22, సెప్టెంబర్ 2012, శనివారం

అంతర్జాతీయ సభలో డీజెల్ రేట్లపై ప్రధానికి నిరసన


ఫొటో: ది హిందూ
న్యూ ఢిల్లీలో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మన్మోహన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ‘ఆసియాలో ఆర్ధిక వృద్ధి, కార్పొరేట్ వాతావరణంలో మార్పులు’ అన్న అంశంపై జరిగిన సమావేశంలో ప్రధాని ప్రసంగించడానికి లేచినపుడు సుప్రీం కోర్టు అడ్వకేటు ‘సంతోష్ కుమార్’ చొక్కా విప్పి నిరసన తెలిపాడు. పెంచిన డీజెల్ ధరలని తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాడు. నినాదాలతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్ది నిమిషాలు ఆపవలసి వచ్చిందని ‘ది హిందూ’ తెలిపింది.
న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ‘Conference on Economic Growth in Asia and Changes of Corporate Environment’ పేరుతో శనివారం సభ జరిగింది. ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సభలో డయాస్ మీదికి వచ్చి ప్రసంగించడానికి ఉద్యుక్తుడవుతుండగా, సుప్రీం కోర్టులో లాయర్ గా పని చేస్తున్న సంతోష్ కుమార్ సుమన్ (32) లేచి నిరసన తెలిపాడు. తన ముందు ఉన్న బల్లపై నిలబడి చొక్కా విప్పేశాడు. “ప్రధాని మంత్రీ, వెనక్కి వెళ్లండి! పెంచిన డీజెల్ ధరలని ఉపసంహరించండి!” (ప్రధాన్ మంత్రి వాపస్ జావో! వాపస్ లో! వాపస్ లో! డీజెల్ పర్ వృద్ధి వాపస్ లో!) అని నినాదాలు ఇవ్వడం ప్రారంభించాడు. (వీడియోను ఇక్కడ చూడవచ్చు.)
నినాదాలు విన్న నలుగురైదుగురు భద్రతాధికారులు అప్రమత్తం అయ్యారు. విజ్ఞాన్ భవన్ లోని ప్లీనరీ హాల్ లో నిరసన తెలుపుతున్న సంతోష్ కుమార్ వద్దకు పరుగు పరుగున చేరుకున్నారు. కిందికి లాగి నోరు మూసి బైటికి తీసుకెళ్ళారు. సంతోష్ కుమార్ నినాదాలు ఇస్తున్న దృశ్యాన్ని టి.వి చానెళ్ళు కూడా ప్రసారం చేశాయి. సంతోష్ ని బైటికి తీసుకెళ్ళేవారకూ ప్రధాని తన ప్రసంగం మొదలు పెట్టకుండా వేచి చూశాడు.
సంతోష్ ని బైటికి లాక్కెళ్ళిన భద్రతాధికారులు, అతనిని పోలీసులకి అప్పజెప్పారు. రాష్ట్రీయ జనతాదళ్ (లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ) జారీ చేసిన గుర్తింపు పత్రంతో సంతోష్ సభకు హాజరయ్యాడనీ, ఆయన చేసిన మోసం ఏదీ లేదనీ పోలీసులు చెప్పినట్లు పత్రికలు తెలిపాయి. విచారణ అనంతరం పోలీసులు సంతోష్ ని విడుదల చేసినట్లు తెలుస్తోంది. నిరసనకారుడిని వేధించవద్దని ప్రధాని కోరినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.
చిల్లర వర్తకంలో 51 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సత్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. డీజెల్ ధరలను ఒకేసారి ఐదు రూపాయల వరకూ పెంచడంపై కూడా నిరసన వెల్లువెత్తింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 20 తేదీన ‘భారత్ బంద్’ జరిగినప్పటికీ తన ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి ‘ప్రజల చేత ప్రత్యక్షంగా ఏనాడూ ఎన్నుకోబడని’ మన్మోహన్ సింగ్ నిరాకరిస్తున్నాడు.
పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలకు మేలు చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రధాని చేసిన కువాఖ్యలపై కూడా విమర్శలు చెలరేగాయి. ‘డబ్బులు చెట్లకు కాయవు కదా!’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అనేకమంది రాజకీయ నాయకులు, మేధావులు ఖండించారు. ఈ నేపధ్యంలోనే 14 దేశాల ప్రతినిధులు హాజరైన అంతర్జాతీయ సభలో సైతం నిరసన గళాలు వినిపిస్తున్నాయి.
నిరసనకారుడిని వేధించవద్దని ప్రధాని విన్నపం చేయడం హాస్యాస్పదం. 25 కోట్ల జనాభా ఆధారపడి ఉన్న చిల్లవర వర్తకాన్ని వాల్ మార్ట్ లాంటి రాకాసులకు ప్రసాదంగా నివేదించిన ప్రధాని, ఆర్ధిక మంత్రిగా పదవీ స్వీకారం చేసినప్పటినుండీ 22 సంవత్సరాలుగా దేశ ప్రజలను వేధించుకు తింటున్నాడు. ఋణ సంక్షోభంలో ఉన్న యూరోప్ ని, కుంటుతూ నడుస్తున్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధని నేరుగా మేపడానికి మన్మోహన్ నిర్ణయాలు ఉద్దేశించబడ్డాయని బి.జె.పి లాంటి పార్టీలే చెబుతున్నాయి. అలాంటి మన్మోహన్ ఓ పక్క దేశ వనరులను, ఆదాయ మార్గాలను విదేశీ కంపెనీలకు అప్పజెపుతూ, మరో పక్క ‘డబ్బులు చెట్లకు కాయవు’ అంటూ దేశ ప్రజలకి నంగనాచి కబుర్లు చెప్పడం తీవ్ర బాధ్యతారాహిత్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి