1, జులై 2014, మంగళవారం

టీవీ9, ఏబీఎన్ వివాదం


వివేచన: టంకశాల అశోక్
టీవీ9 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లతో తెలంగాణకు ఏర్పడిన వివాదం త్వరలో సమసిపోగలదని ఆశించాలి. ఈ వివాదం ఏర్పడింది యధాతథంగా తెలంగాణకు అని ఇక్కడ అనడానికి తగిన అర్థం ఉంది. కొత్త రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమో కాక అందరూ ఆ రెండు ఛానెళ్ల పట్ల తీవ్రమైన నిరసనతో ఉన్నారు. అక్కడి ప్రభుత్వం, శాసనసభ, అన్ని రాజకీయ పార్టీలు, బయటి సమాజం ఇట్లా అందరికీ, అన్నింటికి కూడా. చివరకు కనీస విజ్ఞత గల తెలంగాణేతరులు సైతం ఆ ఛానెళ్ల ప్రసారాలను విమర్శిస్తున్నారు.
మీడియాకు స్వేచ్ఛ ఉండే మాట నిజం. ఉండటం అవసరం కూడా. ఎందుకోసమో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదే సమయంలో అది హద్దులు లేని స్వేచ్ఛగా సాగాలా? సమాజంలో బాధ్యతలతో నిమిత్తం లేని స్వేచ్ఛ ఉండటం వల్ల మంచి జరుగుతుందా, చెడా? అనే చర్చ దీర్ఘకాలంగా ఉంది. అదే విధంగా, అసలు ఒకరికి ఒక సమాజం స్వేచ్ఛ అంటూ ఏ ఉద్దేశంతో, ఏ ప్రయోజనం కోసం ఇస్తుంది! అటువంటి స్వేచ్ఛ లభింఛే రంగం దానిని ఉపయోగించుకుని సమాజానికి మేలు చేయటం కోసం. అంతే తప్ప ఆ రంగంగాని, ఆ స్వేచ్ఛ గాని సమాజంతో నిమిత్త లేని స్వతంత్ర యూనిట్లుగా మారి యధేఛ్చగా వ్యవహరించుకునేందుకు కాదు. సమాజానికి హాని అయినా సరే చేసి , అదీ మా స్వేచ్ఛ అని చెప్పి, అందువల్ల కలిగే హానిని సమాజం అనుభవించి తీరవలసిందేనని వాదించేందుకు కాదు. 
ఈ పరిస్థితిలో కొన్ని పోలికలను తీసుకురావాలంటే, ప్రజాస్వామిక వ్యవస్థలో స్వేచ్ఛలు, హక్కులు ఒక్క మీడియాకే లేవు. చట్ట సభలకు, న్యాయ స్థానాలకు కూడా ఉన్నాయి. కొన్ని విధాలుగా మీడియా కన్నా వాటికి గల హక్కులు ఎక్కువ అయినప్పటికీ సమాజం ఏ ఒక్కరికీ అడ్డు అదుపు లేని స్వేచ్ఛనివ్వలేదు. తమ పరిమితులను గుర్తించకుండా ఆ విధంగా తీసుకోజూసినపుడు తిరగబడింది. అటువంటి స్థితిలో, ఆ తరహా స్వేచ్ఛ తమకు ఉందని మీడియా భావించినా, ఉండాలని కోరుకున్నా పొరపాటవుతుంది.
మీడియాకు, అధికారంలో ఉండే వారికి, రాజకీయ తరగతికి, ఆధిపత్య వర్గాలకు మధ్య ఒక మేరకు ఘర్షణ ఎప్పుడూ ఉండేదే. అది వాటి స్వభావం వల్ల, నిర్వహించే పాత్రవల్ల ఏర్పడుతుంది. సూటిగా చెప్పాలంటే మీడియా సమాజం వైపు, అన్యాయాలకు గురయ్యే వారి వైపు తన ఫోర్త్ ఎస్టేట్ ధర్మ నిర్వహణలో భాగంగా నిలబడుతుందని, నిలబడాలని భావిస్తాము. పైన పేర్కొన్న తక్కిన వర్గాలు సమాజం కోసం పని చేస్తామంటూనే చేయవని, న్యాయం చేయగలమని హామీ ఇస్తూ అన్యాయం చేస్తాయని అనుభవం చెప్తుంది. కనుక రెండింటి మధ్య ఘర్షణ స్థితి ఉంటుంది. అందువల్లనే ప్రజాస్వామిక వాదులు, మేధావి వర్గాలు, జన సామాన్యం మీడియాను, మీడియా స్వేచ్ఛను బలపరుస్తారు.కాని మీడియా ఇందుకు భిన్నమైన రీతిలో వ్యవహారిస్తే పరిస్థితి ఏమిటి? చట్ట సభలు, కోర్టులు తమ ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తే ఏమిటో ఈవిషయం లోనూ అదే జరుగుతుంది. భిన్నంగా వ్యవహరించిన చట్టసభలు, కోర్టులు సమాజం మద్దతును కోల్పోయి ఏవగింపులకు గురైనట్లు మీడియా కూడా మద్దతు కోల్పోయి ఏవగింపు పాలవుతుంది. అట్లా జరగబోదని, తమకేదో అతీత శక్తి వంటి స్థానం ఉందని మీడియా వారు భావిస్తే అది భ్రమ అవుతుంది, అహంకారమవుతుంది.ఇటువంటి ధోరణులు మీడియాలో కొంతకాలంగా కన్పిస్తున్నాయి గనుకనే సమాజం నుంచి జర్నలిజంపై, జర్నలిస్టులపై అనేక సంవత్సరాలుగా విమర్శలు వస్తున్నాయి. కాని మీడియా వారు ఆ విషయం తెలిసి కూడా ఆత్మ పరిశీలన తగినంత చేసుకోవడం లేదు. తమ తీరును మార్చుకోవడం లేదు. కొద్ది మంది జర్నలిస్టులు నోరు విప్పినా ప్రయోజనం ఉండటం లేదు. విస్తారంగా గల సాధారణ జర్నలిస్టులకు నిర్ణయాత్మక పాత్ర లేనందున వారు చేయగలిగింది లేకపోతున్నది. నిర్ణయాత్మక స్థానాలలో గల వారిలోని అధికుల వైఖరి వృత్తిధర్మానికి, విలువలకు అనుగుణంగా లేకపోవటం వల్లనే సమస్యలు వస్తున్నాయి.వీరు ఇలా వ్యవహరించడానికి రెండు కారణాలున్నాయి. వాటిలో ఒకటి యాజమాన్య ప్రయోజనాలు కాగా, రెండవది స్వప్రయోజనాలు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నది నిరర్ధకమైన చర్చ అనాలి. నిజానికి అలా బేరీజు వేయలేని విధంగా ఉన్నాయి పరిస్థితులు. ఒకవేళ వేయగలిగినా, జర్నలిస్టుల బాధ్యత కాస్త తక్కువని తేలినా అలా తేడాలు చూసి మినహాయింపులు ఇవ్వబూనడం మరొక నిరర్ధకమైన పని. ఎందుకంటే, దైనందిన ఆచరణలో వారివల్ల సమాజానికి కలుగుతున్న హాని, వృత్తి విలువలకు కలుగుతున్న విధ్వంసం యాజమాన్యాలు చేస్తున్న దానికన్నా ఎక్కువగా కనిపిస్తున్నది.వీరికి వీరి ప్రయోజనాలున్నాయి. ఛానెల్ రేటింగులు, పత్రికల అమ్మకాలు ఎక్కువయేట్లు చేస్తే మంచి జీతాలు, ప్రమోషన్లు ఇతర మీడియా సంస్థల నుంచి మెరుగైన ఆఫర్లు వస్తాయి. ఇతరత్రా లభించేవి ఉంటాయి. ఇది కాకుండా, తమకు స్వయంగా ఉండే సైధ్ధాంతిక, కుల, మత, వర్గ, ప్రాంతీయాది అభిమానాల కారణంగా వృత్తి విలువలకు భంగకరంగా వ్యవహరించేందుకు వెనకాడని వారు కూడా చాలా మందే ఉన్నారు.అందువల్ల అనేక సమస్యలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ సారికి ఇదొక జాతీయ సమస్యగా మారింది. అయినప్పటికీ సీనియర్ జర్నలిస్టులు, బాధ్యత తెలిసిన జర్నలిస్టులు, వారి యూనియన్లు, అకాడమీలు పరిస్థితిని చక్కదిద్దడానికి చేయవలసిన ప్రయత్నాలు చేయడం లేదు. నామకార్ధపు చర్యలేవో తప్ప. కనుక పరిస్థితి బాగుపడటం లేదు. పైగా, తాము పెద్దగా చేయవలసింది పెద్దగా లేనట్లు, అన్ని‘పాపాలకు’ కారణం యాజమాన్యాలే అయినట్లు నిందనంతా వారిపై తోసి తమ బాధ్యత అంతటితో తీరిపోయినట్లు వ్యవహరించే ధోరణి ఒకటి బలంగా సాగుతున్నది.ఇప్పుడు టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్ల విషయమై తలెత్తిన సమస్యను కూడా ఈ నేపథ్యంలో చూడవలసి ఉంటుంది. ఈ రెండు చేసిందేమిటన్నది ఇప్పటికే విరివిగా వెలువడినందున ఇక్కడ తిరిగి పేర్కొనడం లేదు. వారి ప్రసారాలు పూర్తిగా వృత్తి విలువలకు భంగకరం, బాధ్యతా రహితం, అనైతికమని చెప్పవలసి ఉంటుంది.ఇందులో అర్ధం కానిది ఒకటున్నది. తెలంగాణ పట్ల, ఆ ఉద్యమం పట్ల, అక్కడి సంసృతి పట్ల సీమాంధ్ర ప్రాంతపు పత్రికలు, ఛానెళ్లు, సినిమాలు వ్యతిరేకంగా, కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శ చాలా కాలంగా ఉంది. అందుకు అక్కడి వారు చిరకాలంగా బాధపడటం గురించి తెలిసిన వారు ఆ మాటను శ్రీ కృష్ణ కమిటీ దృష్టికి తీసుకెళ్లటం, ఆ స్థితికి నిరసనగానే కొన్ని తెలుగు సినిమాలపై దాడులు జరపడం, ప్రజలు ప్రతిక్రియగా తెలంగాణా సంస్కృతిని, పండగలను పట్టుబట్టి ముందుకు తేవడం వంటివన్నీ తెలుసు. వాస్తవానికి ఈ కోణానికి సంబంధించిన నిరసనలు 1969 ఉద్యమ కాలం నుంచి ఉన్నా ఈ విడత ఉద్యమంలో అది విస్తృతమైంది. అనగా, అందుకు సంబంధించిన భావనలు ప్రజల మనస్సులోకి అంత బలంగా వెళ్లాయి.ఇదంతా ఈ రెండు ఛానెళ్ల వారికి తెలియదనుకోలేము. అయినప్పటికీ ఆ విధమైన వ్యాఖ్యలతో ప్రసారాలు ఎందుకు చేసారన్నది అర్థం కాని విషయం. మహా అజ్ఞానం, అంతకు మించిన అహంకారం కలగలిస్తే తప్ప అటువంటింది జరిగే అవకాశం లేదు. వారికి తెలంగాణపై, అక్కడి ప్రజలపై, సంస్కృతిపై అంతటి కక్ష పేరుకుపోయి ఉండాలి. ఇంతకు మించి మరొక వివరణ కన్పించదు.అర్థంకానిది మరొకటి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందూ ఇటువంటివి చేసారు. అప్ఫుడైనా అది అనైతికమేగాని, కనీసం ఆవిధంగా రాష్ర్ట విభజనను ఆపగలమన్న భ్రమలు వారికి ఏవో ఉండవచ్చునని చెప్పుకోవచ్చు. కాని విభజన జరిగి పోయిన తర్వాత ఇంకా మిగిలిందేమిటి.? ఏమీ లేకున్నా ఎందుకీ వికృత ధోరణి? బహుశా అటువంటి మానసిక స్థితి గలవారు అంతకన్నా భిన్నంగా ఎప్పటికీ ప్రవర్తించలేరు కావచ్చు. అటువంటి వ్యవహరణ వల్ల తమ మీడియా సంస్థలకూ, వ్యాపారానికి తెలంగాణలో నష్టం వాటిల్ల వచ్చునన్న గ్రహింపు వారికి కలగలేదంటే, తమ విచక్షణ రాహిత్యం ఏ స్థితికి చేరిందో ఊహించవచ్చు. లేక మీడియా స్వేఛ్ఛ ముసుగులో ఇది గడచిపోగలదన్నది వారి ధీమాయేమో.అందువల్లనే తెలంగాణలో నిరసన ఇంత తీవ్రంగా వ్యక్తమవుతుంది. కొత్తగా రాష్ట్రం ఏర్పడటం, కొత్త ప్రభుత్వం, కొత్త శాసన సభ, దాని తొలి సమావేశాలు, అధిక సంఖ్యలో కొత్త సభ్యులు, వారంతా ఉద్యమంలో పాల్గొని సమస్యలు ఎదుర్కొని వచ్చినవారు, ఏవో కలలతో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్న వారు. ఇదంతా వారికీ, ప్రజలకు ఎంతో సంతోషదాయకంగా, పవిత్రంగా, ఒక పండగగా కనిపిస్తుండిన వాతావరణం. గతం నుండి కూడా తమను అవహేళన చేస్తున్న కొన్ని మీడియా సంస్థలు ఈ పండగ సంధర్భంలోనూ ఆ పని చేయడం, మరింత వికృతంగా చేయటం, వారందరికీ సహజంగానే ఆగ్రహాన్ని కలిగించింది. అందువల్లనే సభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా దానిని ఖండించాయి.మీడియాపై నిషేధాన్ని ప్రజాస్వామిక ప్రియులు కోరుకోరు. ఈ రెండు ఛానెళ్ల ప్రసారాలను నిలిపివేసింది నిజానికి ప్రైవేటు ఆపరేటర్లు తప్ప, ప్రభుత్వ పరంగా కాని, శాసన సభా పరంగా స్పీకర్ కానీ ఇంకా ఏ చర్యలు తీసుకోలేదు. చివరకు స్పీకర్ ఏం నిర్ణయించారన్నది వేచిచూడవలసిన విషయం.దానినట్లుంచి ఆ రెండు ఛానెళ్లు సభకు, సభ్యులకే గాకుండా తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పటం అవసరం. ఇక ముందు తమ పరిధులు, బాధ్యతలు, విలువలను గుర్తెరిగి వ్యవహరించలటం మంచిది. ఈ ఘటన మొత్తం మీడియా రంగానికి గుణపాఠం కావాలి.

1 కామెంట్‌: