30, మే 2014, శుక్రవారం

ఏరువాక పిలుస్తోంది.. అప్పు ఆపుతోంది !


Sakshi | Updated: May 30, 2014 07:31 (IST)
ఏరువాక పిలుస్తోంది.. అప్పు ఆపుతోంది !హైదరాబాద్‌లో జరిగిన బ్యాంకర్ల భేటీలో మాట్లాడుతున్నసీఎస్ మహంతివీడియోకి క్లిక్ చేయండి
* పంట రుణాల మాఫీ ఇంకెప్పుడంటూ రైతుల్లో ఆందోళన
స్పష్టత లేనందున ఏమీ చేయలేమంటున్న బ్యాంకర్ల కమిటీ


సాక్షి నెట్‌వర్క్: ఖరీఫ్ సీజన్ తరుముకొస్తోంది. వారం రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పంట సాగుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన సమయం. కానీ వ్యవసాయ రుణాల మాఫీపై నెలకొన్న గందరగోళం, మరోవైపు బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నారుు. వాస్తవానికి ఈ సమయూనికే రైతులు తమ రుణాలు తిరిగి చెల్లించి కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు తాము తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో  హామీ ఇచ్చింది.

ఆ పార్టీ నేతలైతే రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చారు. కొన్ని చోట్ల పోస్టర్లు ముద్రించి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీయే అధికారం చేపట్టనుండటంతో రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ రుణ మాఫీపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో పలుచోట్ల బ్యాంకులు రుణాలు రీ షెడ్యూల్ చేసుకోవాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారుు. బంగారం తాకట్టుపెట్టి రుణాలు పొందిన రైతులకు సదరు బంగారాన్ని వేలం వేస్తామంటూ బ్యాంకులు ప్రకటనలు జారీ చేస్త్తున్నారుు.

అనంతపురం జిల్లా పుట్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ‘పంట రుణాలు రెన్యూవల్ చేయబడును’ అని నోటీస్ బోర్డులో అతికించారు. మరోవైపు  రూ.46 వేల రుణం తిరిగి చెల్లించకపోతే నగలు వేలం వేస్తామని కొత్తచెరువు మండలం లోచర్లకు చెందిన రైతు శంకర్‌రెడ్డికి నోటీసు జారీ చేశారు. బ్యాంకుల నోటీసుల నేపథ్యంలో రుణాలు సకాలంలో మాఫీ అవుతాయా? ఆలస్యమైతే పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

సాధారణంగా జూన్ నుంచి మొదలుపెట్టి ఆగస్టు వరకు బ్యాంకులు వ్యవసాయ రుణాలు పంపిణీ చేస్తాయి. కానీ ఈసారి రైతులు ఎలాగైనా రుణాలు మాఫీ అవుతాయనే ఆశతో.. బ్యాంకులకు తాము బకాయి ఉన్నామనే విషయూన్నే పూర్తిగా మర్చిపోయారు. ‘మామూలుగా అయితే వడ్డీ కలుపుకుని రుణం మొత్తం ఎంత అరుు్యందో తెలుసుకునేందుకు రైతులు ఈ పాటికే బ్యాంకుల్లో ఆరా తీస్తారు.  కానీ ఈసారి ఇప్పటిదాకా ఒక్కరూ బ్యాంక్ వైపు కన్నెత్తి చూడలేదు’ బ్యాంకుల సిబ్బంది చెబుతున్నారు.

రైతులు రుణమాఫీ కోసం ఎదురుతెన్నులు చూస్తుండటమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. పాత రుణాలు మాఫీ చేస్తే తప్ప... బ్యాంకులు రైతులకు కొత్త వ్యవసాయ రుణాలు పంపిణీ చేసే పరిస్థితి లేదు. జూన్ 8న కొలువు దీరే కొత్త ప్రభుత్వం.. ఆ తర్వాత గానీ రుణమాఫీపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో రాష్ట్రస్థారుు బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చిట్టచివరి సమావేశం ఇదే. ఈ సమావేశంలో రైతులకివ్వాల్సిన కొత్త రుణాలపై బ్యాంకర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అరుుతే రుణమాఫీ అంశంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేని కారణంగా కొత్తగా ఎలాంటి రుణాలు ఇవ్వలేమని బ్యాంకర్లు అశక్తత వ్యక్తం చేశారు.

రుణాల మొత్తం రూ. 1,37,176 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ. 1,37,176 కోట్లు ఉంది. ఇందులో 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర రైతులు తీసుకున్న రుణమొత్తం రూ.87,612 కోట్లు. మిగతా రూ. 49,564 కోట్ల మొత్తం తెలంగాణ జిల్లాల రైతులది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన రైతు రుణ మాఫీ హామీ ప్రకారం సీమాంధ్రకు చెందిన రూ. 87,612 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంది. కానీ దీనిపై సందిగ్ధత కొనసాగుతుండటం, ఎస్‌ఎల్‌బీసీ భేటీ సైతం కొత్త రుణాలపై ఏమీ తేల్చకుండానే ముగియడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

‘రైతులు రుణమాఫీపై ఆతృతతో ఎదురుచూస్తున్నారు. రుణాలు మాఫీ అవగానే ఖరీఫ్ రుణాలు తీసుకోవాలని ఆశతో ఉన్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో రెండో పంట సాధ్యం కాదనే భావంతో వీలైనంత త్వరగా రుణం తీసుకుని ఖరీఫ్‌లో మొదటి పంట అయినా పొందాలని చూస్తున్నారు..’ అని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ రాజేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళనకు  నిదర్శనం.

ప్రభుత్వం హామీ ఇస్తేనే..: ఎస్‌ఎల్‌బీసీ స్పష్టీకరణ
రైతుల రుణ మాఫీపై కొత్త ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఈ ఖరీఫ్‌లో రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని ఎస్‌ఎల్‌బీసీ తే ల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అధ్యక్షతన గురువారం ఎస్‌ఎల్‌బీసీ 183వ సమావేశం జరిగింది. రైతుల రుణమాఫీ చేస్తామంటూ నేతలు ఇచ్చిన హామీని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్ రాజేంద్రన్ గుర్తు చేశారు. రైతులకు సంబంధించి పంట రుణాలు (క్రాప్‌లోన్స్), బంగారం తనఖా పెట్టి వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలు, దీర్ఘకాలిక రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రుణాలు కూడా ఉన్నాయని.. ఏయే రుణాలు రద్దు చేస్తారో ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు. రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందనే విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘సక్రమంగా రుణాలు చెల్లించిన వారికా? లేక రుణాలు చెల్లించకుండా బకాయి పడిన రైతులకా? రుణమాఫీకి ఎవరెవరు అర్హులు..?’ అనే అంశాలపై స్పష్టత అవసరమన్నారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ..  ’ఖరీఫ్ అత్యంత ముఖ్యమైన సీజన్. రైతులకు సకాలంలో రుణాలు అందకపోతే వ్యవసాయ ఉత్పత్తి మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతాంగానికి ఇది మరీ సంక్లిష్టమైన సమయం. అందువల్ల రుణమాఫీ వరకు వేచి చూడకుండా కనీసం అర్హులైన రైతులకైనా రుణాలు మంజూరును వేగవంతం చేయాలి’ అనిబ్యాంకర్లకు సూచించారు.

దీంతో రుణ మాఫీపై స్పష్టత ఇచ్చే వరకూ బకాయిదారులకు కొత్త రుణాలు ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పిన బ్యాంకర్లు.. ఇప్పటివరకు రుణాలు తీసుకోని, అప్పులు చెల్లించిన రైతులకు మాత్రం యథాప్రకారం ఖరీఫ్ రుణాలు ఇస్తామని తెలిపారు. కాగా, సాధారణంగా ప్రతియేటా జూన్ నుంచి కొత్త రుణాలు తీసుకుంటుంటారని, కానీ ఈ ఏడాది ఇప్పటివరకూ ఒక్క రైతు కూడా అప్పు చెల్లించలేదని కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన బ్యాంకర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. రుణాలు మాఫీ అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి