16, ఏప్రిల్ 2013, మంగళవారం

శ్రీవారికి 16 కోట్ల విరాళం


తిరుమల, ఏప్రిల్ 16 : తిరుమల వేంకటేశ్వరుడికి మంతెన రామలింగరాజు అనే భక్తుడు రూ.16 కోట్ల విరాళం సమర్పించారు. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త అయిన ఆయన.. మంగళవారం ఉదయం స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో శ్రీనివాసరాజు తదితరుల సమక్షంలో ఈ విరాళాన్ని అందించారు. ఆయన అందించిన విరాళంలో రూ.11 కోట్లతో శ్రీవారికి 35 కిలోల బంగారం కొంటామని బాపిరాజు మీడియాకు తెలిపారు.

రామలింగరాజు కోరిక మేరకు ఆ బంగారంతో శ్రీవారికి అదనంగా సహస్ర నామ మాల తయారు చేయిస్తామన్నారు. మిగిలిన రూ.5 కోట్లను తిరుచానూరులోని అన్నప్రసాద భవన నిర్మాణానికి వినియోగిస్తామని చెప్పారు. శ్రీవారి పాదాల చెంత ధ్యానమందిర నిర్మాణానికి మరో రూ.65 లక్షల విరాళం ఇవ్వడానికి రామలింగరాజు అంగీకరించారని బాపిరాజు చెప్పారు.

వాన్‌పిక్‌లో మోపిదేవి పాత్ర భారీగా భూ సంతర్పణ జరిగింది.. డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్


హైదరాబాద్, ఏప్రిల్ 16: వాన్‌పిక్‌కు భారీగా భూములు కేటాయించిన వ్యవహారంలో అప్పటి మౌలిక వసతులు, ఓడరేవుల మంత్రి మోపిదేవి వెంకట రమణారావు పాత్ర ఉందని సీబీఐ పేర్కొంది. ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. మోపిదేవి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై అభ్యంతరం చెబుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో.. సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. వాడరేవు, నిజాంపట్నం ఓడరేవులకు 2 వేల ఎకరాల చొప్పున, కారిడార్‌కు 24 వేల ఎకరాల భూకేటాయింపు జరుపుతూ ఇచ్చిన జీవోల వెనుక మంత్రి హస్తం కూడా ఉందని స్పష్టం చేసింది.

జగతిలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854 కోట్ల పెట్టుబడు లు పెట్టినందుకు ప్రతిఫలంగా ఆయనకు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్ట్సుకు భూములు కేటాయించారని ఇదంతా క్విడ్ ప్రో కో విధానంలో జరిగిందని తెలిపింది. వాన్‌పిక్ ప్రాజెక్టు మెమొరాండంను మంత్రి మోపిదేవి ఆమోదించారని, దానిని 2008 జూన్ 30న కేబినెట్ ముందు పెట్టారని సీబీఐ తెలిపింది. అయితే, ఈ మెమొరాండానికీ వాన్‌పిక్‌కు పలు రాయితీలు కల్పిస్తూ తయారు చేసిన ముసాయిదా పత్రానికి తేడా ఉందని, ఆ రెండింటిలో సమాచారం వేర్వేరుగా ఉందని పేర్కొంది. మోపిదేవి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చే పరిస్థితి తలెత్తిందని నివేదించింది.

బదిలీకి వీల్లేకుండా చేశారు..
నిర్మించు, నిర్వహించు, బదిలీ.. విధానం కింద ప్రాజెక్టు అమలు కావాల్సి ఉన్నా, బదిలీ అన్న పదం తొలగించి ఎప్పటికీ ఆ ప్రాజెక్టు ప్రభుత్వానికి దక్కకుండా నిమ్మగడ్డకు సొంతమయ్యేలా చేయడంలో మంత్రి పాత్ర ఉందని.. ఈ నేపథ్యంలో ఆయనపై తాము ఐపీసీ 120-బీ, రెడ్‌విత్ 420, 409, 420 పీసీ యాక్ట్- 1988 కేసులు నమోదు చేశామని పేర్కొంది. కేసులకు తగిన ఆధారాలు ఉన్నందు మోపిదేవి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ తన కౌంటర్ పిటిషన్‌లో కోరింది.

సబిత కుట్రదారే! దాల్మియా సిమెంట్స్ చార్జిషీట్‌లో సీబీఐ


హైదరాబాద్, ఏప్రిల్ 16: సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, కుట్రపూరితంగానే దాల్మియా సిమెంట్స్‌కు సున్నపురాయి లీజుల బదలాయింపుపై నిర్ణయం తీసుకున్నారని సీబీఐ నిగ్గుతే ల్చింది. కపటబుద్ధితోనే సబితా ఇంద్రారెడ్డి జయా మినరల్స్‌కు ఇచ్చిన ప్రాస్పెక్టింగ్ లైసెన్స్‌ను మూడు నెలల్లో ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయించే ఫైలుపై సంతకం చేసినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది.

అలా చేయడం మినరల్స్ యాక్ట్ -1960, రూల్ 9ని ఉల్లంఘించడమేనని తేల్చింది. కుట్రలో భాగంగానే 2006 జూలై 14న జీవో నంబరు:183 జారీ చేశారని తెలిపింది. అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్ ఏ1గా, జగతి ఆడిటర్ విజయసాయిరెడ్డిని ఏ2గా చేర్చుతూ దాల్మియా సిమెంట్స్‌పై సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీటులో మంత్రి సబితను ఏ4గా చేర్చడం తెలిసిందే! ఆ చార్జిషీటులో నిందితుల పాత్రను వివరించే క్రమంలో సబిత గురించి విశదీకరించింది.

"కడప జిల్లాలోని 407 హెక్టార్ల ప్రాస్పెక్టింగ్ లైసెన్స్(పీఎల్)ను జయా మినరల్స్‌కు కేటాయిస్తూ మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఒప్పందం కుదుర్చుకున్న మూడు నెలల్లోనే పీఎల్‌ను ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయించాలనే నిబంధన పెట్టారు. దీనికి అనుగుణంగానే లీజు జయా మినరల్స్ నుంచి ఈశ్వర్ సిమెంట్స్‌కు బదిలీ అయింది. అనంతరం ఈశ్వర్ సిమెంట్స్ లీజు దాల్మియా సిమెంట్స్‌కు మారింది. ఇది చట్టబద్ధమైన బంధనలను ఉల్లంఘించడమే'' అని సీబీఐ పేర్కొంది.

తన చర్యలద్వారా ఆమె దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియాకు అనుకూలంగా వ్యవహరించారని, ఉద్దేశపూర్వకంగానే దాల్మియాకు మేలు చేశారని వెల్లడించింది. అప్పటి గనుల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి సైతం అధికారులతో కుమ్మక్కై.. ఈ కేసులో స్వతంత్రం గా వ్యవహరించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నివేదించింది. గనుల శాఖ జాయింట్ డైరెక్టర్ మీనకేతన్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాలను కూడా తోసిరాజని...శ్రీలక్ష్మి ఈ ఫైలును ముందుకు పరుగులు పెట్టించారని కోర్టుకు నివేదించింది.

తెరవెనుక పాత్ర పోషించిన జగన్
దాల్మియా పెట్టిన రూ.20 కోట్ల పెట్టుబడులు భారతి సిమెంట్స్‌లోకి వచ్చాయని, భారతి పూర్వపు పేరు రఘురాం సిమెంట్స్ లిమిటెడ్ అని సీబీఐ పేర్కొంది. రఘురాం సిమెంట్స్‌లో అధిక వాటాలు కల్గిన జగనే 2006 డిసెంబరు నుంచి 2008 ఆగస్టు వరకు ఆ కంపెనీ వ్యవహారాలన్నీ పర్యవేక్షించారని తెలిపింది. ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకుని కడప జిల్లాలో 407 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల ను తొలుత ఈశ్వర్ సిమెంట్స్‌కు కేటాయించి, తర్వాత లీజును దాల్మియాకు బదలాయించేలా కుట్రపన్నారని పేర్కొంది. అందుకు ప్రతిగా జగతి, భార తి సిమెంట్స్‌లో దాల్మియా రూ.95కోట్లు పెట్టుబడి పెట్టినట్లు నివేదించింది.

శ్రీల క్ష్మి పాత్రపై: నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. తన అధికార పరిధిని దాటి ఆమె నిర్ణయాలు తీసుకున్నారని సీబీఐ తెలిపింది. జయామినరల్స్‌కు లీజు మంజూరు చేయడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి గనులశాఖ జాయింట్ డైరెక్టర్ మీనకేతన్‌రెడ్డి ఆమె దృష్టికి తీసుకొచ్చారని, కానీ శ్రీల క్ష్మి ఆ మాటను పట్టించుకోలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెపై ఐపీసీ 120-బీ రెడ్‌విత్ 420, 409, పీసీ యాక్ట్ సహా పలు కేసులు నమోదు చేశామని వివరించింది.

సాయిరెడ్డి గురించి: జగన్‌కు ఆర్థిక సలహాదారుగా కొనసాగుతూ.. జగతి, భారతిలోకి రూ.95 కోట్లు పెట్టుబడుల రూపంలో రావడంలో కీలక పాత్ర పోషించారని, రూ.110 విలువ ఉన్న షేరును రూ.1440కి దాల్మియా కొనేవిధంగా చేశారని, జగన్ సంస్థల్లోకి ముడుపుల వ్యవహారంలో సాయిరెడ్డి ప్రధాన భూమిక పోషించారని సీబీఐ పేర్కొంది.

కేరాఫ్ కేవీపీ!


హైదరాబాద్, ఏప్రిల్ 16 : కేవీపీ వద్ద చాలా రహస్య సమావేశాలు జరిగేవని.. వాటి వివరాలు మాత్రం తమకు తెలియదని ఆయన వద్ద పీఏలుగా పనిచేసిన వై.రాంబాబు, డీజే నరసింహారావు సీబీఐ అధికారులకు వెల్లడించారు. కేవీపీ వద్దకు శాఖలకు సంబంధించిన ఫైళ్లు వచ్చేవి కావుకానీ.. సీఎం పేషీ అధికారులైన పి.సుబ్రమణ్యం, జన్నత్ హుస్సేన్, ఎంజీవీకే భాను, ప్రభాకర్‌రెడ్డి తరచూ కేవీపీని కలిసేవారని ద్రువీకరించారు. వీరు ఫోన్లలోనూ మాట్లాడుకునే వారని తెలిపారు. కేవీపీ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా పని చేసిన జనార్దన రెడ్డి నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ ప్లీడర్ల నియామకం వంటి ఫైళ్లను పరిశీలించే వారని రాంబాబు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సునీల్‌రెడ్డి నాలుగైదు రోజులకొకసారి కేవీపీ నివాసానికి వచ్చేవారని తెలిపారు.

వైఎస్ కేబినె ట్‌లోని మంత్రులందరూ తరచూ కేవీపీ వద్దకు వచ్చేవారని... చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా కేవీపీ దర్శనం చేసుకున్నవారేనని తెలిపారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తామడ గోపాలకృష్ణ కూడా కేవీపీ కార్యాలయానికి వచ్చేవారన్నారు. "చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు కేవీపీని కలవాలనుకునే వారు. కానీ... కేవీపీ వ్యక్తిగతంగా చెప్పిన వారికి మాత్రమే అపాయింట్‌మెంట్ లభించేదని తెలిపారు. పీవీపీ గ్రూప్‌నకు చెందిన పొట్లూరి వరప్రసాద్ పలు సందర్భాల్లో కేవీపీతో ఉండేవారని తెలిపారు.

పారిశ్రామికవేత్తలైన మ్యాట్రిక్స్ ప్రసాద్, పెన్నా ప్రతాప్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, శ్రీనివాసన్, శ్యాంప్రసాద్‌రెడ్డి, నిత్యానందరెడ్డి, శ్రీనివాస రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు తరచూ కేవీపీని కలిసేవారని నరసింహారావు ద్రువీకరించారు. విజయ సాయిరెడ్డి కేవీపీ కార్యాలయానికి రావడంతోపాటు అక్కడినుంచే ఫోన్లు కూడా చేసేవారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో తాను కేవీపీతోపాటు అప్పటి సీఎం క్యాంప్ ఆఫీసు, అధికారిక నివాసానికి వెళ్లేవాడినని... ఆ సమయంలో వైఎస్‌తో కేవీపీతోపాటు జగన్, సాయిరెడ్డి కూడా అక్కడే ఉండటం గమనించానని వివరించారు.

చీకటి వేదికలుగా డీ బ్లాక్-క్యాంప్ ఆఫీస్

హైదరాబాద్, ఏప్రిల్ 16 : వైఎస్ చేత... జగన్ కోసం... కేవీపీ రామచంద్రరావు, సాయి రెడ్డి ద్వారా... సునీల్ రెడ్డి సాగించిన వసూళ్ల పర్వం! ఒకవైపు... బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీసు! మరోవైపు... సచివాలయంలో కేవీపీ కొలువైన డీ-బ్లాక్! వేలకోట్ల ఒప్పందాలకు... అంతేస్థాయిలో అవినీతికి ఇవే కేంద్రాలు! తెల్లవారుజామున మొదలై రాత్రిదాకా జరిగే చీకటి ఒప్పందాలకు రహస్య వేదికలు! ఈ 'డీ - క్యాంప్' రహస్యాన్ని సీబీఐ ఛేదించింది. ఎవరు వచ్చేవారు, ఏం చేసేవారు, ఎలా చేసేవారు... ఈ ప్రశ్నలన్నింటికీ వైఎస్‌కు నీడలా ఉండే సూరీడు సమాధానమిచ్చారు.

వైఎస్ హయాంలో సీఎం పేషీని నడిపిన జన్నత్ హుస్సేన్, వైఎస్‌కు ముఖ్య భద్రతాధికారిగా ఉన్న రమేశ్ కూడా రహస్య భేటీలు సాగిన విధానాన్ని సీబీఐకి తాము ఇచ్చిన వాంగ్మూలాలలో వివరించారు. అప్పట్లో అన్నీ 'కేరాఫ్ కేవీపీ' చిరునామాతోనే జరిగేవని ఆయన వద్ద పీఏలుగా పని చేసిన వారు ద్రువీకరించారు. 1977 నుంచి వైఎస్‌తో, ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న సూరీడు... అనేక సమావేశాలకు ప్రత్యక్ష 'సాక్షి'! 'ఫలానా వ్యక్తి, ఫలానా కారులో వస్తున్నాడు. గేట్లు తెరవండి' అని భద్రతాధికారులకు 'హుకుం' జారీచేసే స్థాయి ఆయనది! వైఎస్‌ను కలిసేందుకు వచ్చే అతిథులను సాదరంగా ఆహ్వానించి, లోపలికి తీసుకెళ్లే బాధ్యత కూడా ఆయనదే!

రోజూ మధ్యాహ్నం సచివాలయంలో వైఎస్, కేవీపీలకు భోజనం వడ్డిస్తూ అప్పుడప్పుడు 'ముఖ్యుల'తో జరిగే సమావేశాల్లోనూ పాల్గొంటూ.. అనేక ముఖ్య ఘట్టాలను కళ్లారా వీక్షించిన సూరీడు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. "కేవీపీ సలహా తీసుకోకుండా వైఎస్ ఏ పనీ చేసేవారు కారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు మొదట కేవీపీని కలిసేవారు. ఎవరైనా నేరుగా వైఎస్ వద్దకు వెళితే... ముందు కేవీపీని కలవండి అని వైఎస్ చెప్పేవారు. వైఎస్ క్యాంప్ ఆఫీసుకు ముఖ్యులు, విదేశీ ప్రతినిధులు వస్తే... అక్కడ కేవీపీ కూడా తప్పకుండా ఉండేవారు'' అని సూరీడు తెలిపారు.

ట్రైమెక్స్ ప్రసాద్, మ్యాట్రిక్స్ ప్రసాద్, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఇందు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, రాంకీ అయోధ్య రామిరెడ్డి, నిత్యానంద, రామకృష్ణా రెడ్డి, పార్థసారథి రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితర పారిశ్రామిక వేత్తలు సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి వైఎస్, కేవీపీలను కలిసేవారని సూరీడు తెలిపారు.

కలెక్షన్ బాధ్యత సునీల్‌దే...
జగన్ భార్య భారతీరెడ్డికి సమీప బంధువు, జగన్‌కు సన్నిహితుడు అయిన సునీల్ రెడ్డి ద్వారా 'వసూళ్ల పర్వం' నడిచేదని సూరీడు పేర్కొన్నారు. "ప్రభుత్వం నుంచి పనులు చేయించుకున్న వారి వద్ద ఎంత డబ్బు వసూలు చేయాలో కేవీపీ నిర్ణయించేవారు. సునీల్ రెడ్డి డబ్బులు వసూలు చేసుకొచ్చి.. ఎంత కలెక్షన్ చేసిందీ కేవీపీ, జగన్‌లకు చీటీలపై చూపించి, తర్వాత వాటిని చించేసేవాడు'' అని సూరీడు తెలిపారు.

ఈ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో జగన్, విజయ సాయిరెడ్డి నిర్ణయించేవారని తెలిపారు. వైఎస్ ఇంట్లో ఖర్చులకు సునీల్ రెడ్డే డబ్బులు ఇచ్చేవారని... తాను కూడా పలు సందర్భాల్లో రూ.5 లక్షల నుంచి పది లక్షల వరకు తీసుకున్నానని తెలిపారు. "సునీల్ రెడ్డికి డబ్బు ఎక్కడిదో తెలియదు. కానీ... అంతంత డబ్బు ఇచ్చే స్థోమత మాత్రం ఆయనకు లేదు'' అని సూరీడు తన వాంగ్మూలంలో వివరించారు.

సమావేశాల్లో సాయిరెడ్డి: జన్నత్ హుస్సేన్
2004-09 మధ్య జరిగిన తతంగాలను 'దగ్గరి నుంచి' చూసిన మరో అధికారి జన్నత్ హుస్సేన్. ప్రస్తుతం సమాచార హక్కు ప్రధాన కమిషనర్‌గా ఉన్న ఆయన... అప్పట్లో వైఎస్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు. సూరీడు.. ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాల్లోనూ పాల్గొనేవారని జన్నత్ హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారు కేవీపీ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరిగే కొన్ని సమావేశాలకు హాజరయ్యేవారని తెలిపారు.

సాయిరెడ్డి సైతం కొన్ని భేటీల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు జన్నత్ హుస్సేన్ «ద్రువీకరించారు. క్యాంప్ ఆఫీస్ నుంచి వైఎస్ నివాసాన్ని అనుసంధానిస్తూ ఒక ప్రధాన మార్గంతోపాటు జగన్ ఉండే ఇంటిని కలుపుతూ మరో దారి కూడా ఉందని ఆయన తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాప్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎన్.శ్రీనివాసన్ (ఇండియా సిమెంట్స్), కోనేరు ప్రసాద్, సజ్జల రామకృష్ణా రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి తదితరులు తరచూ క్యాంప్ ఆఫీసుకు వచ్చేవారని తెలిపారు.

సూరీడు చెబితే రైట్ రైట్: రమేశ్
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఐపీఎస్ అధికారి రమేశ్ ఆయన ప్రధాన భద్రతాధికారి (సీఎస్‌వో)గా వ్యవహరించారు. రోజు మార్చి రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద విధులు నిర్వహించేవారు. విధి నిర్వహణలో భాగంగా వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. "ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నా, కారులో ప్రయాణిస్తున్నా ఆయనకు వచ్చే ఫోన్లను ముందు సూరీడు ఎత్తేవారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే వారి గురించి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, వాహనంతో సహా లోపలికి అనుమతించాలని చెప్పేవారు.

ఇక... కేవీపీ రామచంద్రరావు సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగే కొన్ని రాజకీయ, అధికారిక సమావేశాల్లోనూ పాల్గొనేవారు. సునీల్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఎలాంటి తనిఖీలు లేకుండానే ఆయన లోపలికి వెళ్లేవారు. సందర్శకులంతా ప్రధాన ద్వారంగుండా వస్తే... సునీల్ రెడ్డి మాత్రం రెసిడెన్స్ గేట్ నుంచే వచ్చేవారు. నిమ్మగడ్డ ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎన్.శ్రీనివాసన్, కోనేరు ప్రసాద్, సజ్జల దివాకర్ రెడ్డి తదితరులు తరచూ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చేవారు'' అని రమేశ్ పేర్కొన్నారు.

2, ఏప్రిల్ 2013, మంగళవారం

‘ఆధార్’ ఎవరి ఆధారంకోసం...?



  • - జి.లచ్చయ్య (సెల్ : 94401 16162)
  • 31/03/2013
ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, యుఐడిఎఐ చైర్మన్ నందన్ నిలేఖని, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మోన్‌టెక్‌సింగ్ ఆహ్లూవాలియాలతో సహా కేంద్ర మంత్రులు ఆధార్ కార్డుల్ని పొందారా...?’ అని సమాచార హక్కు కింద హైదరాబాద్‌కు చెందిన రాకేష్‌రెడ్డి సమాచారాన్ని కోరగా, అది ‘వ్యక్తిగతం’ అంటూ సమాచారాన్ని ఇవ్వడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) తిరస్కరించగా, ఈ సమాచారాన్ని పొందడానికి తిరిగి ప్రయత్నిస్తానని రాకేష్‌రెడ్డి మార్చి 7న మీడియాతో చెప్పారు. ఈ సమాచారాన్ని అడగడానికి ప్రధాన కారణం- ఈ ఆధార్ నంబర్ (నిజానికి కార్డ్ కాదు) కేవలం వివిధ పథకాల్ని పొందాలనుకునే వారికేనని, ఈమధ్యన కేంద్ర మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు మరి!
ఓ స్పష్టత లేకుండా దాదాపు 16 రాష్ట్రాల్లో (ఆం.ప్ర.తో కలిపి) గత సెప్టెంబర్ 2010 నుంచి జనాల్ని నిద్రపోనియకుండా చేస్తున్న ఈ 12 అంకెల నంబరుకై జనాలు క్యూలు కట్టడం, వెంపర్లాడడం, బెంగటిల్లడం జరుగుతున్నది. పైగా ఈ నంబర్‌తోనే వివిధ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీని పొందడానికి తప్పనిసరి అని చెప్పడం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత మార్చి 15కే ఇది తప్పనిసరి అని గ్యాస్ అథారిటీస్ చెప్పడంతో, జనాల్లో మరింత గాభరా మొదలైంది. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించడంతో ఈ గడువును ఏప్రిల్ 15వరకు పొడిగించారు. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ పొడిగింపు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందనేది కాదనలేని సత్యం.
ఇప్పటికే కుటుంబాలకు రేషన్ కార్డు, కొన్ని కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డు, 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటర్ ఐడెంటి కార్డు, బ్యాంకు లావాదేవీలకు, ఆదాయపు పన్ను లెక్కలకు పాన్ కార్డు, బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్, డెబిట్ కార్డును (ఎటిఎమ్), ఆర్‌టిసికి సంబంధించి క్యాట్ కార్డు, వివిధ సంస్థల్లో పనిచేసే వారికి అధికారులచే గుర్తింపుల కార్డులున్నాయి. ఈ కార్డులన్నింటిని దారానికి కుచ్చితే మెడలో వేసుకొనే ఓ దండలా తయారౌతుంది. హైటెక్ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇప్పటికే మెడలో ఒకటి వేలాడుతున్నది.
వీటికితోడు ఆధార్ జత అవుతుందా లేక మిగతా కార్డుల స్థానాల్లో ఈ ఆధార్ అనుసంధానం అవుతుందా అనేదానికి సమాధానం రాబట్టడం కష్టమే! ఈ దేశంలో ఏ పథకం సంపూర్తిగా, సంతృప్తిగా విజయవంతమైన దాఖలాలు లేవు. ఇప్పటికి రేషన్ కార్డులు లేనివారు, పొందలేని వారు ఉన్నారు. ఓటర్ ఐడెంటి కార్డు లేనివారు ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఉన్నారు. వీటిని ప్రారంభించినప్పుడు ఇప్పటిలాగే ప్రభుత్వం హడావిడి చేసింది. జనాన్ని హైరానా పర్చింది. జనం పరుగులు తీసారు. తీరా ఏదీ పూర్తికాలేదు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. పొందిన కార్డులు తప్పుల తడకతో ఉన్న విషయం తెలిసిందే! ఓటరు కార్డుకు ప్రత్యామ్నాయంగా, 16 గుర్తింపుల్లో ఒకదాన్ని చూపి, ఓటరు ఓటువేసే అవకాశాన్ని కల్గించినా, దొంగ ఓట్లను నివారించలేని స్థితి. ఆరోగ్యశ్రీ గాడి తప్పిన పరిస్థితి. ఈ పథకాల ద్వారా లబ్దిపొందే వర్గాలకన్నా వీటిని నిర్వహిస్తున్న యంత్రాంగమే అత్యధికంగా లబ్దిని పొందుతున్నట్లు సర్వేలు చూపుతూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు, ఈ ఆధార్ నెంబర్ వీటిని ఎలా అరికడుతుందనేది ప్రశ్న! ఈ ప్రశ్న సామాన్యులకు కాదు, అధికారులకే ఎదురవుతున్నది.
లక్ష కోట్ల రూపాయల్ని (మల్టీ నేషనల్ సంస్థకు) పోసి నిర్వహిస్తున్న ఈ ఆధార్ లోపభూయిష్టంగా నడుస్తున్న విషయం తెలిసిందే! ఇందులో మూడు అంశాలున్నాయి. ఒకటి చిరునామా, రెండవది వ్యక్తిగత ఫొటో కాగా, మూడవది బయోమెట్రిక్ సమాచారం. ఇందులో చేతుల పదివేళ్ళ ముద్రలు, కండ్లను స్కానింగ్ చేయడం జరుగుతున్నది. కాని ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత ఇస్తున్న రసీదులు స్పష్టంగా లేకపోగా, నింపిన సమాచారం సరిచూసుకునే అవకాశం లేకుండా పోతున్నది. పైగా ఈ సమాచారాన్ని పొందుపర్చడానికై కుటుంబాలకు ఒక ఫాంను ఇవ్వడం, అందులో కుటుంబాలకు నింపడం కష్టసాధ్యంగా మారిం ది. వివరాలు నింపాలంటే, ఇంటర్, పై స్థాయి చదువుకున్న వారికే సాధ్యం. దీంతో ఒత్తులు, దీర్ఘాలు అవసరం ఉన్న దగ్గర లేకుండా, లేని దగ్గర ఉంటూ తప్పుల తడకగా నమోదు జరుగుతున్నాయి.
ఇలా ఆధార్ నంబర్‌లోని సమాచారం తిరిగి రేషన్ కార్డుకు, ఓటర్ ఐడెంటీ కార్డుకు పొంతన లేకుండా ఉంటున్నాయి. కొందరికైతే నెలలు గడిచినా నంబర్ రాని స్థితి. వస్తుందో, రాదో తెలియదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు. కనీసం రేషన్ కార్డుకు స్థానిక తహసిల్దార్, ఓటర్ ఐడెంటీకార్డుకు అసెంబ్లీ స్థాయి రిటర్నింగ్ అధికారి (పరోక్షంగా తహసిల్దార్) బాధ్యత వహిస్తుంటే, ఆధార్ నంబర్‌కు ఎవరి సంతకం లేదు. అధికారిత లేదు. పైగా ఆధార్ కేవలం గుర్తింపు ధృవీకరణ మాత్రమేగాని, పౌరసత్వపు గుర్తింపుకాదని, ఆధార్ కార్డ్‌పై స్పష్టంగా పేర్కొనడం జరిగింది.
ఇక ఈ ‘ఆధార్’తో పొందే సౌకర్యాలు, రాష్ట్రానికొక తీరుగా, జిల్లాకొక తీరుగా ప్రకటించడం జరిగింది. ముందుగా 80 జిల్లాల్లో 80 శాతం రప్రజలకు 34 రకాల సంక్షేమ పథకాల్ని అనుసంధానం చేయాలని అనుకోగా, వాటిని 50 జిల్లాలకు తగ్గించడం జరిగింది. అలాగే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ప్రకటించడంతో ఇటు కుటుంబాలవారు, అటు విద్యార్థులు (వివిధ స్కాలర్‌షిప్స్ పరంగా) ఆందోళన చెందుతున్నారు. పోనీ, ఈ ఆధార్ నంబర్ పొందిన తర్వాత సంక్షేమ పథకాల్ని గాడి తప్పకుండా, దారి మళ్లకుండా, పారదర్శకంగా అమలుచేయగలుగుతారా అంటే ‘కష్టం’ అని అధికారులే పెదవి విరుస్తున్నారు. బయోమెట్రిక్ విధానంతో దొంగల్ని దొరకబట్టవచ్చా, నేరస్థుల్ని పట్టుకోవచ్చా అంటే ప్రశ్నార్థకమే! ఎందుకంటే చేతి వేలి ముద్రలు సరిగా స్కాన్ కావడం లేదని, ఇస్తున్న రసీదుల్లోనే తెలుస్తున్నది. పోతే ఇదో సువిశాల దేశం. కోట్ల జనాభా. దీనికి తోడు బంగ్లా దేశంనుంచి, శ్రీలంక నుంచి, ఈశాన్య రాష్ట్రాల్లోకి పక్క దేశాలనుంచి, కాశ్మీర్‌లోకి పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ నుంచి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా అధికారులు నివాస ధృవీకరణ పత్రాలు ఇస్తూనే ఉంటారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు రెండేసి రేషన్ కార్డులు, ఓటరు ఐడెంటి కార్డులు అధికారికంగానే ఇస్తూ ఉన్నారు. కారణం, ఇరు ప్రాంతాల ఓటు బ్యాంకు రాజకీయాల ఒత్తిడికి అధికారులు తలొగ్గడం అనివార్యం కాబట్టి. ఇన్ని భిన్నత్వాలతో గల దేశంలో నేరస్థుల్ని, తీవ్రవాద కలాపాలకు పాల్పడేవారిని పట్టుకోవడం కత్తిమీద సాముకాదా! పైగా ఈ నేరాలకు పాల్పడేవారు అసలు వీటిని పొందక, నకళ్ళను పొందుతారు. ఒకవేళ నేరస్థుడి వేలిముద్రలు లభించినా, అవి ఏ కంప్యూటర్లో దొరకని పరిస్థితే! అలాంటప్పుడు, ప్రభుత్వ ఆలోచన ఎలా సాధ్యమనేది ప్రశే్న!
ఇకపోతే ఈ ఆధార్ పథకం ప్రధానమంత్రి కార్యాలయంది కాగా, దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ జాతీయ జనాభా రిజిస్టర్ (నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్- ఎన్‌పిఆర్)ను ముందుకు తీసుకొని వచ్చింది. ఈ ప్రక్రియ కూడా మొదలైంది. ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో ఆధార్, ఎన్‌పిఆర్ రెండు పథకాలు అమలుకాగా, ఉత్తరప్రదేశ్‌లో ఆధార్ లేకపోగా, తమిళనాడులో కేవలం ఎన్‌పిఆర్ మాత్రమే అమలుచేస్తున్నారు. ఆధార్‌కు, ఎన్‌పిఆర్‌కు ఉన్న తేడా అంతా వ్యక్తిగతమే! పోతే ఎన్‌పిఆర్‌లో ఆధార్‌లో ఉండే అంశాలతోపాటుగా (డెమోగ్రాఫిక్, ఫొటో, బయోమెట్రిక్) సెక్యూరిటీకి సంబంధించిన సమాచారం ఉంటుందని అంటున్నారు. కాబట్టి, ఇది ముందుగా దేశంలో 6 నెలలుగా నివసిస్తున్న వారికి, లేదా తర్వాత ఆరు నెలలు ఉండే వారికి మాత్రమే పరిమితం కాగా, ఆధార్ విదేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎన్‌పిఆర్ (దీన్ని రెసిడెన్షియల్ ఐడెంటీకార్డు (ఆర్‌ఐసి) అంటారు) తప్పనిసరిగా చేయబోతున్నట్లు హోంమంత్రిత్వశాఖ తెలపడం గమనార్హం.
ఇలా కేంద్ర మంత్రిత్వశాఖలోనే సమన్వయం లేని పథకాల్ని జనాలపై ప్రయోగించడం నిరంతరం జరుగుతూనే ఉన్నది. అనుకోకుండా 2014 ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం స్థానంలో మరో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే, ఈ రెండు పథకాలకు మంగళం పాడడం, ఖాయమనేది అందరికి తెలిసిందే! వీటి స్థానంలో మరో కొత్త పథకం రావచ్చు! కోట్లాది రూపాయల డబ్బుల మారకంతో జనాన్ని ఆశల పల్లకిపై ఊరేగించడం జరుగుతుంది. ఇండియన్ సివిల్ సర్వీసు చదివిన అత్యున్నత అధికారులు ఇలాంటి పథకాల్ని రచించి, మంత్రుల్నే బురిడి కొట్టించడంలో సిద్ధహస్తులు కాదా! అందుకే ఈ పథకాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు, అత్యున్నత స్థాయి అధికారులకు ఇలాంటి ఆధార్‌లు ఆదాయ వనరుగా కొనసాగుతాయి.

సౌర విద్యుత్ ఎంతవరకు పరిష్కారం?


  • -జమలాపురపు విఠల్‌రావు
  • 29/03/2013
రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో తగిన స్థాయిలో కరెంట్ సరఫరా లేక సామాన్యుల నుంచి పరిశ్రమల వరకు తీవ్ర ఇక్కట్లకు గురౌతున్నారు. ప్రస్తుతం పరిశ్రమలు 40 నుంచి 60శాతం విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతల దెబ్బకు చాలా చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని అంపశయ్యపై నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇక పట్టణాలు నగరాల్లో కూడా తీవ్రస్థాయిలో కోతలు తప్పడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్, సరఫరాల మధ్య తేడా తీవ్ర స్థాయికి చేరుకోవడమే ఈ దుస్థితికి కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కెజి బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడం, ఋతుపవనాలు విఫలం కావడం వల్ల జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోవడం వంటివి విద్యుత్ కొరతకు ప్రధాన కారణమని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తు తం ఒక్కసారిగా పెరిగిపోయిన డి మాండ్‌ను తట్టుకునేందుకు 1200 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. దీనివల్ల సమస్యకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించబోదు. ప్రస్తుతం మన అనుభవం చెబుతున్న పాఠం కూడా అదే! ఇట్టి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు దృష్టి మళ్ళడం సహజం. అణు,పవన, సౌర విద్యుత్, అలల ద్వారావిద్యుదుత్పత్తి ప్రస్తు తం ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నాయి. వీటన్నింటిలోకీ సౌర విద్యుత్ అత్యంత తేలిగ్గా అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలనేది సర్వేసర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభు త్వం ‘సౌరవిద్యుత్ విధానం- 2012’ పేరుతో ఒక విధానాన్ని 2012 సెప్టెంబర్ 26న ప్రకటించింది. ఇదే సమయంలో ఇంటికప్పులపైన సౌర విద్యుత్ ఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియకు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే ప్రతి గృహం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అవుతుందన్న మాట! గృహ వినియోగదారుడు తన వాడకంపోను మిగిలిన విద్యుత్‌ను అమ్ముకొనేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే వీలు కల్పించింది. దక్షిణాదిలో మనకంటే ఈ విధానంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.
ఆలోచన ఆకాశంలో ఉంటే..ఆచరణ పాతాళంలో కునారిల్లుకుపోవడం స్వాతం త్య్రం వచ్చిన నాటినుంచి ఇప్పటి వరకు నిత్యం మనం చూస్తున్నదే. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్ విధానాన్ని ప్రకటించిన తర్వాత ఉత్సాహంగా కొన్ని కంపెనీలు సౌర విద్యుత్ కేంద్రాలను నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. స్పందన బాగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆనందం వెల్లివిరిసింది. ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినా... విధానపరమైన అడ్డంకుల వల్ల ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైందని ఆయా కంపెనీలు ఆరోపించాయ. విధానంలో ఇంతవరకు స్పష్టత రాకపోవడం కూడా ఇం దుకు కారణమని చెబుతున్నారు. ఇదిలా వుండగా అంతకు ముందు అనుమతించిన ప్రాజెక్టుపనులు ప్రారంభించాలంటే స్థానిక సమస్యలు అడ్డంకిగా మారడంతో అవి ముందుకు సాగడం లేదు.
సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడానికి ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహించే విషయంలో మహారాష్ట్ర విద్యుత్ సంస్థ ‘మహాజెన్‌కో’ తీసుకుంటున్న చర్యలు చూడటానికి ప్రోత్సాహకరంగానే ఉన్నప్పటికీ దీనికి స్పందన ఎట్లా ఉంటుందనేది తెలుసుకోవాలంటే కొద్ది కాలం ఓపిక పట్టక తప్పదు. ముఖ్యంగా ఆపరేటర్లను సౌరవిద్యుత్ ప్లాంట్లను నెలకొల్పి, పాక్షిక యాజమాన్యం కింద నిర్వహించమని మహాజెన్‌కో కోరుతోంది. అంటే ఈ నమూనాలో ఎంపిక చేసిన ప్రైవేటు ఆపరేటర్, ప్లాంటును స్వంత ఖర్చుతో నిర్మించాలి. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఈ ప్రాజెక్టుకు కావలసిన భూమిని, పంపిణీకి సంబంధించిన వౌలిక సదుపాయాలను కలుగజేస్తుంది. తర్వాత ఈ ప్లాంటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి వివరాలు రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ పుస్తకాల్లో నమోదు చేస్తారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆవిధంగా నెలకొల్పిన కంపెనీకి ఆపరేటర్ పదేళ్ళపాటు యజమానిగా కొనసాగుతాడు. ప్లాంటు పని ప్రారంభించిన తర్వాత అందుకయిన మొత్తం ఖర్చులో సగం మహాజెన్‌కో ఆపరేటర్‌కు చెల్లిస్తుంది. అందుకోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు మహాజెన్‌కోకు ఋణం మంజూ రు చేస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ఈ విధానాన్ని అమలు పరచబోతున్నది. అయితే ఈవిధంగా నెలకొల్పే ప్లాంటు సామర్ధ్యాన్ని మహాజెన్‌కో మెగావాట్లు లేదా వ్యవస్థాపిత సామర్ధ్యంతో లెక్కగడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు మరో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అమల్లోకి రాబోతున్నది.
ఇక ఇళ్ళకప్పులపై సౌరఫలకాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. గృహల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల కలిగే లాభాన్ని అర్థం చేసుకోవడానికి టాటా పవర్‌కు చెందిన సాంకేతిక సలహాదారు అవినాష్ పట్కర్ అంచనాను పరిశీలిద్దాం. మన దేశ జనాభా ప్రస్తుతం 120కోట్లు దాటింది. ఒక్కొక్క కుటుంబంలో ఐదుగురు సభ్యులున్నారని భావించినా దేశం మొత్తం మీద 25 కోట్ల కుటుంబాలు లెక్క తేలతాయి. ఈ కుటుంబాల్లో కేవలం ఐదుశాతం మంది.. అంటే ఐదుకోట్ల మంది ఇళ్ళ కప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారనుకుందాం. ప్రతి ఇంటికప్పుపై 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో (గ్రామాల్లో ఈ విస్తీర్ణం ఇంకా ఎక్కువ ఉంటుంది) చదరపుమీటరుకు (1 చదరపు మీటరు= 10.76 చదరపు అడుగులు) 100 వాట్ల వ్యవస్థాపిత సామర్ధ్యం కలిగిన సౌర ఫలకాలను ఏర్పాటు చేసినా..ఒక్కొక్క ఇంటి కప్పు నుంచి రెండు కిలోవాట్ల (రెండువేల వాట్ల) విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు! ఆవిధంగా ఐదుకోట్ల ఇళ్ళ కప్పులనుంచి ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తు లక్ష మెగావాట్లు! (వెయ్యి కిలోవాట్లు= ఒక మెగావాట్). ఈ రంగం ప్రాధాన్యత గుర్తించిన పై మూడు దక్షిణాది రాష్ట్రాలు ఆ దిశగా పథకాలను రూపొందిస్తున్నాయి. మరి ఇందుకోసం పెద్ద విస్తీర్ణంలో భూమి అవసరం లేదు. నేడు సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు చాలామంది వెనకాడటానికి ప్రధాన కార ణం, భూమి సమస్యే! అందువల్ల గృహాలపై సౌరఫలకాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రతి గృహ యజమాని ఉత్పత్తిదారుడిగా, వినియోగదారుడిగా మారిపోతాడు. తన ఇంటి నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉచితంగా వినియోగించుకోవడంతో పాటు, అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు కూడా! ఆవిధంగా దీన్నుంచి ఆదాయంకూడా లభిస్తుంది. ఉత్పత్తి అయ్యే ప్రదేశానికి వినియోగ ప్రదేశానికి మధ్య దూరం ఉండకపోవడం వల్ల, పంపిణీ నష్టాలు దాదాపుగా ఉండబోవనే చెప్పాలి. నిర్వహణా వ్యయం కూడా చాలా తక్కువ. అయితే సౌర విద్యుత్ వ్యవస్థను ఇంటికప్పుపై ఏర్పాటు చేసుకోవడానికయ్యే ఖర్చు మాత్రం రూ.2లక్షలు!
2012లో పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్రంలోని ఇళ్ళ కప్పులపై సౌర ఫలకాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిందంటే..ఇందులో ఉన్న లాభాన్ని గుర్తించడం వల్లనే. అంతేకాదు ఇళ్ళ కప్పులపై సోలార్ వాటర్ హీటర్లు అమర్చడం తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇవి వచ్చే ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు గతంలో పదివేల గృహాలకు సౌర ఫలకాలు అమర్చాలన్న లక్ష్యాన్ని, ఈ ఏడాది 75వేలకు పెంచింది.
అయితే ఇంటికప్పులపై సౌర ఫలకాలను అమర్చే వ్యవస్థను ఏర్పాటు ప్రాజెక్టును అమలు పరచే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మొత్తం ప్రాజెక్టే విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును అమలు పరచే క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీకృతం చేయడంలో సమర్ధవంతంగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సౌర ఫలకాల్లో ఉపయోగించే ఫోటోవోల్టాయిక్ సెల్స్‌ను నియమిత కాలావధుల్లో ఎప్పటికప్పుడు మెయింటెన్ చేస్తుండాలి. ఈ సెల్స్‌కు ఐదేళ్ళ వారంటీ ఉంటుంది. మరి ఈ సెల్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బయటి రాష్ట్రాల సంస్థలకు కాంట్రాక్టు కట్టబెడితే వారు నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ప్రమాదముంది. దీనివల్ల గృహ వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతాడు. ఒక్కసారి నెలకొల్పిన తర్వాత సౌర ఫలకాలకు ఎప్పటికప్పుడు సర్వీస్ చేయకపోతే అవి దెబ్బతినిపోతాయి. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే సమయంలో వినియోగదారుడు మోసపోయే అవకాశాలు కూడా మెండు! రోజుకు ఇన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కచ్చితంగా జరుగుతుందన్న హామీని, సంబంధిత సంస్థ వినియోగదారుడికి ఇవ్వాలి. తక్కువ నాణ్యత కలిగిన పరికరాలను బిగిస్తే, విద్యుత్ ఉత్పత్తి పడిపోతుంది. అందువల్ల వినియోగదారుడు.. ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే సమయంలో, అన్ని పరికరాలు ముందుగా సంస్థ వివరించిన ప్రమాణాల స్థాయిలోనే ఉన్నాయా లేదా అనేదాన్ని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. అంతేకాదు ఈ వ్యవస్థ పనితీరుపై అవగాహనలేని వినియోగదారుడిని, ఆయా సంస్థలు తప్పుదోవ పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ వ్యవస్థలో ఉపయోగించే ఇన్వర్టర్ అమెరికా తయారీది. అందువల్ల దాన్ని మూడు నాలుగుసార్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే ఇళ్ళకప్పులపై అమర్చే సౌర ఫలకాల నాణ్యతపై ఈ ప్రాజెక్టు విజయవంతమవడం ఆధారపడి ఉంటుందనేని నిష్టుర సత్యం.ప్రతి పథకానికి లాభనష్టాలుంటాయి. కానీ నష్టాలను నివారిస్తేనే లాభా లను అందుకుంటాం.