పుడు సర్వం కోల్పోబోతున్నారా? చేపకు చెరువు, పక్షికి చెట్టు, పుట్టా… గిరిజనుడికి అడవి. చెరువులోంచి చేపను ఒడ్డున పడేస్తే, ఎట్లా గిలగిలా తన్నుకు చచ్చిపోతుందో, అడవిలోంచి తరిమేస్తే, గిరిజన జాతి కూడా అంతే విలవిల్లాడిపోదా? పరిహారం పేరుతో ఇచ్చే కాసింత సొమ్ము అడవిబిడ్డలు ఉపయోగించుకోగలరా? వాటితో తమ బతుకుని తిరిగి నిలబెట్టకోగలరా? అడవులకు, అడవి బిడ్డలకు విడదీయలేని సంబంధం ఉంది. గిరిజనులు వలస కూలీలుగా మారటం అంటే కేవలం బతుకు కోల్పోవడమే కాదు, వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలను కోల్పోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వం కోల్పోవడం. ఇంత వినాశనానికి గిరిజనులు ఎందుకు బలికావాలి?
పోలవరం ప్రాజెక్టు డిజైన్ కు ప్రత్యామ్నాయం లేదా?
  
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 100 అడుగులకు తగ్గిస్తే ఏమవుతుంది? కొంపలేం మునిగిపోవు. కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రం తగ్గుతుంది. 60 మెగావాట్ల విద్యుత్తే ఉత్పత్తి అవుతుంది. దీని లోటును ఇచ్చంపల్లి, కంబాలపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల ద్వారా తీర్చుకోవచ్చు. 80 టిఎంసీల నీరు కృష్ణా బ్యారేజీకి మళ్లించే అవకాశం ఉంది. ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టులో నిల్వ నీరు తగ్గుతుంది 200 టిఎంసిలకు బదులు 60 టిఎంసిలే ఉంటాయి. అయినా, సర్కారు చెబుతున్న సాగునీటి లక్ష్యం నెరవేరుతుంది. ప్రాజెక్ట్ ఎత్తు 150 అడుగుల నుంచి 100 అడుగులకు తగ్గిస్తే ముంపు నివారణ జరుగుతుందని నిపుణుల వాదన. వాస్తవానికి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనేక వ్యతిరేకతలు వస్తూనే ఉన్నాయి. ముంపుపై ఒరిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్ట్ డిజైన్ మార్పు చేయాలని, ప్రాజెక్ట్ ఎత్తును 150 అడుగుల నుంచి 100 అడుగులకు తగ్గించడం ద్వారా ముంపును నివారించ వచ్చని నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటూనే ఉన్నారు. ముంపు ప్రాంతాన్ని తగ్గించడానికి ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, గుడ్డి సర్కార్లకు ఇవేవీ పట్టలేదు. చడీ చప్పుడు కాకుండా ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపేశారు. కానీ, మరో పక్క సీమాంధ్ర ప్రాంతంలో పోలవరం సర్వరోగ నివారిణి అన్నట్టుగా, ఈ ప్రాజెక్టు కడితే ఆ ప్రాంతం అంతా సుభిక్షం అవుతుందన్నట్టుగా పొలిటికల్ పార్టీలు ప్రచారాలు సాగిస్తున్నాయి. కానీ ఇందులో వాస్తవం ఎంత? కోస్టల్ కారిడార్ లో వచ్చే పరిశ్రమలకు నీటిని అందించటమే ప్రధాన లక్ష్యం కాబోతోందా? ఇందులో వ్యవసాయానికి నీరుఇవ్వటం చిన్న భాగం మాత్రమేననే వాదనలూ ఉన్నాయి.
ఖమ్మంలో ఎందుకు కలిపారు?
  
చరిత్రను పరిశీలిస్తే, గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నప్పుడు భద్రాచలం డివిజన్ పాలనా వ్యవస్థకు అందుబాటులో ఉండేది కాదు. సామాన్యుడు జిల్లా కేంద్రాన్ని చేరుకోవటం చాలా కష్టంగా ఉండేది. అంతెందుకు భద్రాచలం డివిజన్ ని ఖమ్మం జిల్లాలో కలిపేంతవరకు జిల్లా కలెక్టర్ కూడా ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు తప్ప ఒకటి రెండు సార్లు కూడా వచ్చే వారు కాదు. రవాణా అంత కష్టంగా ఉండేది. భద్రాచలం లోని చివరిమండలం నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడ చేరాలంటే, సుమారు 400 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉండేది. అదే ఇక పోలవరం ప్రాజెక్టు కడితే ఈ దూరం 530 కి.మీ కు పెరుగుతుంది. అంతే కాదు భద్రాచలాన్నితెలంగాణలో కాకుండా మిగిలిన ఆంధ్ర రాష్ట్రంలో ఉంచితే భద్రాచలం డివిజన్ వాసులు తమ జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే తెలంగాణ మీదుగా వెళ్లాలి. అంటే ఒక జిల్లా వాసి తన జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్లాలంటే ఒక రాష్ట్రం దాటివెళ్లాలి. ఒకవేళ విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అయితే వారు కొత్తగూడెం మీదుగా విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఏ రకంగా చూసినా ఇది ప్రయాసే అవుతుంది. ఇలాంటి భౌగోళిక, పాలనా సమస్యల దృష్ట్యా భారత ప్రభుత్వం భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తో పొలాలొక రాష్ట్రంలో, ఊరు వేరే రాష్ట్రంలో ఉండే పరిస్థితి నెలకొంది. దీన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం మొదటి నుండి పోరాటం చేస్తూనే వుంది.
గిరిజనుల్లో వ్యక్తమౌతున్న నిరసన
   
ముంపు ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గిరిజనుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయాలను పరిశీలించకుండానే కేంద్రం నిర్ణయం ప్రకటించడంతో ఆదివాసీలు రగిలిపోతున్నారు. న్యాయపోరాటం చేసేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. కెసీఆర్ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలిపేవరకు ఊరుకునేది లేదంటోంది సీపీఎం. సున్నం రాజయ్య ఇదే అంశంపై దీక్షకు దిగబోతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి