2, ఏప్రిల్ 2013, మంగళవారం

సౌర విద్యుత్ ఎంతవరకు పరిష్కారం?


  • -జమలాపురపు విఠల్‌రావు
  • 29/03/2013
రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో తగిన స్థాయిలో కరెంట్ సరఫరా లేక సామాన్యుల నుంచి పరిశ్రమల వరకు తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. ప్రస్తుతం పరిశ్రమలు 40 నుంచి 60శాతం విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతల దెబ్బకు చాలా చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని అంపశయ్యపై నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇక పట్టణాలు నగరాల్లో కూడా తీవ్రస్థాయిలో కోతలు తప్పడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్, సరఫరాల మధ్య తేడా తీవ్ర స్థాయికి చేరుకోవడమే ఈ దుస్థితికి కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కెజి బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడం, ఋతుపవనాలు విఫలం కావడం వల్ల జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోవడం వంటివి విద్యుత్ కొరతకు ప్రధాన కారణమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తు తం ఒక్కసారిగా పెరిగిపోయిన డి మాండ్‌ను తట్టుకునేందుకు 1200 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల సమస్యకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించబోదు. ప్రస్తుతం మన అనుభవం చెబుతున్న పాఠం కూడా అదే! ఇట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు దృష్టి మళ్ళడం సహజం. అణు,పవన, సౌర విద్యుత్, అలల ద్వారావిద్యుదుత్పత్తి ప్రస్తు తం ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నాయి. వీటన్నింటిలోకీ సౌర విద్యుత్ అత్యంత తేలిగ్గా అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలనేది సర్వేసర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభు త్వం ‘సౌరవిద్యుత్ విధానం- 2012’ పేరుతో ఒక విధానాన్ని 2012 సెప్టెంబర్ 26న ప్రకటించింది. ఇదే సమయంలో ఇంటికప్పులపైన సౌర విద్యుత్ ఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియకు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ప్రతి గృహం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అవుతుందన్న మాట! గృహ వినియోగదారుడు తన వాడకంపోను మిగిలిన విద్యుత్‌ను అమ్ముకొనేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే వీలు కల్పించింది. దక్షిణాదిలో మనకంటే ఈ విధానంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
ఆలోచన ఆకాశంలో ఉంటే..ఆచరణ పాతాళంలో కునారిల్లుకుపోవడం స్వాతం త్య్రం వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు నిత్యం మనం చూస్తున్నదే. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ విధానాన్ని ప్రకటించిన తర్వాత ఉత్సాహంగా కొన్ని కంపెనీలు సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. స్పందన బాగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినా... విధానపరమైన అడ్డంకుల వల్ల ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైందని ఆయా కంపెనీలు ఆరోపించాయ. విధానంలో ఇంతవరకు స్పష్టత రాకపోవడం కూడా ఇం దుకు కారణమని చెబుతున్నారు. ఇదిలా వుండగా అంతకు ముందు అనుమతించిన ప్రాజెక్టుపనులు ప్రారంభించాలంటే స్థానిక సమస్యలు అడ్డంకిగా మారడంతో అవి ముందుకు సాగడం లేదు.
సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడానికి ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహించే విషయంలో మహారాష్ట్ర విద్యుత్ సంస్థ ‘మహాజెన్‌కో’ తీసుకుంటున్న చర్యలు చూడటానికి ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ దీనికి స్పందన ఎట్లా ఉంటుందనేది తెలుసుకోవాలంటే కొద్ది కాలం ఓపిక పట్టక తప్పదు. ముఖ్యంగా ఆపరేటర్లను సౌరవిద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి, పాక్షిక యాజమాన్యం కింద నిర్వహించమని మహాజెన్‌కో కోరుతోంది. అంటే ఈ నమూనాలో ఎంపిక చేసిన ప్రైవేటు ఆపరేటర్, ప్లాంటును స్వంత ఖర్చుతో నిర్మించాలి. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఈ ప్రాజెక్టుకు కావలసిన భూమిని, పంపిణీకి సంబంధించిన వౌలిక సదుపాయాలను కలుగజేస్తుంది. తర్వాత ఈ ప్లాంటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి వివరాలు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ పుస్తకాల్లో నమోదు చేస్తారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆవిధంగా నెలకొల్పిన కంపెనీకి ఆపరేటర్ పదేళ్ళపాటు యజమానిగా కొనసాగుతాడు. ప్లాంటు పని ప్రారంభించిన తర్వాత అందుకయిన మొత్తం ఖర్చులో సగం మహాజెన్‌కో ఆపరేటర్‌కు చెల్లిస్తుంది. అందుకోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు మహాజెన్‌కోకు ఋణం మంజూ రు చేస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ఈ విధానాన్ని అమలు పరచబోతున్నది. అయితే ఈవిధంగా నెలకొల్పే ప్లాంటు సామర్ధ్యాన్ని మహాజెన్‌కో మెగావాట్లు లేదా వ్యవస్థాపిత సామర్ధ్యంతో లెక్కగడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అమల్లోకి రాబోతున్నది.
ఇక ఇళ్ళకప్పులపై సౌరఫలకాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. గృహల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల కలిగే లాభాన్ని అర్థం చేసుకోవడానికి టాటా పవర్‌కు చెందిన సాంకేతిక సలహాదారు అవినాష్ పట్కర్ అంచనాను పరిశీలిద్దాం. మన దేశ జనాభా ప్రస్తుతం 120కోట్లు దాటింది. ఒక్కొక్క కుటుంబంలో ఐదుగురు సభ్యులున్నారని భావించినా దేశం మొత్తం మీద 25 కోట్ల కుటుంబాలు లెక్క తేలతాయి. ఈ కుటుంబాల్లో కేవలం ఐదుశాతం మంది.. అంటే ఐదుకోట్ల మంది ఇళ్ళ కప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారనుకుందాం. ప్రతి ఇంటికప్పుపై 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో (గ్రామాల్లో ఈ విస్తీర్ణం ఇంకా ఎక్కువ ఉంటుంది) చదరపుమీటరుకు (1 చదరపు మీటరు= 10.76 చదరపు అడుగులు) 100 వాట్ల వ్యవస్థాపిత సామర్ధ్యం కలిగిన సౌర ఫలకాలను ఏర్పాటు చేసినా..ఒక్కొక్క ఇంటి కప్పు నుంచి రెండు కిలోవాట్ల (రెండువేల వాట్ల) విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు! ఆవిధంగా ఐదుకోట్ల ఇళ్ళ కప్పులనుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తు లక్ష మెగావాట్లు! (వెయ్యి కిలోవాట్లు= ఒక మెగావాట్). ఈ రంగం ప్రాధాన్యత గుర్తించిన పై మూడు దక్షిణాది రాష్ట్రాలు ఆ దిశగా పథకాలను రూపొందిస్తున్నాయి. మరి ఇందుకోసం పెద్ద విస్తీర్ణంలో భూమి అవసరం లేదు. నేడు సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు చాలామంది వెనకాడటానికి ప్రధాన కార ణం, భూమి సమస్యే! అందువల్ల గృహాలపై సౌరఫలకాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రతి గృహ యజమాని ఉత్పత్తిదారుడిగా, వినియోగదారుడిగా మారిపోతాడు. తన ఇంటి నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉచితంగా వినియోగించుకోవడంతో పాటు, అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు కూడా! ఆవిధంగా దీన్నుంచి ఆదాయంకూడా లభిస్తుంది. ఉత్పత్తి అయ్యే ప్రదేశానికి వినియోగ ప్రదేశానికి మధ్య దూరం ఉండకపోవడం వల్ల, పంపిణీ నష్టాలు దాదాపుగా ఉండబోవనే చెప్పాలి. నిర్వహణా వ్యయం కూడా చాలా తక్కువ. అయితే సౌర విద్యుత్ వ్యవస్థను ఇంటికప్పుపై ఏర్పాటు చేసుకోవడానికయ్యే ఖర్చు మాత్రం రూ.2లక్షలు!
2012లో పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్రంలోని ఇళ్ళ కప్పులపై సౌర ఫలకాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిందంటే..ఇందులో ఉన్న లాభాన్ని గుర్తించడం వల్లనే. అంతేకాదు ఇళ్ళ కప్పులపై సోలార్ వాటర్ హీటర్లు అమర్చడం తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇవి వచ్చే ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు గతంలో పదివేల గృహాలకు సౌర ఫలకాలు అమర్చాలన్న లక్ష్యాన్ని, ఈ ఏడాది 75వేలకు పెంచింది.
అయితే ఇంటికప్పులపై సౌర ఫలకాలను అమర్చే వ్యవస్థను ఏర్పాటు ప్రాజెక్టును అమలు పరచే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మొత్తం ప్రాజెక్టే విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును అమలు పరచే క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీకృతం చేయడంలో సమర్ధవంతంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సౌర ఫలకాల్లో ఉపయోగించే ఫోటోవోల్టాయిక్ సెల్స్‌ను నియమిత కాలావధుల్లో ఎప్పటికప్పుడు మెయింటెన్ చేస్తుండాలి. ఈ సెల్స్‌కు ఐదేళ్ళ వారంటీ ఉంటుంది. మరి ఈ సెల్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బయటి రాష్ట్రాల సంస్థలకు కాంట్రాక్టు కట్టబెడితే వారు నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ప్రమాదముంది. దీనివల్ల గృహ వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతాడు. ఒక్కసారి నెలకొల్పిన తర్వాత సౌర ఫలకాలకు ఎప్పటికప్పుడు సర్వీస్ చేయకపోతే అవి దెబ్బతినిపోతాయి. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే సమయంలో వినియోగదారుడు మోసపోయే అవకాశాలు కూడా మెండు! రోజుకు ఇన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కచ్చితంగా జరుగుతుందన్న హామీని, సంబంధిత సంస్థ వినియోగదారుడికి ఇవ్వాలి. తక్కువ నాణ్యత కలిగిన పరికరాలను బిగిస్తే, విద్యుత్ ఉత్పత్తి పడిపోతుంది. అందువల్ల వినియోగదారుడు.. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే సమయంలో, అన్ని పరికరాలు ముందుగా సంస్థ వివరించిన ప్రమాణాల స్థాయిలోనే ఉన్నాయా లేదా అనేదాన్ని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. అంతేకాదు ఈ వ్యవస్థ పనితీరుపై అవగాహనలేని వినియోగదారుడిని, ఆయా సంస్థలు తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ వ్యవస్థలో ఉపయోగించే ఇన్వర్టర్ అమెరికా తయారీది. అందువల్ల దాన్ని మూడు నాలుగుసార్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఇళ్ళకప్పులపై అమర్చే సౌర ఫలకాల నాణ్యతపై ఈ ప్రాజెక్టు విజయవంతమవడం ఆధారపడి ఉంటుందనేని నిష్టుర సత్యం.ప్రతి పథకానికి లాభనష్టాలుంటాయి. కానీ నష్టాలను నివారిస్తేనే లాభా లను అందుకుంటాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి