22, సెప్టెంబర్ 2012, శనివారం

వాల్‌ మార్ట్‌ - అక్కడ మూత.. ఇక్కడ మోత!



తన పాలక కూటమి భాగస్వాములే సమర్థించలేకపోతున్న నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నిస్సంకోచంగా ఆకాశానికెత్తేస్తున్నారు. బలహీనుడని చాలా మంది పొరబాటుగా అభివర్ణించే ప్రధాని నిజానికి అమెరికా ప్రయోజనాల విషయానికి వచ్చే సరికి వీర కేసరిగా విజృంభిస్తాడని అణు ఒప్పందం సమయంలోనే రుజువైంది. ఎప్‌డిఐ వ్యవహారం దానికి కొనసాగింపే.
విచిత్రమేమంటే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఎఫ్‌డిఐ నిర్ణయాన్ని ప్రకటించి వాల్‌మార్ట్‌ వంటి వాటికి ఆహ్వానం పలికిన రోజునే న్యూయార్క్‌లో అతి పెద్దదైన వాల్‌మార్ట్‌ దుకాణానికి తాళం పడింది.అట్లాంటా సిటీస్‌ అనే ప్రముఖ వెబ్‌పత్రిక ఆ రోజున ఇలా శీర్షిక ఇచ్చింది:'మృత్యు విహారం: వాల్‌ మార్ట్‌ తాకిడికి చిల్లర దుకాణాలు దుంప నాశనం' అని పేర్కొంది
జూన్‌ 30న అమెరికాలోని మరో సంపన్న నగరం లాస ్‌ఏంజల ్‌్సలో వేలాది మంది ప్రజానీకం ' వాల్‌మార్ట్‌ అంటే దారిద్య్రం అని నినాదాలిస్తూ పెద్ద ప్రదర్శన చేశారు.అంతకు ముందు రాజధాని వాషింగ్టన్‌ డిసిలో మరో ప్రదర్శన జరిగింది. వాల్‌మార్ట్‌ వద్దు వద్దు అన్నది ఇప్పుడు అక్కడ పెద్ద నినాదంగా మార్మోగుతున్నది. వాల్‌మార్ట్‌
చిన్న వ్యాపారులను దెబ్బ తీస్తుందనే ఈ నిరసనలు ఒక వైపున పెల్లుబుకుతుంటే లాస్‌ ఏంజిల్స్‌ పాలక మండలి మాత్రం మన వాళ్లలాగే ముందు రోజున వారి భవన సముదాయానికి అనుమతి నిచ్చిందట. అయితే తర్వాత నిరసనలు దాన్ని సాగనీయడం లేదు. అట్లాంటాసిటీ వ్యాసంలో వివరాల ప్రకారం చూస్తే వాల్‌మార్ట్‌ 2006లో చికాగో పరిసరాలలో ప్రవేశించిన తర్వాత అక్కడున్న 306 దుకాణాలలోనూ 82 మూతపడ్డాయట. నిజానికి అది ప్రవేశించిన చోట వున్న దుకాణాలపై ప్రభావం 35 నుంచి 60 శాతం వరకూ వుంటుందని 'ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ క్వార్టర్లీ' చెబుతున్నది.మందుల దుకాణాలైతే ఒకో మైలుకు 20 శాతం, ఫర్నిషింగ్‌ షాపులైతే 15 శాతం, హార్డ్‌వేర్‌ 18 శాతం, బొమ్మల దుకాణాలు 25 శాతం చొప్పున కూలిపోయాయి. న్యూయార్క్‌ సిటీ పబ్లిక్‌ అడ్వకేట్‌ 2010లో చేసిన అధ్యయనం ప్రకారం వాల్‌మార్ట్‌ రెండు ఉద్యోగాలు కల్పిస్తే మూడు హరీమంటాయి. (ఇది అమెరికా లెక్క. ఇండియాలో ఈ శాతం చాలా ఎక్కువగా వుంటుంది) వాల్‌ మార్ట్‌ ముందస్తుగా కొని నిల్వ వుంచుకోవడం వల్ల 2008లో బియ్యం ధరలు మూడు రెట్లు పెరిగాయని అధికారిక అంచనా. అలాగే గోధుమలు కూడా. కనక ఎఫ్‌డిఐ నిర్ణయానికి సమర్థనగా చేసే వాదనల్లో అధిక భాగం అసత్యాలే.

సర్కారు నివేదికలోన్లే సత్యాలు

మన రాష్ట్రంలో లోక్‌సత్తా నేతలతో సహా కొందరు చిల్లరలో ఎఫ్‌డిఐ ల వల్ల రైతాంగానికి లాభం జరుగుతుందని వాదిస్తున్నారు.అమెరికాలో రైతులకు సబ్సిడీలే ఆధారమవుతున్న తీరు ప్రధాన కథనంలో చూశాం. ఈ వాదనను యుపిఎ ప్రభుత్వ హయాంలో వచ్చిన నివేదికలే తోసిపుచ్చుతున్నాయి. 11వ ప్రణాళికకు సంబంధించిన వర్కింగ్‌ గ్రూపు నివేదిక, పార్లమెంటు 19వ స్తాయి సంఘ నివేదిక చిన్న సన్నకారు రైతులు అత్యధికంగా వున్న మన దేశానికి వాల్‌మార్ట్‌ వల్ల మేలు గాక కీడే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. 5.9 కోట్ల రైతాంగ కుటుంబాలు(32 కోట్ల మంది గ్రామీణులు) అయిదు ఎకరాల లోపు కమతాలపై ఆధారపడి బతుకుతున్నారు. అదే అమెరికాలో కమతాలు 250 రెట్టు, ఆస్ట్రేలియాలో కమతాలు 4000 రెట్లు పెద్దవిగా వుంటాయి.60 శాతం ఆహార పదార్థాలు రైతులు వ్యవసాయ కార్మికులు వస్తు మార్పిడి పద్ధతిలోనే వినియోగిస్తారు.వాణిజ్య మార్కెట్‌కు వచ్చేది 40 శాతం మాత్రమే. కనక వాల్‌మార్ట్‌ దాడితో ఆహార భద్రత కూడా దెబ్బతింటుంది అని ఆ నివేదికలు తెలిపాయి.ఆఖరుకు సంస్కరణలలో మన్మోహన్‌కు కుడి భుజం లాటి మాంటెక్‌ సింగ్‌ ఆహ్లూవాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం నివేదిక కూడా చిన్న రైతులపై పడే ఈ ప్రభావాన్ని పేర్కొనక తప్పలేదు.
చిల్లరలో ఎప్‌డిఐల వల్ల చిన్న రైతులు చిన్న వ్యాపార కుటుంబాలు కూడా చితికిపోతాయనేందుకు ఈ ఆధారాలు చాలవా? ఇంతకూ చిల్లర కొట్టు పెట్టడానికి కూడా విదేశాలను ఆహ్వానించేట్టయితే ఇక మన ఆర్థికాభివృద్ధి గురించిన అతిశయోక్తులెందుకు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి