- - జి.లచ్చయ్య (సెల్ : 94401 16162)
- 31/03/2013
TAGS:
ప్రధానమంత్రి
మన్‌మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, యుఐడిఎఐ చైర్మన్ నందన్
నిలేఖని, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మోన్‌టెక్‌సింగ్ ఆహ్లూవాలియాలతో
సహా కేంద్ర మంత్రులు ఆధార్ కార్డుల్ని పొందారా...?’ అని సమాచార హక్కు కింద
హైదరాబాద్‌కు చెందిన రాకేష్‌రెడ్డి సమాచారాన్ని కోరగా, అది ‘వ్యక్తిగతం’
అంటూ సమాచారాన్ని ఇవ్వడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
(యుఐడిఎఐ) తిరస్కరించగా, ఈ సమాచారాన్ని పొందడానికి తిరిగి ప్రయత్నిస్తానని
రాకేష్‌రెడ్డి మార్చి 7న మీడియాతో చెప్పారు. ఈ సమాచారాన్ని అడగడానికి
ప్రధాన కారణం- ఈ ఆధార్ నంబర్ (నిజానికి కార్డ్ కాదు) కేవలం వివిధ పథకాల్ని
పొందాలనుకునే వారికేనని, ఈమధ్యన కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు మరి!ఓ స్పష్టత లేకుండా దాదాపు 16 రాష్ట్రాల్లో (ఆం.ప్ర.తో కలిపి) గత సెప్టెంబర్ 2010 నుంచి జనాల్ని నిద్రపోనియకుండా చేస్తున్న ఈ 12 అంకెల నంబరుకై జనాలు క్యూలు కట్టడం, వెంపర్లాడడం, బెంగటిల్లడం జరుగుతున్నది. పైగా ఈ నంబర్‌తోనే వివిధ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీని పొందడానికి తప్పనిసరి అని చెప్పడం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత మార్చి 15కే ఇది తప్పనిసరి అని గ్యాస్ అథారిటీస్ చెప్పడంతో, జనాల్లో మరింత గాభరా మొదలైంది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించడంతో ఈ గడువును ఏప్రిల్ 15వరకు పొడిగించారు. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ పొడిగింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందనేది కాదనలేని సత్యం.
ఇప్పటికే కుటుంబాలకు రేషన్ కార్డు, కొన్ని కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డు, 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటర్ ఐడెంటి కార్డు, బ్యాంకు లావాదేవీలకు, ఆదాయపు పన్ను లెక్కలకు పాన్ కార్డు, బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డును (ఎటిఎమ్), ఆర్‌టిసికి సంబంధించి క్యాట్ కార్డు, వివిధ సంస్థల్లో పనిచేసే వారికి అధికారులచే గుర్తింపుల కార్డులున్నాయి. ఈ కార్డులన్నింటిని దారానికి కుచ్చితే మెడలో వేసుకొనే ఓ దండలా తయారౌతుంది. హైటెక్ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇప్పటికే మెడలో ఒకటి వేలాడుతున్నది.
వీటికితోడు ఆధార్ జత అవుతుందా లేక మిగతా కార్డుల స్థానాల్లో ఈ ఆధార్ అనుసంధానం అవుతుందా అనేదానికి సమాధానం రాబట్టడం కష్టమే! ఈ దేశంలో ఏ పథకం సంపూర్తిగా, సంతృప్తిగా విజయవంతమైన దాఖలాలు లేవు. ఇప్పటికి రేషన్ కార్డులు లేనివారు, పొందలేని వారు ఉన్నారు. ఓటర్ ఐడెంటి కార్డు లేనివారు ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఉన్నారు. వీటిని ప్రారంభించినప్పుడు ఇప్పటిలాగే ప్రభుత్వం హడావిడి చేసింది. జనాన్ని హైరానా పర్చింది. జనం పరుగులు తీసారు. తీరా ఏదీ పూర్తికాలేదు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. పొందిన కార్డులు తప్పుల తడకతో ఉన్న విషయం తెలిసిందే! ఓటరు కార్డుకు ప్రత్యామ్నాయంగా, 16 గుర్తింపుల్లో ఒకదాన్ని చూపి, ఓటరు ఓటువేసే అవకాశాన్ని కల్గించినా, దొంగ ఓట్లను నివారించలేని స్థితి. ఆరోగ్యశ్రీ గాడి తప్పిన పరిస్థితి. ఈ పథకాల ద్వారా లబ్దిపొందే వర్గాలకన్నా వీటిని నిర్వహిస్తున్న యంత్రాంగమే అత్యధికంగా లబ్దిని పొందుతున్నట్లు సర్వేలు చూపుతూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు, ఈ ఆధార్ నెంబర్ వీటిని ఎలా అరికడుతుందనేది ప్రశ్న! ఈ ప్రశ్న సామాన్యులకు కాదు, అధికారులకే ఎదురవుతున్నది.
లక్ష కోట్ల రూపాయల్ని (మల్టీ నేషనల్ సంస్థకు) పోసి నిర్వహిస్తున్న ఈ ఆధార్ లోపభూయిష్టంగా నడుస్తున్న విషయం తెలిసిందే! ఇందులో మూడు అంశాలున్నాయి. ఒకటి చిరునామా, రెండవది వ్యక్తిగత ఫొటో కాగా, మూడవది బయోమెట్రిక్ సమాచారం. ఇందులో చేతుల పదివేళ్ళ ముద్రలు, కండ్లను స్కానింగ్ చేయడం జరుగుతున్నది. కాని ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ఇస్తున్న రసీదులు స్పష్టంగా లేకపోగా, నింపిన సమాచారం సరిచూసుకునే అవకాశం లేకుండా పోతున్నది. పైగా ఈ సమాచారాన్ని పొందుపర్చడానికై కుటుంబాలకు ఒక ఫాంను ఇవ్వడం, అందులో కుటుంబాలకు నింపడం కష్టసాధ్యంగా మారిం ది. వివరాలు నింపాలంటే, ఇంటర్, పై స్థాయి చదువుకున్న వారికే సాధ్యం. దీంతో ఒత్తులు, దీర్ఘాలు అవసరం ఉన్న దగ్గర లేకుండా, లేని దగ్గర ఉంటూ తప్పుల తడకగా నమోదు జరుగుతున్నాయి.
ఇలా ఆధార్ నంబర్‌లోని సమాచారం తిరిగి రేషన్ కార్డుకు, ఓటర్ ఐడెంటీ కార్డుకు పొంతన లేకుండా ఉంటున్నాయి. కొందరికైతే నెలలు గడిచినా నంబర్ రాని స్థితి. వస్తుందో, రాదో తెలియదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు. కనీసం రేషన్ కార్డుకు స్థానిక తహసిల్దార్, ఓటర్ ఐడెంటీకార్డుకు అసెంబ్లీ స్థాయి రిటర్నింగ్ అధికారి (పరోక్షంగా తహసిల్దార్) బాధ్యత వహిస్తుంటే, ఆధార్ నంబర్‌కు ఎవరి సంతకం లేదు. అధికారిత లేదు. పైగా ఆధార్ కేవలం గుర్తింపు ధృవీకరణ మాత్రమేగాని, పౌరసత్వపు గుర్తింపుకాదని, ఆధార్ కార్డ్‌పై స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
ఇక ఈ ‘ఆధార్’తో పొందే సౌకర్యాలు, రాష్ట్రానికొక తీరుగా, జిల్లాకొక తీరుగా ప్రకటించడం జరిగింది. ముందుగా 80 జిల్లాల్లో 80 శాతం రప్రజలకు 34 రకాల సంక్షేమ పథకాల్ని అనుసంధానం చేయాలని అనుకోగా, వాటిని 50 జిల్లాలకు తగ్గించడం జరిగింది. అలాగే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ప్రకటించడంతో ఇటు కుటుంబాలవారు, అటు విద్యార్థులు (వివిధ స్కాలర్‌షిప్స్ పరంగా) ఆందోళన చెందుతున్నారు. పోనీ, ఈ ఆధార్ నంబర్ పొందిన తర్వాత సంక్షేమ పథకాల్ని గాడి తప్పకుండా, దారి మళ్లకుండా, పారదర్శకంగా అమలుచేయగలుగుతారా అంటే ‘కష్టం’ అని అధికారులే పెదవి విరుస్తున్నారు. బయోమెట్రిక్ విధానంతో దొంగల్ని దొరకబట్టవచ్చా, నేరస్థుల్ని పట్టుకోవచ్చా అంటే ప్రశ్నార్థకమే! ఎందుకంటే చేతి వేలి ముద్రలు సరిగా స్కాన్ కావడం లేదని, ఇస్తున్న రసీదుల్లోనే తెలుస్తున్నది. పోతే ఇదో సువిశాల దేశం. కోట్ల జనాభా. దీనికి తోడు బంగ్లా దేశంనుంచి, శ్రీలంక నుంచి, ఈశాన్య రాష్ట్రాల్లోకి పక్క దేశాలనుంచి, కాశ్మీర్‌లోకి పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ నుంచి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా అధికారులు నివాస ధృవీకరణ పత్రాలు ఇస్తూనే ఉంటారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు ఐడెంటి కార్డులు అధికారికంగానే ఇస్తూ ఉన్నారు. కారణం, ఇరు ప్రాంతాల ఓటు బ్యాంకు రాజకీయాల ఒత్తిడికి అధికారులు తలొగ్గడం అనివార్యం కాబట్టి. ఇన్ని భిన్నత్వాలతో గల దేశంలో నేరస్థుల్ని, తీవ్రవాద కలాపాలకు పాల్పడేవారిని పట్టుకోవడం కత్తిమీద సాముకాదా! పైగా ఈ నేరాలకు పాల్పడేవారు అసలు వీటిని పొందక, నకళ్ళను పొందుతారు. ఒకవేళ నేరస్థుడి వేలిముద్రలు లభించినా, అవి ఏ కంప్యూటర్లో దొరకని పరిస్థితే! అలాంటప్పుడు, ప్రభుత్వ ఆలోచన ఎలా సాధ్యమనేది ప్రశే్న!
ఇకపోతే ఈ ఆధార్ పథకం ప్రధానమంత్రి కార్యాలయంది కాగా, దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాతీయ జనాభా రిజిస్టర్ (నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్- ఎన్‌పిఆర్)ను ముందుకు తీసుకొని వచ్చింది. ఈ ప్రక్రియ కూడా మొదలైంది. ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఆధార్, ఎన్‌పిఆర్ రెండు పథకాలు అమలుకాగా, ఉత్తరప్రదేశ్‌లో ఆధార్ లేకపోగా, తమిళనాడులో కేవలం ఎన్‌పిఆర్ మాత్రమే అమలుచేస్తున్నారు. ఆధార్‌కు, ఎన్‌పిఆర్‌కు ఉన్న తేడా అంతా వ్యక్తిగతమే! పోతే ఎన్‌పిఆర్‌లో ఆధార్‌లో ఉండే అంశాలతోపాటుగా (డెమోగ్రాఫిక్, ఫొటో, బయోమెట్రిక్) సెక్యూరిటీకి సంబంధించిన సమాచారం ఉంటుందని అంటున్నారు. కాబట్టి, ఇది ముందుగా దేశంలో 6 నెలలుగా నివసిస్తున్న వారికి, లేదా తర్వాత ఆరు నెలలు ఉండే వారికి మాత్రమే పరిమితం కాగా, ఆధార్ విదేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎన్‌పిఆర్ (దీన్ని రెసిడెన్షియల్ ఐడెంటీకార్డు (ఆర్‌ఐసి) అంటారు) తప్పనిసరిగా చేయబోతున్నట్లు హోంమంత్రిత్వశాఖ తెలపడం గమనార్హం.
ఇలా కేంద్ర మంత్రిత్వశాఖలోనే సమన్వయం లేని పథకాల్ని జనాలపై ప్రయోగించడం నిరంతరం జరుగుతూనే ఉన్నది. అనుకోకుండా 2014 ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం స్థానంలో మరో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే, ఈ రెండు పథకాలకు మంగళం పాడడం, ఖాయమనేది అందరికి తెలిసిందే! వీటి స్థానంలో మరో కొత్త పథకం రావచ్చు! కోట్లాది రూపాయల డబ్బుల మారకంతో జనాన్ని ఆశల పల్లకిపై ఊరేగించడం జరుగుతుంది. ఇండియన్ సివిల్ సర్వీసు చదివిన అత్యున్నత అధికారులు ఇలాంటి పథకాల్ని రచించి, మంత్రుల్నే బురిడి కొట్టించడంలో సిద్ధహస్తులు కాదా! అందుకే ఈ పథకాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, అత్యున్నత స్థాయి అధికారులకు ఇలాంటి ఆధార్‌లు ఆదాయ వనరుగా కొనసాగుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి