1, జులై 2014, మంగళవారం

పగం మనిషి, సగం యంత్రం: మరణంలేని మనిషిని స్రుష్టించబోతున్నారా?


నేను మనిషిని.. మరమనిషిని.. మరణం లేని మనిషిని. జననం.. సహజం.. మరణం సహజం అని మీరనుకుంటారు.జననం.. సహజం... మరణం.. సహజం... అయినా మనిషి మరణాన్నీ జయించాలని తపన పడుతున్నాడు.యుగయుగాలుగా అమరత్వ సాధన కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మృత్యువును జయించాలన్న కోరికతో మనిషి సాగిస్తున్న అన్వేషణ ఇది.


  • తెగిన తోకను బల్లి మళ్లీ సృష్టించుకుంటుంది.
  • తానెందుకు అలా చేయలేకపోతున్నాడన్న తపన.
  • ఈ తపన నుంచే అమరత్వం కోసం ఆరాటం..
  • ఈ తపన నుంచే మరణాన్ని జయించాలన్న పోరాటం..


పుట్టిన ప్రతి జీవీ ఏదో ఒకరోజు గిట్టక తప్పదని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఈ భూమి మీద ఒకే ఒక జీవి ఎప్పటికీ మరణం లేకుండా జీవిస్తోంది. అదేమైనా అమృతం తాగిందా? దానికా వరం ఎవరిచ్చారు? శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆ జీవి ఏది? ఎలా ఉంటుంది?


ఇదిగో ఇదే ఆ జీవి. మరణం అనేది దీని డిక్షనరీలో లేనే లేదు. అవును.. ఇది నిజం. దీని పేరు జెల్లీ ఫిష్. టురిటోప్సిన్ న్యూటిక్యురా అనే జాతికి చెందిన ఈ జెల్లీ ఫిష్ సముద్ర జలాల్లో జీవిస్తుంది. దీని జీవిత చక్రమే చిత్రంగా ఉంటుంది. మిగిలిన అన్ని జీవుల లాగే ఇదీ పెరుగుతుంది. పెద్దదవుతుంది. కానీ ఆ తర్వాతే విచిత్రం జరుగుతుంది. వృద్దాప్యం రాగానే ఇది అన్ని ప్రాణుల్లా మరణించదు.. తిరిగి యవ్వనంలోకి వెళ్లిపోతుంది. మళ్లీ పెద్దదవుతుంది. దీన్నే సైంటిఫిక్ గా చెప్పాలంటే.. అడల్ట్ స్టేజ్ నుంచి పాలిప్ స్టేజ్ కు వెళ్లిపోతుందన్నమాట. అంటే ఈ రెండు దశలు ఒక దాని తర్వాత మరొకటి చక్రంలా తిరుగుతాయి. ఫలింతగా ఈ ప్రాణికి చావన్నదే రాదు. ఒక కణం మరో రకం కణంగా మారడం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మార్పు వల్ల జెల్లీ ఫిష్ వృద్దాప్యాన్ని జయించి, మళ్లీ యవ్వన దశకు వచ్చేస్తుంటుంది. ఇదే లక్షణం కొన్ని జీవుల్లో స్వల్ప స్థాయిలో ఉంటుంది. ఈ కారణంగానే బల్లిలా ఉండే సాలమండర్స్ విరిగిపోయిన కాళ్లను మళ్లీ తెప్పించుకోగలదు. బల్లి కూడా తెగిన తోకను మళ్లీ వృద్ధి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.ఇది కూడా కొంత మేర అమరత్వాన్ని సాధించడమే.
ఒక చిన్న జెల్లీ ఫిష్ అమరత్వాన్ని సంపాదించుకుంటే ఇంత తెలివితేటలున్న మనం ఈ విషయంలో ఎందుకు వెనకబడిపోయాం? పూర్తిగా జెల్లీఫిష్ లాగా జీవిత చక్రాన్ని నియంత్రించుకోలేమా? ఆ బయోలాజికల్ ఫార్ములాను మనం ఉపయోగించుకోలేమా? కనీసం వందల వేల సంవత్సరాలు జీవించే అవకాశం లేదా? ఈ కోణంలో పరిశోధనలు జరిపినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. కొన్ని జంతువులు అనూహ్యంగా ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు తెలిస్తోంది.
అంటార్కిటిక్ ప్రాంతంలో కనిపించే స్పాంజ్.. ఏకంగా 1550 ఏళ్ల పాటు జీవించగలదు. ఆలు చిప్పలు కూడా తక్కువేం తినలేదు. చూడడానికి చిన్నవిగా ఉండే సముద్ర క్యూహాగ్ అనే ఆలు చిప్పలు 405 ఏళ్లు జీవిస్తున్నాయి. ఒక రకం పెద్ద తాబేలు 250 సంవత్సరాలు బతుకుతోంది. కోయి కార్ప్ అనే ఓ రకం చేపలు 226 సంవత్సరాలు జీవిస్తున్నాయి. బౌహెడ్ తిమింగలం ఏకంగా 211 సంవత్సరాలు జీవించినట్లు ఆధారాలున్నాయి. రెడ్ సీ ఆర్చిస్ అనే సముద్ర జీవి హాయిగా 200ఏళ్లు బతుకుతోంది.
మనుషులు మరణాతీతులు కానున్నారా? మనిషి, యంత్రం కలగలిసిన సైబోర్గ్ లు రూపొందుతారా? వారు ప్రపంచంలో ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లగలరా? అంటే... అవుననే సమాధానం వస్తోంది భవిష్యత్తు నుంచి.
రష్యన్ కోటీశ్వరుడు దిమిత్రి ఇట్సుకోవ్ ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఆయన మదిలో మెదిలిన ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే..2045 నాటికి 'టెర్మినేటర్' సినిమాలోలా సగం మనిషి, సగం యంత్రం కలిసిన సైబోర్గ్ రూపొందడం ఖాయమే!? 'అవతార్-,బి, సి, డీ' పేరిట నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. 

అమరత్వం సాధించాలనే  ఏన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాం. ఈ కల 2045లో నెరవే రబోతుంది. 31ఏళ్ల రష్యా బిలియనీర్ డ్మిత్రి ఇట్స్ కోవ్ తన పరిశోధన జట్టు 2020 నాటికి ఓ కృత్రిమ శరీరంలోకి మానవ మెదడును ప్రవేశింప జేసి అవతార్ ను తయారు చేస్తుందని, అది శాశ్వతంగా జీవించే అవకాశం ఉందని డ్మిత్రి చెబుతున్నారు.


కాగా ఈ ప్రాజెక్టుపై ఆయన ప్రపంచ కుబేరులకు డ్మిత్రి బహిరంగ లేఖ రాశారు. మన నాగరికత అమరత్వాన్ని సాధించే టెక్నాలజీకి చేరువైందని, ఇది సైన్స్ ఫిక్సన్ కథ కాదని పేర్కొన్నారు. 2025 కల్లా శాస్త్రవేత్తలు రోబో అస్తిపంజరంలోకి మానవుల మెదడును ప్రవేశపెట్టగలుగుతారని, 2035 కల్లా ఆ బ్రెయిన్‌వల్ల రోబోలో కదలికలు వస్తాయని, 2045 నాటికి మానవుడు పూర్తిగా రోబోలో జీవించగలడని, ఇక ఆ రోబోలకు ఎప్పటికీ మరణం ఉండదని ఇట్స్‌కోవ్ చెబుతున్నారు.మానవుల మెదడును రోబో బాడిలో ప్రవేశపెట్టి అమరత్వం పొందేలా చేసే తన ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రపంచ కుబేరులను కోరుతున్నారు.
తొలిదశలో 2020 నాటికి మానవులు తమ రోబో ప్రతిరూపాలను నియంత్రిస్తారు. 'బ్రెయిన్ మెషీన్ ఇంటర్‌ఫేస్'గా పిలిచే ఈ సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది.


  • రెండో దశలో 2025 నాటికి రోబోకు మనిషి మెదడును అమర్చుతారు.
  • ఇక మూడో దశలో 2035 నాటికి రోబోకు అమర్చిన మనిషి మెదడులోని సమాచారాన్ని పూర్తిస్థాయిలో కృత్రి మ మెదడులోకి చేర్చుతారు. అప్పుడిక పూర్తిగా రోబో మనిషి రూపొందుతాడు. 



ఆపైన 2045నాటికి అసలు మనిషియంత్రం అనేవే లేకుండా పూర్తిగా విద్యుత్ సమాచారం రూపంలోకి మార్చేస్తారు.అవసరమైనప్పుడల్లా.. హోలోగ్రామ్ సాంకేతికతతో తాత్కాలికంగా మానవ స్వరూపాన్ని పొందుతారునెట్‌వర్క్ సహాయం తో ప్రపంచంలో ఎక్కడికైనా కాంతి వేగంతో దూసుకుపోగలరుఈ ప్రాజెక్టు కోసం ఇట్సుకోవ్ ఇప్పటికే 30 మంది శాస్త్రవేత్తలను నియమించుకున్నారుదీనికి మద్దతివ్వాల్సిందిగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌కు లేఖ కూడా రాశారు.



  • 2011లో ఆయన మొదలుపెట్టిన ఈ మహా మానవ పథకానికి ఆయన 2045 ఇనిషియేటివ్ అని పేరు పెట్టాడు.
  • యంత్రమానవుడే మృత్యుంజయుడు.
  • మరణం లేని మనిషి ని సృష్టించడం సాధ్యమా? చాలా సింపుల్..
  • సగం మనిషి, సగం యంత్రం కలబోతగా ఉండే కొత్త ప్రాణిని సృష్టిస్తే సరి.


ఒక సజీవ మైన మెదడు నుంచి ఒక వ్యక్తి బుద్ధిని, చైతన్యాన్ని యంత్రంలోకి మార్పిడి చేయాలన్నదే అంతిమ లక్ష్యం. ఈ రూపంలో అయితేనే ఆ మానవ యంత్రం వ్యక్తిత్వం, స్మృతులు చెక్కు చెదర కుండా శాశ్వతంగా ఇలలో మిగిలి ఉంటాయని డిమిట్రీ భావిస్తున్నారు. రోబో సినిమాలో యంత్రుడిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ సైబోర్గ్ గురించి అర్థమవుతుంది. ఈ యంత్రుడికి నిర్ధిష్ట భౌతిక రూపం ఉండదు. ఇంటర్నెట్ ను పోలిన ఒక విశిష్ట నెట్ వర్క్ లో మాత్రమే ఈ కొత్త అవతారం ఉనికి ఉంటుంది. భూమ్మీద, అంతరిక్షంలో కూడా కాంతి వేగంతో పరిభ్రమిస్తూంటుంది.


ఆధునిక చరిత్రలో అత్యంత ఆశావహమైన ఈ విశిష్ట లక్ష్యానికి అవతార్ అని డిమిట్రీ పేరు పెట్టారు. ఆధునిక విశ్వామిత్రుడు కావాలనుకుంటున్నాడు.


మరణం ఎంతో భయంకరమైనది. అప్పటి వరకు మన మధ్యనే ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి కట్టెలా మారిపోతే ఆ దృశ్యాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆదిమానవుడు రాయి నుంచి నిప్పు పుట్టించాడు. శబ్ధాల నుంచి సంగీతం సృష్టించాడు. కానీ మరణం ఎందుకు వస్తుందో అర్థమయ్యేది కాదు. కానీ ప్రశ్న మాత్రం ఇలాగే ఉండిపోయింది. కాలం మారుతున్నా ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు. నాలుగు వేల సంవత్సరాల క్రితం గిల్గమేష్ అనే సాహసికుడు మరణాన్ని జయించడం కోసం తపించినట్టు చరిత్ర పుటల్లో ఉంది.


గిల్గమేష్ సుమేరియన్ రాజు. నాలుగు వేల సంవత్సరాల క్రితం యురక్ అనే నగరాన్ని పాలించాడు. గిల్గమేష్ శక్తిమంతుడు,అందగాడు.. తెలివైన వాడు. కానీ మొహించిన స్త్రీలను చెరిచేవాడు. ప్రజలను హింసించేవాడు. బాధితుల ఫిర్యాదులు విన్న దేవుళ్ళు గిల్గమేష్ ను ఒక కంట కనిపెట్టడానికి ఎంకిడు అనే భారీ అడవి మనిషిని సృష్టిస్తారు. ఒక సారి ఎంకిడు గిల్గమేష్ మధ్య యుద్ధం జరుగుతుంది. అందులో గిల్గమేష్ గెలుస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులవుతారు. కొంత కాలానికి ఎంకిడు అనారోగ్యం పాలై మరణిస్తాడు. స్నేహితుడి మరణంతో గిల్గమేష్ దుఖంలో మునిగిపోతాడు. స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేని గిల్గమెష్ తన భవిష్యత్తు మరణాన్ని గురించి చింతిస్తాడు. నోవాహు జలప్రళయం నుండి బతికి బయటపడ్డ ఉష్ణాపిస్టిమ్ అనే పూజారిని కలుస్తాడు. ఆయన్ని నిత్యజీవనం కోసం గిల్గమేష్ వేడుకుంటాడు. నిత్యం జీవనం కావాలంటే వారం రోజుల పాటు నిద్రపోకూడదని గిల్గమెష్ కు ఉష్ణాపిస్టిమ్ పరిక్ష పెడతాడు. ఆ పరీక్షలో గిల్గమేష్ విఫలమవుతాడు.ఉష్ణాపిస్టిమ్ భార్య 'యవ్వనంగా ఉండేందుకు సహాయపడే అద్భుతమైన మొక్క' గురించి చెబుతుంది. గిల్గమెష్ ఆ మొక్కను కనుగొని తీసుకెళ్ళి యురక్ లో ఉన్న పెద్దలందరికి పంచి ఇవ్వాలనుకుంటాడు. మార్గం మధ్యలో ఒక సర్పం ఆ మొక్కను దొంగిలిస్తుంది. ఆ సర్పం తన చర్మాన్ని విడిచి మళ్ళీ యవ్వనంగా మారుతుంది. గిల్గమెష్ చివరికి తన నగరానికి ఖాళీ చేతులతోనే వెళ్ళతాడు, తాను నిత్యం జీవించలేనని తెలుసుకుంటాడు.
ఒకసారి హిందూ పురాణాలు తిరగేస్తే ఎంతో మంది పుణ్య పురుషులు వేలాది సంవత్సరాలు జీవించినట్టుగా కనబడుతోంది.రావణాసురుడు వేలాది సంవత్సరాలు జీవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ కోసం రావణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడట. అదే నిజమైతే రావణ బ్రహ్మ ఎంత కాలం జీవించి ఉండాలి.


విశ్వామిత్రుడు ఒక సందర్భంలో దక్షిణ దిక్కుకు వెళ్లి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడనీ, మరోసారి పశ్చిమానికి వెళ్లి మరో పది వేల సంవత్సరాలు తపస్సు చేశాడనీ పురాణాలు చెబుతున్నాయి. తపస్సుకే 20 వేల సంవత్సరాలు వెచ్చిస్తే ఆయన జీవిత కాలమెంత?


దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీర సాగర మథనం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. అమృతం తాగిన దేవతలకు అమరత్వం సిద్ధించింది.


అనేక కారణల వల్ల కోల్పోయిన జీవన ప్రమాణాన్ని తిరిగి సంపాదించుకోవాలని మానవుడు ఆరాటపడుతున్నాడు. ఈ భూమి మీదనే అమరత్వం సాధించిన ప్రాణి ఉన్నప్పుడు మరికొన్ని వేలాది సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు తాను ఎందుకు అమరుడు కాకూడదని మనిషి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.


రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని మొక్కని తీసుకురావడం కోసం బయలుదేరి చివరకు దాన్ని గుర్తించలేక మొత్తం పర్వతాన్నే తీసుకువెళతాడు. నేటి శాస్త్రవేత్తలు అలాంటి మొక్కను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతకణాల్లో జీవలక్షణాలను తీసుకురాగల శక్తి కొన్ని మొక్కల్లో ఉన్నట్లు వారు చెబుతున్నారు. కొత్త కణాన్ని సృష్టించిన మానవుడు అమరత్వాన్ని సంపాదించాలని కూడా తపన పడిపోతున్నాడు. ఎప్పటికైనా మృత్యువును జయించి, వృద్దాప్యం నుంచి తిరిగి యవ్వనాన్ని సంపాదించాలని ఆశ పడుతున్నాడు.


మానవ మేథస్సు పెరుగుతున్నా కొద్దీ ఈ సృష్టిలో కొత్త కొత్త విషయాలు అవగతమవుతున్నాయి. ఎప్పటికైనా మృత్యుంజయులు కావాలన్న మన తపన తీరే రోజు దగ్గర్లోనే ఉందా?


కారణాలు ఏవైనా తాను కోల్పోయిన జీవన ప్రమాణాన్ని మనిషి తిరిగి పొందాలనుకుంటున్నాడు. తన ఆయుష్షును పెంచుకోవాలనుకుంటున్నాడు. అమరుడుగా వెలుగొందాలనుకుంటుంటున్నాడు. మనిషి పక్షిని చూసి గాల్లో ఎగరడం నేర్చుకున్నాడు.. చేపని చూసి నీటిలో ఈదడం నేర్చుకున్నాడు.. కానీ భూమ్మీద మాత్రం మనిషిగా బతకడం మర్చిపోయాడు. ఇప్పుడు జెల్లీ ఫిష్ ని చూసి అమరునిగా బతకాలనుకుంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి