అలనాడు
భగీరథుడు తన పూర్వీకులకు స్వర్గప్రాప్తి కోసం గంగమ్మను దివి నుంచి భువికి
తెచ్చాడంటారు. కురియన్ కోట్లాది భారతీయుల నోటిలో పాలుపోయడానికి క్షీరగంగనూ
అలాగే నడిపించాడు. అమూల్ పాలడబ్బాలపై కనిపించే పసిపాప బోసినవ్వు వెనుక ఆయన
కఠోర దీక్ష ఉంది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద పాడి అభివృద్ధి కార్యక్రమ
నిర్మాత’, ‘భారతీయ పాలమనిషి’గా పేరొందిన ఆయన దేశంలో పాలగంగను
ఉరకలెత్తించడానికి చేయాల్సిందంతా చేశారు. కోట్లాది రూపాయల విలువైన అమూల్
బ్రాండ్‌ను నెలకొల్పి దేశంలో పాడి సహకార సంఘాల నమూనాకు పునాదులు వేశాడు.
‘అభివృద్ధి పరికరాలు మనిషి చేతుల్లో పడితేనే మనిషి పూర్తిగా అభివృద్ధి
సాధిస్తాడు’అని ఆయన చెప్పేవారు. తన జీవితాన్ని ‘నాకూ ఒక కల ఉంది’(ఐ టూ
హ్యాడ్ ఎ డ్రీమ్’)లో అక్షరబద్ధం చేశారు.
జీవనయానం: కురియన్ కేరళలోని కోజికోడ్‌లో 1921 నవంబర్ 26న సిరియన్ క్రైస్తవ
కుటుంబంలో జన్మించారు. చెన్నై లయోలా కాలేజీలో 1940లో సైన్స్ డిగ్రీ పూర్తి
చేశారు. తర్వాత చెన్నై గిండీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ
పుచ్చుకున్నారు. కొన్నాళ్లు ‘టిస్కో’(జంషెడ్‌పూర్)లో పనిచేశారు. తర్వాత
డెయిరీ రంగంలో అధ్యయనంకోసం ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందారు. బెంగళూరు
ఇంపీరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ హజ్బెండరీ అండ్ డెయిరింగ్‌లో
ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 1948లో అమెరికాలోని మిచిగన్ స్టేట్ వర్సిటీ
నుంచి డెయిరీ ఇంజనీరింగ్ చిన్న సజ్జెక్టుగా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి
చేశారు. భారత్ వచ్చాక గుజరాత్ ఆనంద్‌లోని ప్రభుత్వ డెయిరీలో ఏడాది
పనిచేశారు. తర్వాత కైరా జిల్లా సహకార పాలఉత్పత్తిదారుల సంఘంలో చేరారు.
డెయిరీ చైర్మన్ త్రిభువన్‌దాస్‌పటేల్ ఓ డెయిరీ ప్రాసెసింగ్ ప్లాంట్
ఏర్పాటుకు సాయపడాలని కురియన్‌ను కోరారు. ఈ క్రమంలో సహకారసంఘం నమూనాలో అమూల్
డెయిరీ ఆవిర్భవించింది. దీని నమూనాలో గుజరాత్ అంతటా సహకార సంఘాలు
ఏర్పడ్డాయి. తర్వాత ఇవన్నీ జీసీఎంఎంఎఫ్ కిందికి వచ్చాయి. కురియన్ ఈ సంస్థకు
వ్యవస్థాపక అధ్యక్షుడు.
సహకార పాడికి శ్రీకారం: ఆనంద్
డెయిరీలో పనిచేస్తూ కురియన్ పాడిరంగంలో సహకార సంఘాలకు శ్రీకారం చుట్టారు.
భారత పాడి పరిశ్రమ రూపురేఖలను మార్చేశారు. పాడి రైతుకు సాధికారత
చేకూర్చడానికి కురియన్ ఎంతో శ్రమించారు. గేదె పాలతో తొలిసారి పాలపొడిని
తయారు చేసిన ఘనత కూడా ఆయనదే. అదివరకు ఆవుపాలతోనే పాలపొడిని తయారు చేసేవారు.
కురియన్ తన ఉద్యమానికి గుజరాత్‌ను వేదికగా మార్చుకున్నారు. రాష్ట్రంలో
1946లో రెండు డెయిరీలతో కో-ఆపరేటివ్ యూనియన్ ఏర్పడింది. ఇప్పుడు వీటి సంఖ్య
16,100. వీటిలో 32 లక్షల మంది సభ్యులున్నారు. కురియన్ వీటి అభివృద్ధికి,
తద్వారా, పాడి రైతుల స్వావలంబన కోసం వ్యవస్థలకు, సంఘాలకు రూపకల్పన చేశారు.
‘అమూల్’ ప్రగతికి ముచ్చటపడిన నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అమూల్
నమూనాలో జాతీయ పాడి అభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ)ని స్థాపించి, దానికి
కురియన్‌ను చైర్మన్‌గా నియమించారు. పాల దిగుబడిని పెంచేందుకు ఎన్‌డీడీబీ
1970లో కురియన్ సారథ్యంలో దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఫ్లడ్’ ప్రారంభించింది.
అమూల్ నమూనాలో సహకార సంఘాలు స్థాపించి దేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలో
అగ్రస్థానంలో నిలబెట్టింది. ఫలితంగా 1960లలో ఏడాదికి 2 కోట్ల మెట్రిక్
టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2011 నాటికి 12.2 కోట్ల మెట్రిక్ టన్నులకు
చేరింది.
పదవులు: కురియన్ 1973 నుంచి 2006 వరకు జీసీఎంఎంఎఫ్‌లో,
1979-2006 మధ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్(ఐఆర్‌ఎంఏ)లో వివిధ
హోదాల్లో పనిచేశారు. 1965 నుంచి 1998 వరకు ఎన్‌డీడీబీ చైర్మన్‌గా
వ్యవహరించారు.
పురస్కారాలు: పద్మశ్రీ(1965), పద్మభూషణ్(1966),
పద్మవిభూషణ్(1999), వరల్డ్ ఫుడ్ ప్రైస్, రామన్ మెగసెసె, కార్నెగీ వాటలర్
వరల్డ్ పీస్ ప్రైజ్, ఇంటర్నేషనల్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ తదితరాలు.
పాలంటే ఇష్టం లేదు..
పాలధారల కోసం అహర్నిశలు శ్రమించిన కురియన్‌కు చిత్రంగా పాలంటే గిట్టదు.
పాలు తాగేవారు కాదు. ‘నాకు పాలంటే ఇష్టం లేదు. అందుకే తాగను’ అని కురియన్
నిత్యం చెప్పేవారు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి