మీరు వేసవి సెలవుల్లో చల్లని వెన్నెల కోసం వేచి చూడాక్కర్లేదు. ఏకంగా ఆ
జాబిలి మీదికే టూర్ వేయొచ్చు. శ్రీహరికోటలో రాకెట్ ఎక్కి చందమామ మీద
దిగొచ్చు. అక్కణ్ణుంచి ఓ బస్సెక్కి పెద్ద ఉల్కాబిలం పక్కనే ఉన్న రిసార్ట్
లో బస చేయొచ్చు. మీ పార్ట్ నర్ తో ఓ వారం రోజులు సరదాగా గడపొచ్చు.
జాబిలి.. ఈ పేరులోనే ఏదో రొమాంటిక్ టచ్. ప్రియురాలు అడిగిందని నెలవంకని
తెచ్చి ఆమె జడలో తురమలేక పోవచ్చు. కానీ తనకు సర్ ఫ్రైజ్ ఇచ్చేందుకు ఆ
నెలవెంక మీదకే తీసుకెళ్లొచ్చు. పిల్లాడు మారాం చేస్తే అమ్మ ఇక ‘చందమామ
రావే.. జాబిల్లి రావే’ అంటూ పాడాక్కర్లేదు. అద్దంలో చూపించి ఆశ
పెట్టక్కర్లేదు. ఆ చిన్నారిని నేరుగా ఆ వెన్నెల రేడు మీదికే
తీసుకెళ్లొచ్చు. చందమామలో ఆ మచ్చేంటి? ఆ నీలాకాశంలో ఏముంది? కొన్ని యుగాల
నుంచి అవి మనిషి ఆలోచనలను ఆక్రమించుకున్నాయి. అంతులేని ఈ అంతరిక్షంలో ఎన్నో
చిక్కు ప్రశ్నలు.. వాటిని తెలుసుకునేందుకు మనిషి ఆరాటపడుతూనే ఉన్నాడు.
చంద్రుడు మామ కాడు.. పిలిస్తే రాడు అని మనిషికి తెలిసిపోయింది. అందుకే తానే
జాబిల్లి వైపు అడుగులు వేశాడు. చందమామకి దగ్గరయ్యాడు.
చంద్రుని మీదికి ఎలా వెళ్లాలో మనిషికి తెలిసింది. అంతరిక్షంలో విహరిస్తే
కలిగే అనుభూతి అర్థమయింది. ఆ అనుభవం అందరికీ కలిగించాలనే కమర్షియల్ థాట్
కూడా వచ్చింది. అందుకే మనిషిప్పుడు అంతరిక్షంలో హోటళ్లు
కట్టాలనుకుంటున్నాడు. చంద్రునిపై కాలనీలు నిర్మించాలనుకుంటున్నాడు.
నమ్మట్లేదు కదూ? అవి ఎలా ఉంటాయో చూపిస్తే నమ్ముతారా? అయితే రండి. ఈ టైమ్
మెషీన్ ఎక్కండి. కాసేపు భవిష్యత్తులోకి తీసుకెళ్తాం.
ఇది మనిషి అంతరిక్షంలో నిర్మించిన ఒక హోటల్. ఇక్కడికి వస్తే ఇప్పటి వరకు
మీరు పొందని ఓ గొప్ప అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మనమిప్పుడు భూమికి ఆరు
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఆరువందల కిలోమీటర్లేనా అని తీసి పారేయకండి.
హైదరాబాద్ నుంచి ముంబై ఉదయం బయలుదేరి మధ్యాహ్ననికి చేరుకున్నంత సులభం కాదు
ఇక్కడికి రావడం. మీరిప్పుడు టైమ్ మెషీన్ లో భవిష్యత్తులోకొచ్చారు. కానీ మీ
చుట్టు పక్కలవారింకా 2013లోనే ఉన్నారు. వారి అంతర్జాతీయ విమానాలు ఎగిరే
ఎత్తు కేవలం 30 నుంచి 35 వేల అడుగులు మాత్రమే. కానీ ఈ రోదసీలోకి రావాలంటే..
భూమికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మన్ రేఖ దాటి రావాలి. ఇప్పుడిక్కడ
భార రహిత స్థితి ఉంటుంది. మనిషయినా వస్తువైనా ఇక్కడ తేలియాడుతూ
కనిపించాల్సిందే. ఇక్కడ మనం నడవడం అంత సులభం కాదు. కానీ ఈ హోటల్ భూమికి
ఆరువందల కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి భార రహిత స్థితి ఇంకా ఎక్కువగా
ఉంటుంది. అందుకే ఇది నిమిషానికి ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి
గురుత్వాకర్షణ శక్తిలో మూడో వంతు శక్తిని సృష్టించుకుంటుంది.
చందమామ మీద మనుషులన్నారు.. హోటళ్లు.. రిసార్టులు అన్నారు. ఇక్కడే
ఆపేశారేంటి? అనుకుంటున్నారా? ఆరు వందల కిలోమీటర్ల వద్దే ఇలా ఉంటే..
చంద్రుడు మనకు మూడు లక్షల 84 వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? రండి ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్దాం.
సూర్యుడి తర్వాత ఆకాశంలో రెండో ప్రకాశవంతమైన బింబం చంద్రుడే. ఇక్కడ
గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఆరోవంతు మాత్రమే. భూమికి
వలే చంద్రుడి మీద వాతావరణం లేదు. చంద్రుడి ఉపరితలాన్ని సూర్యరశ్మి నేరుగా
తాకడం వల్ల పగటి పూట చంద్రుడి మీద ఉష్ణోగ్రత 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు
ఉంటుంది. పగలు తాను గ్రహించిన సూర్యరశ్మిలో 95 శాతం కాంతిని చంద్రుడు
పరావర్తనం చెందిస్తాడు. అందువల్ల రాత్రిపూట చంద్రుడి ఉపరితలం చాలా చల్లగా
ఉంటుంది. ఒక్కోసారి ఉష్ణోగ్రత మైనస్150 డిగ్రీలకు కూడా పడిపోతుంది.
ఉష్ణోగ్రతల్లో ఇలాంటి హెచ్చు తగ్గులను తట్టకుంటూ మనిషి ఇక్కడ జీవించొచ్చని
నలభై యాభై సంవత్సరాల క్రితమే ఊహించాడు. కథలు రాసుకున్నాడు. సినిమాలు
తీశాడు. ఇప్పుడు ఆ కలలు నిజం కాబోతున్నాయి.మనిషిక్కడ ఆవాసాలు ఏర్పాటు
చేసుకోబోతున్నాడు. కాలనీలు కట్టుకోనున్నాడు. మైనింగ్ కాంట్రాక్టులూ
తీసుకోనున్నాడు.హోటళ్లు నిర్మించుకుంటాడు. స్పేస్ ఎస్టేట్ డెవలప్
చేయబోతున్నాడు. రేపు ప్లాట్లు కూడా చేసి అమ్మేస్తాడు. ఆ రోజు మరెంతో దూరంలో
లేదు.
మనిషి ఆశ అంతులేనిది. ఈ అంతరిక్షం అంతం లేనిది. అది అనాదిగా మనిషిని
ఆకర్షిస్తూనే ఉంది. తనలో నిగూఢమైన వింతలూ,విశేషాలతో చంద్రుడు కూడా మనిషిని
ఊరిస్తూనే ఉన్నాడు. ఆ అంతరిక్షంలో విహరించాలని.. ఆ వెన్నెల రేడును
అందుకోవాలని శతాబ్దాలుగా తహతహలాడిన విశ్వమానవాళి కలలు ఎలా సాకారమయ్యాయి.
అది తెలుసుకోవాలంటే.. మనం మళ్లీ వెనక్కి వెళ్లాలి.
డెన్నిస్ టిటో అనే మల్టీ మిలియనేర్ ప్రపంచంలోనే తొలి స్పేస్ టూరిస్ట్
అయ్యాడు. టిటో రష్యా సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్లి అంతరిక్షంలో వారం
రోజుల పాటు గడిపాడు. ఈ ప్రయాణంలో ఆయన ఎక్కువ కాలం ఇంటర్ నేషనల్ స్పేస్
స్టేషన్ లోనే గడిపాడు. ఇందుకోసం టిటో 20 మిలియన్ల డాలర్లు వెచ్చించాడు. ఆ
తర్వాత ఏడాదికి సౌత్ ఆఫ్రికాకు చెందిన బిజినెస్ మ్యాన్ మార్క్ షటిల్ వర్త్,
2005లో అమెరికాకు చెందిన గ్రెగ్ హోల్సెన్ కూడా అంతరిక్ష యాత్రకి వెళ్లారు.
2006లో ఇరాన్ కు చెందిన అనౌహె అన్సారీ అనే టెలీ కమ్యూనికేషన్స్ వ్యాపారి
అంతరిక్ష పర్యటనకు వెళ్లి తొలి మహిళా స్పేస్ టూరిస్ట్ గా
ప్రసిద్ధికెక్కారు.
ప్రపంచంలో ఏదో కొంత మంది మాత్రమే అనుభవించిన అనుభూతిని మీరూ పొందాలను
కుంటున్నారా? మనిషి కొత్తదనం కోరుకుంటాడు. కొత్త ప్రాంతాలను చూడడానికి
ఇష్టపడతాడు. కొత్త అనుభూతిని పొందేందుకు ఉత్సాహం చూపుతాడు. అలాంటి ఓ అద్భుత
అనుభూతిని కల్పిస్తోంది ఈ అమెరికన్ కంపెనీ.
భార రహిత స్థితి వల్ల రోదసీలో తేలిపోయే అనుభూతి కలుగుతుంది. మీరూ ఆ భార
రహిత స్థితిలోకి వెళ్లాలనుకుంటే ముందు అమెరికా వెళ్లాలి. ఎందుకంటే జీరో-జీ
సంస్థ అక్కడే ఈ సేవలు అందిస్తోంది. ఒక్కో టికెట్ ధర ఐదు వేల డాలర్లు.
నిజమైన అంతరిక్ష ప్రయాణానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. రాను
రాను ఈ విమానాలకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రేటు కూడా తగ్గవచ్చు.
బోయింగ్ 727 విమానానికి కొన్ని మార్పులు చేసి ఈ భార రహిత పర్యటనకి
వాడుతున్నారు. 24 నుంచి 34 వేల అడుగుల మధ్య విమానాన్ని 45 డిగ్రీల కోణంలో
పైకీ కిందికీ నడపడం వల్ల జీరో-జీ ఫీలింగ్ కలుగుతుంది.
ఇలా అంతరిక్షంలో విహరించినట్లు అనుభూతిని కాదు నిజంగా రోదసీలోనే
విహరించాలని ఆశ పడుతున్నారా? ఆ ఆశని క్యాష్ చేసుకునేందుకు చాలా కంపెనీలు
రంగంలోకి దిగుతున్నాయి. స్పేస్ హోటళ్ల రూపకల్పనకు ప్రణాళికలు
రాసుకుంటున్నాయి.అందుకే మీ కల నిజమయ్యే సమయం మరెంతో దూరంలో లేదు.
ఇక మీరు ఊటీ, కొడైకెనాల్ వెళ్లి వచ్చినంత సింపుల్ గా అంతరిక్షంలోకి
వెళ్లిరావొచ్చు. అక్కడి హోటల్ లో టిఫిన్ చేయొచ్చు. ఇంకాస్త ఖర్చు చేస్తే ఆ
హోటల్ నుంచి బయటికి వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ జీరో గ్రావిటీని ఎంజాయ్ చేయొచ్చు.
ఎందుకంటే స్పేస్ టూరిజం అతి త్వరలోనే గ్రాండ్ టేకాఫ్ తీసుకోబోతోంది.
ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు చాలా కంపెనీలు నిధులు
సమకూర్చుకుంటున్నాయి. రానున్న ఒకటి రెండు దశాబ్దాలలో వీటిని
రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.వర్జిన్ గెలాక్టిక్ అనే
కంపెనీ ప్రయివేటు టూరిస్ట్ ఫ్లైట్లను స్పేస్ లోకి పంపేందుకు ప్లాన్
చేస్తోంది. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌వేస్ స్థాపకుడైన రిచర్డ్ బ్రాన్సన్
2009 చివరి నుంచి ఈ విషయమై తరచుగా ప్రకటిస్తూనే ఉన్నారు. వర్జిన్
గెలాక్టిక్ నిర్వహించబోయే అంతరిక్ష విహారానికి ఒక మనిషికి దాదాపు 2 లక్షల
అమెరికన్ డాలర్లు అంటే సుమారు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా.
ఇప్పటికే 500 మంది టికెట్లు కొనేశారు. ఈ కంపెనీ వెబ్ సైట్లో ఇంకొన్ని
టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారిలో నలుగురు
భారతీయులూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్పేస్ ఐల్యాండ్ గ్రూప్ అనే
మరో కంపెనీ గుండ్రంగా చక్రంలా ఉండే కమర్షియల్ స్పేస్ హోటల్ ని నిర్మించాలని
చూస్తోంది. భూమికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అంచనా.
నిమిషానికి ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ భూమి గురుత్వాకర్షణ శక్తిలో
మూడో వంతు శక్తిని ఇది సృష్టించుకుంటుంది. ఇలాంటి హోటల్ లో విడిది పొందడం
ఒక గొప్ప అనుభూతి కదా.
చంద్రునిపై ఏకంగా రెస్టారెంట్లను ఏర్పాటు చేసి వేడి వేడి పిజ్జాలను
వడ్డించాలని డొమినోస్ పిజ్జా కంపెనీ వినూత్న ప్యాకేజీని రూపొందిస్తోంది.
డొమినోస్ కంపెనీ రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.
రాబోయే కాలంలో మానవ సమూహాలు చంద్ర మండలంపై ఆవాసం ఉంటాయన్న ఏకైక నమ్మకమే ఈ
ప్రాజెక్టుని నడిపిస్తున్నాయట. స్పేస్ రీసెర్చ్ పెరుగుతూ ఉండడంతో అంతరిక్ష
యాత్రికుల అవసరాలు కూడా పెరుగుతాయన్నది మరో లాజిక్. చంద్రునిపై పిజ్జా
సెంటర్ ఏర్పాటు చేయడమంటే కచ్చితంగా కొంతమంది సిబ్బంది అక్కడే ఉండాల్సిన
అవసరం ఉంటుంది. అందుకే చంద్రునిపై ఉద్యోగం చేసేవారి కోసం కంపెనీ ఇప్పటి
నుంచే ఆరా తీస్తోంది. యూకేకి చెందిన ‘ప్రీమియర్ ఇన్’ అనే బ్రాండెడ్
ఫైవ్‌స్టార్ హోటల్ ఏకైక లక్ష్యం ఫస్ట్ ఎవర్ హోటల్ ఆన్ ది మూన్. 43,500
చదరపు అడుగుల స్థలంలో చందమామ మీద హోటల్ కట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు.. ఈ
హోటల్ ఎమ్‌డీ పత్రిక్ డెమ్సీ చెబుతున్నారు. ఇందుకోసం డిజైనర్లు, ఇంజినీర్లు
బ్లూప్రింట్స్ కూడా రెడీ చేస్తున్నారట. హిల్టన్ అనే కంపెనీది కూడా ఇదే
లక్ష్యం.చంద్రునిపైన కాకున్నా అంతరిక్షంలో కనీసం ఒక శాటిలైట్‌లా ఒక హోటల్
నిర్మించాలని ‘హిల్టన్’ భావిస్తోంది.
ఒకప్పుడు చంద్రునిపై కాలు మోపడం ఒక కల. కానీ ఇప్పుడది నిజమైంది. చంద్రుడు
మనిషికి మరింత దగ్గరయ్యాడు. అంతటితో సంతృప్తి పడితే అతడు మనిషి
ఎందుకవుతాడు? అతని ఆశ అంతులేనిది. హోటళ్లు కట్టాలనుకుంటున్నాడు. స్పేస్
టూరిజం పెంచాలనుకుంటున్నాడు. కానీ ఇది అనుకోగానే సాధ్యమయ్యే పని కాదు.
అందుకోసం శాస్త్రవేత్తలు ఎన్నోముమ్మర యత్నాల చేశారు. చేస్తూనే ఉన్నారు.
దీని ఆరంభం అర్థమవ్వాలంటే మనం ఇప్పుడు గతంలోకి వెళ్లాల్సిందే.
యూరీ గగారిన్.. అంతరిక్షయానం తర్వాత, మనిషి భూమి చుట్టూ కక్ష్యలో
పరిభ్రమించడానికి ఎన్నో ప్రయోగాలు చేశాడు. మరెన్నో మెళకువలు
నేర్చుకున్నాడు. కానీ అతని లక్ష్యం అంతేనా? కానే కాదు. ఇంకా ఏదో కావాలి.
అంతరిక్షం మీద పట్టు సాధించాలి. సుదూర తీరాల్లోని గ్రహాలను చూడాలి. తోక
చుక్కలను అధ్యయనం చేయాలి. చంద్రుని మీదికి వెళ్లాలి. తన కలలను సాకారం
చేసుకోవాలి.
యూరీ గగారిన్ తర్వాత.. ఘెర్మాన్ టిటోవ్ అనే కాస్మోనాట్ దాదాపు 25 గంటల పాటు
అంతరిక్షంలో గడిపాడు. ఈయన ఏకంగా భూమిచుట్టూ మొత్తం 17 సార్లు చక్కర్లు
కొట్టాడు. వోస్కోడ్-2లో వెళ్లిన అలెక్సీ లియొనోవ్ ఏకంగా ఉపగ్రహం నుంచి
బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు
సృష్టించాడు. ఈ వరుస ప్రయత్నాలతో అంతరిక్షం మీద రష్యా సాధిస్తున్నవిజయాలు
అమెరికాకు మింగుడు పడలేదు. దీంతో రష్యా, అమెరికాల మధ్య అంతరిక్ష పోటీ
మొదలయ్యింది. అప్పటి యూఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడి, ఆ దశాబ్దం
చివర్లో చంద్రుడిపైకి మానవుడిని పంపుతామని ప్రకటించారు. అగ్రదేశం
అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదు. ఆ రోజు రానే వచ్చింది...
జూలై 20, 1969
అమెరికా అనుకున్నది సాధించింది. మరో మైలురాయిని దాటింది. నీల్ ఆర్మ్
స్ట్రాంగ్ జాబిలి మీద కాలు పెట్టాడు. మనిషి తొలిసారి చంద్రుని మీద పెట్టిన
అడుగు. ఆ అడుగు చిన్నదే కావొచ్చు. కానీ అది సమస్త మానవాళికి గొప్ప
ముందడుగు. మానవుడి పరిధిని,భవిష్యత్తుపై ఆశల్ని గ్రహాంతరాల్లో చాటి చెప్పిన
తొలి అడుగు. విశ్వాంతరాల పరిశోధనాన్వేషణలో అరుదైన, అద్భుత ముద్ర వేసి
శాస్త్రీయ ఆలోచనలకు, పరిశోధనలకు కావాల్సినంత స్ఫూర్తిని, విశ్వాసాన్ని
మానవాళి మస్తిష్కాల్లో నింపిన అడుగు.
ఆ అడుగు అంతటితో ఆగలేదు. మనిషి ఆశ అంతటితో చావలేదు. ఈ అంతరిక్షంలో
లెక్కనేనంతగా విహరించాలి. కుదిరితే చంద్రునిపై కాలనీలు కట్టుకుని
నివసించాలి. జీవం ఆనవాళ్లు దొరికితే.. అరుణ గ్రహం మీద కూడా ఆవాసాలు ఏర్పాటు
చేసుకోవాలి. ఇతర గ్రహాల మీద ఉన్న అవకాశాలు కూడా వెతకాలి. కల మళ్లీ
మొదటికొచ్చింది. కథనం మళ్లీ ప్రారంభమైంది.
అప్పటి వరకు వ్యోమనౌకలు ఒక్కసారి వాడేందుకు మాత్రమే ఉపయోగపడేవి. దీనికి
ప్రత్యామ్నాయం లేదా? ఒకసారి వినియోగించిన నౌకని మరోసారి వాడలేమా? అనే
ఆలోచనలతో అంతరిక్ష యానంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది.ఇందుకోసం నాసా 1972
నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒక వ్యోమనౌకని తిరిగి వాడే విధంగా
రూపొందించడం అది పెద్ద సవాల్ గా భావించింది.
ఏప్రిల్ 12, 1981
తొమ్మిదేళ్ల ప్రయోగాల తర్వాత నాసా కల నెరవేరింది. అది రూపొందించిన స్పేస్
షెటిల్ ని ఒక్కసారి కాదు.. తిరిగి వందసార్లయినా వాడొచ్చు. దీంతో
అంతరిక్షయానానికి అయ్యే ఖర్చు తగ్గించుకునే వీలు ఏర్పడింది. ఆ తర్వాత
రూపొందిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొత్త ఆశలు రేపింది. ఇది భూమికి
సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదొక పరిశోధనా కేంద్రం మాత్రమే కాదు
మనిషి చేరుకున్న ఒక గమ్యస్థానం. అతని ఆశలకు ఆయువు పోసే ఒక ఆధారం అయింది.
దీన్ని మరింత వాడుకుంటే వ్యోమగాములనే కాదు.. సామాన్య మానవులను కూడా
అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లొచ్చు.
ప్రయివేటీకరణ పరిణామాలు పాయిటివ్ అయినా.. నెగెటివ్ అయినా మానవ జీవితాన్ని
విశేషంగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ లాభం పెట్టుబడి పెట్టిన ఏ కంపెనీదైనా
మనిషి జీవితంలో మార్పు మాత్రం సహజం. అలాంటి ఒక మార్పు కోసం అంతరిక్షాన్ని
ప్రయివేటీకరిస్తే ఎలా ఉంటుంది? ఒక కమర్షియల్ థాట్. అంతరిక్షయాన యోగం కోసం
ఎంతైనా ఖర్చుచేసేవారు ఉన్నారా?
ఎవరైనా పెట్టుబడి పెట్టే ముందు ఒక ప్రైమరీ రూల్ ఫాలో అవుతారు. ‘వచ్చే ఆదాయం
కంటే ఎక్కువగా డబ్బు ఖర్చు చేసి ఎవరూ వ్యాపారం చేయరు. నిజమే.. కోట్లకు
కోట్లు ఖర్చు చేసి అంతరిక్షంలో హోటల్ కడితే అతిథులు రాకపోతే? ఆదాయం
అందకపోతే..దుకాణం మూసుకోవాల్సిందేనా? లేనే లేదు. ‘గెలాక్టిక్ సూట్’ పేరుతో
స్పేస్ హోటల్‌కు ప్లాన్ చేస్తున్న గ్జేవియర్ క్లారామంట్ ఒక అధ్యయనం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది స్పేస్ హోటల్‌లో గడిపేందుకు ఎంత డబ్బు అయినా
ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. మరి ఇంకేం? మొదలెట్టొచ్చుగా...
అంటే.. చంద్రునిమీద, అంతరిక్షంలో ప్రతికూలతలు, అనుకూలతలూ ఉన్నాయి. వాటి మీద
పూర్తిగా అధ్యయనం జరగాలి. ఫలితాల్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడు హోటల్
కట్టాలి. అప్పడు మీరు అక్కడ కాలెట్టాలి.
ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి