హైదరాబాద్, ఏప్రిల్ 16 : వైఎస్
చేత... జగన్ కోసం... కేవీపీ రామచంద్రరావు, సాయి రెడ్డి ద్వారా... సునీల్
రెడ్డి సాగించిన వసూళ్ల పర్వం! ఒకవైపు... బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీసు!
మరోవైపు... సచివాలయంలో కేవీపీ కొలువైన డీ-బ్లాక్! వేలకోట్ల
ఒప్పందాలకు... అంతేస్థాయిలో అవినీతికి ఇవే కేంద్రాలు! తెల్లవారుజామున
మొదలై రాత్రిదాకా జరిగే చీకటి ఒప్పందాలకు రహస్య వేదికలు! ఈ 'డీ - క్యాంప్'
రహస్యాన్ని సీబీఐ ఛేదించింది. ఎవరు వచ్చేవారు, ఏం చేసేవారు, ఎలా
చేసేవారు... ఈ ప్రశ్నలన్నింటికీ వైఎస్‌కు నీడలా ఉండే సూరీడు
సమాధానమిచ్చారు.
వైఎస్ హయాంలో సీఎం పేషీని నడిపిన జన్నత్ హుస్సేన్, వైఎస్‌కు ముఖ్య
భద్రతాధికారిగా ఉన్న రమేశ్ కూడా రహస్య భేటీలు సాగిన విధానాన్ని సీబీఐకి
తాము ఇచ్చిన వాంగ్మూలాలలో వివరించారు. అప్పట్లో అన్నీ 'కేరాఫ్ కేవీపీ'
చిరునామాతోనే జరిగేవని ఆయన వద్ద పీఏలుగా పని చేసిన వారు ద్రువీకరించారు.
1977 నుంచి వైఎస్‌తో, ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న సూరీడు... అనేక
సమావేశాలకు ప్రత్యక్ష 'సాక్షి'! 'ఫలానా వ్యక్తి, ఫలానా కారులో వస్తున్నాడు.
గేట్లు తెరవండి' అని భద్రతాధికారులకు 'హుకుం' జారీచేసే స్థాయి ఆయనది!
వైఎస్‌ను కలిసేందుకు వచ్చే అతిథులను సాదరంగా ఆహ్వానించి, లోపలికి
తీసుకెళ్లే బాధ్యత కూడా ఆయనదే!
రోజూ మధ్యాహ్నం సచివాలయంలో వైఎస్, కేవీపీలకు భోజనం వడ్డిస్తూ అప్పుడప్పుడు
'ముఖ్యుల'తో జరిగే సమావేశాల్లోనూ పాల్గొంటూ.. అనేక ముఖ్య ఘట్టాలను కళ్లారా
వీక్షించిన సూరీడు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది.
"కేవీపీ సలహా తీసుకోకుండా వైఎస్ ఏ పనీ చేసేవారు కారు. ప్రభుత్వం ద్వారా
లబ్ధి పొందాలనుకునే వారు మొదట కేవీపీని కలిసేవారు. ఎవరైనా నేరుగా వైఎస్
వద్దకు వెళితే... ముందు కేవీపీని కలవండి అని వైఎస్ చెప్పేవారు.
వైఎస్ క్యాంప్ ఆఫీసుకు ముఖ్యులు, విదేశీ ప్రతినిధులు వస్తే... అక్కడ
కేవీపీ కూడా తప్పకుండా ఉండేవారు'' అని సూరీడు తెలిపారు.
ట్రైమెక్స్ ప్రసాద్, మ్యాట్రిక్స్ ప్రసాద్, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇందు
శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, రాంకీ అయోధ్య రామిరెడ్డి,
నిత్యానంద, రామకృష్ణా రెడ్డి, పార్థసారథి రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితర
పారిశ్రామిక వేత్తలు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి వైఎస్, కేవీపీలను
కలిసేవారని సూరీడు తెలిపారు.
కలెక్షన్ బాధ్యత సునీల్‌దే...
జగన్ భార్య భారతీరెడ్డికి సమీప బంధువు, జగన్‌కు సన్నిహితుడు అయిన సునీల్
రెడ్డి ద్వారా 'వసూళ్ల పర్వం' నడిచేదని సూరీడు పేర్కొన్నారు. "ప్రభుత్వం
నుంచి పనులు చేయించుకున్న వారి వద్ద ఎంత డబ్బు వసూలు చేయాలో కేవీపీ
నిర్ణయించేవారు. సునీల్ రెడ్డి డబ్బులు వసూలు చేసుకొచ్చి.. ఎంత కలెక్షన్
చేసిందీ కేవీపీ, జగన్‌లకు చీటీలపై చూపించి, తర్వాత వాటిని చించేసేవాడు''
అని సూరీడు తెలిపారు.
ఈ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో జగన్, విజయ సాయిరెడ్డి నిర్ణయించేవారని
తెలిపారు. వైఎస్ ఇంట్లో ఖర్చులకు సునీల్ రెడ్డే డబ్బులు ఇచ్చేవారని...
తాను కూడా పలు సందర్భాల్లో రూ.5 లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకున్నానని
తెలిపారు. "సునీల్ రెడ్డికి డబ్బు ఎక్కడిదో తెలియదు. కానీ... అంతంత డబ్బు
ఇచ్చే స్థోమత మాత్రం ఆయనకు లేదు'' అని సూరీడు తన వాంగ్మూలంలో వివరించారు.
సమావేశాల్లో సాయిరెడ్డి: జన్నత్ హుస్సేన్
2004-09 మధ్య జరిగిన తతంగాలను 'దగ్గరి నుంచి' చూసిన మరో అధికారి జన్నత్
హుస్సేన్. ప్రస్తుతం సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా ఉన్న ఆయన... అప్పట్లో
వైఎస్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు. సూరీడు.. ముఖ్యమంత్రి
నిర్వహించే సమావేశాల్లోనూ పాల్గొనేవారని జన్నత్ హుస్సేన్ తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు కేవీపీ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగే కొన్ని
సమావేశాలకు హాజరయ్యేవారని తెలిపారు.
సాయిరెడ్డి సైతం కొన్ని భేటీల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు జన్నత్
హుస్సేన్ «ద్రువీకరించారు. క్యాంప్ ఆఫీస్ నుంచి వైఎస్ నివాసాన్ని
అనుసంధానిస్తూ ఒక ప్రధాన మార్గంతోపాటు జగన్ ఉండే ఇంటిని కలుపుతూ మరో దారి
కూడా ఉందని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాప్ రెడ్డి,
అయోధ్య రామిరెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎన్.శ్రీనివాసన్ (ఇండియా
సిమెంట్స్), కోనేరు ప్రసాద్, సజ్జల రామకృష్ణా రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి
తదితరులు తరచూ క్యాంప్ ఆఫీసుకు వచ్చేవారని తెలిపారు.
సూరీడు చెబితే రైట్ రైట్: రమేశ్
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఐపీఎస్ అధికారి రమేశ్ ఆయన ప్రధాన భద్రతాధికారి
(సీఎస్‌వో)గా వ్యవహరించారు. రోజు మార్చి రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద
విధులు నిర్వహించేవారు. విధి నిర్వహణలో భాగంగా వైఎస్‌కు అత్యంత
సన్నిహితంగా మెలిగేవారు. "ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నా, కారులో
ప్రయాణిస్తున్నా ఆయనకు వచ్చే ఫోన్లను ముందు సూరీడు ఎత్తేవారు.
ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే వారి గురించి సెక్యూరిటీ సిబ్బందికి
చెప్పి, వాహనంతో సహా లోపలికి అనుమతించాలని చెప్పేవారు.
ఇక... కేవీపీ రామచంద్రరావు సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగే కొన్ని రాజకీయ,
అధికారిక సమావేశాల్లోనూ పాల్గొనేవారు. సునీల్ రెడ్డిది ప్రత్యేక స్థానం.
ఎలాంటి తనిఖీలు లేకుండానే ఆయన లోపలికి వెళ్లేవారు. సందర్శకులంతా ప్రధాన
ద్వారంగుండా వస్తే... సునీల్ రెడ్డి మాత్రం రెసిడెన్స్ గేట్ నుంచే
వచ్చేవారు. నిమ్మగడ్డ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి,
ఎన్.శ్రీనివాసన్, కోనేరు ప్రసాద్, సజ్జల దివాకర్ రెడ్డి తదితరులు తరచూ సీఎం
క్యాంప్ ఆఫీస్‌కు వచ్చేవారు'' అని రమేశ్ పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి