15, జులై 2014, మంగళవారం

2014-15 బడ్జెట్


గెస్ట్ కాలమ్:
గత 67 ఏళ్లుగా ప్రవేశపెడుతున్నట్లే 2014-15 ఆర్థిక సంవత్సరానికి కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాదాపు 18 లక్షల కోట్ల (17.94 లక్షల కోట్లు) రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ జూలై 10న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తంమీద 3.78 లక్షల కోట్ల నికర లోటుతో బడ్జెట్ తయారైంది. వివిధ మార్గాల ద్వారా కేంద్రానికి ఏటా దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 18 లక్షల కోట్లు ఖర్చవుతుంది. పన్ను రూపంలో 13.64 లక్షల కోట్ల రూపాయలు రాగా, ఇతర వనరుల ద్వారా 2.12 లక్షల కోట్లు కేంద్రానికి వసూలు అవుతుంది. జీడీపీ ద్రవ్య లోటు 4.1 శాతంగా ఉంది.గత 67 ఏళ్లుగా తంతు కొనసాగుతూనే వుంది. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో వడ్డిస్తూనే వున్నారు. దేశంలో 60 శాతం మంది దారిద్ర్య రేఖకు అటూ ఇటుగా జీవిస్తున్నారు. 56 శాతం మంది ఈ రోజు ఉదయం కూడా కట్టెలు, పిడకల పొయ్యిలమీదనే వంట చేస్తున్నారు. దాదాపు 50 శాతం మంది చెంబు పట్టుకుని కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబైటకే వెళుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఊరడింపు ఏమిటంటే అదనపు పన్నులు లేకుండా మధ్య తరగతి వారికి ఆదాయపు పన్ను పరిమితిని 2 లక్షల నుండి రెండున్నర లక్షలు పెంచటం జరిగింది. ఇంటి రుణాల వడ్డీకి ఆదాయం పన్ను మినహాయింపునిచ్చారు.రక్షణ, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. పెట్టుబడులకై విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి బీజేపీ ప్రభుత్వం చేసిన స్పష్టమైన ప్రయత్నం ఈ బడ్జెట్‌లో కనిపిస్తున్నది. ఆర్థిక సంస్కరణల అనంతరం వివిధ రంగాల్లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ప్రపంచబ్యాంకు సూచనల మేరకు గత ప్రభుత్వాలు, సంస్కరణలు, అప్పులు చేస్తూనే వచ్చాయి. అయినా దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెద్దగా పెరగలేదు. ఎన్ని చట్టాలున్నా, దేశంలో సంపన్నుల దగ్గర మరింత సంపద పోగుపడింది. వివిధ రాష్ట్రాల్లో ఐఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థల ఏర్పాటు నిధులు కేటాయించారు. దాదాపు 28 రకాల పథకాలకు ఒక్కోదానికి వంద కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు. ఇంత పెద్ద దేశానికి వంద కోట్లు పెద్ద మొత్తం కానేకాదు. దేశ జనాభాకు తలా ఒకరికి రూపాయి చొప్పున పంచితే ఒక్కొక్కరికి రూపాయి కూడా రాదు.దేశంలో వంద 'స్మార్ట్ నగరాలు' ఏర్పాటు చేయడానికి దాదాపు ఏడువేల కోట్లు, గంగానది శుద్ధికి 'నమామి గంగ' పేరుతో 2037 కోట్లు కేటాయించారు. గతంలో గంగ శుద్ధికి కేటాయించిన 20 కోట్ల రూపాయలు గంగలో కలిసిపోయాయి. వాటి ఊసు ఎత్తకుండానే ఇప్పుడు ఈ డబ్బులు కేటాయించారు. నదుల అనుసంధానం కోసం అధ్యయనం చేయడానికి వంద కోట్లు కేటాయించారు. ఈ అధ్యయనానికి గతంలో కూడా కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ధరల స్థిరీకరణకు 500 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఇది మంచిదే కానీ, ఆ డబ్బు ఏ మూలకూ సరిపోదు.స్వాతంత్ర్యానంతర తొలి ఏడు భారతదేశ బడ్జెట్ 993 కోట్ల రూపాయలు ఉండేది. ఇది నిండా వెయ్యి కోట్లు కూడా కాదు. గత ఏడాది యూపీఏ ప్రభుత్వం 17.63 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 67 ఏళ్లలో బడ్జెట్ మొత్తంలో పెరుగుదల విపరీతంగా ఉన్నా జనజీవన ప్రమాణాలు మాత్రం పెద్దగా పెరగలేదు. ఐక్యరాజ్య సమితి జీవన ప్రమాణాల సూచి ప్రకారం 186 దేశాల్లో భారతదేశం 136 స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పేదవారిలో మూడోవంతు మంది పేదలు ఈ పుణ్యభూమిలోనే ఉన్నారు. దేశంలో 60 శాతంమంది పిల్లలకు పోషకాహారం అందడం లేదు. రైతులు, చేతివృత్తుల వారు ప్రతీరోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనబడుతుంది.చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం దేశంలో 10 వేల కోట్లతో నిధిని ఏర్పరుస్తున్నారు. ప్రధానమంత్రి  గ్రామ సడక్ యోజన కోసం 14,389 కోట్లు దళిత అభివృద్ధికి 50 వేల కోట్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి దాదాపు 38 వేల కోట్లు కేటాయించారు. దేశంలో అభివృద్ధి పేరిట ఖర్చు అవుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలే సద్వినియోగం అవుతున్నట్లు గతంలో ప్రధానమంత్రే స్వయంగా చెప్పారు. ఒక అనధికార అంచనా ప్రకారం దేశంలో ప్రతి పౌరుడు నెలకు 1400 రూపాయలను ప్రభుత్వానికి ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా చెల్లిస్తున్నాడు. ఇందులో నాలుగు వందల రూపాయలను మాత్రమే ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుంది. ఈ నాలుగు వందల్లో 15 శాతం అంటే 60 రూపాయలు మాత్రమే సరిగ్గా ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రగతి అంతా ఆ 15 రూపాయల పుణ్యమే.ఈ బడ్జెట్‌లో ద్రవ్యలోటును పూడ్చడానికి పాత అప్పులు తీర్చడానికి కొత్తగా ఆరు లక్షల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. గత ఏడాది 5.63 లక్షల కోట్ల రుణాలను తెచ్చారు. దేశ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 24 పైసలు అప్పు రూపంలోనే వస్తుంది. ఇందులో 20 పైసలు పాత అప్పుల వడ్డీకి చెల్లిస్తున్నారు. గత ఏడాది వడ్డీ చెల్లింపుల కోసం 18 పైసలు కేటాయించారు. అది ఇప్పుడు 20 పైసలకు పెరిగింది. దీంతో కేంద్ర ప్రణాళిక కేటాయింపు ఈ ఏడాది 21 నుంచి 11 పైసలకు తగ్గింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి