1, మార్చి 2013, శుక్రవారం

ఉత్తర తెలంగాణ ఎడారే!


BABLI
బాబ్లీపై ‘సుప్రీం‘ తీర్పు తెలంగాణకు గొడ్డలిపెట్టు
- పొంచి ఉన్న సాగునీటి ముప్పు.. 18 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం

హైదరాబాద్/నిజామాబాద్, ఫిబ్రవరి 28 (టీ మీడియా): సుప్రీం తీర్పుతో తెలంగాణ వరవూపదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వట్టిపోనుంది. ఇకపై తలాపునే పారుతోంది గోదారి.. తెలంగాణ అంతా ఎడారి అని పాడుకోవాల్సిందే. బాబ్లీపై ఆది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్త్తున్న నిర్లక్ష్య, నిర్లిప్త వైఖరి వల్లే తెలంగాణ రైతన్నలు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఏపీ, మహారాష్ట్ర మధ్య 1975 అక్టోబర్ 6న కుదిరిన ఒప్పందం మేరకు గోదావరిపై శ్రీరాంసాగర్ (పోచంపాడు) ప్రాజెక్టు నిర్మాణమైంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు. పూర్తిస్థాయితో నీరుంటే ప్రాజెక్టు 126 కిలోమీటర్ల వరకు పరుచుకొని ఉంటుంది. ఇందులో 55 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉండగా, ఇందుకు పరిహారం మన ప్రభు త్వం రూ.6 కోట్లు చెల్లించింది. ఈ ఒప్పందంలో ఉన్న నిబంధనలే వివాదానికి కారణం. అందులో భవిష్యత్తులో మహారాష్ట్ర కట్టబోయే ప్రాజెక్టులతో గోదావరిలోని 60 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. అప్పటికే వినియోగంలో ఉన్న టీఎంసీలు దీనికి అదనం. అయితే అప్పటికే ఎన్ని టీఎంసీలను మహారాష్ట్ర వినియోగించుకుంటున్నదనే విషయం లేదు. 1975 ఒప్పందానికి ముందే తాము 42 టీఎంసీలు వినియోగిస్తున్నామని, మరో60టీఎంసీలు ఉపయోగించుకునే హక్కుం దని మహారాష్ట్ర వాదిస్తోంది. 2004లో బాబ్లీకి రూపకల్పన చేసింది. ఒప్పందం నాటికి మహారాష్ట్ర కేవలం 19 టీఎంసీలే వినియోగిస్తోందని, ఒప్పందం ప్రకారం మరో 60 టీఎంసీలు వాడుకోవాలని ఏపీ వాదిస్తోంది. నిబందనలకు విరుద్ధంగా 102 టీఎంసీలపై ఆ రాష్ట్రం కన్నేసి అక్రమంగా బాబ్లీ సహా 11 ప్రాజెక్టులను కడుతోందని మన రాష్ట్రం చెబుతోంది. ఎస్‌ఆర్‌ఎస్పీ జలాశయం పరిధిలోనే బాబ్లీ నిర్మాణాన్ని చేపట్టారు. ఎస్‌ఆర్‌ఎస్పీ ఎగువన ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో తన భూభాగంలో బాబ్లీ నిర్మాణాన్ని చేపట్టింది. అంటే 45 కిలోమీటర్ల ఎస్‌ఆర్‌ఎస్పీ నీటిని బాబ్లీ బ్యారేజీ వినియోగించుకునే అవకాశం ఉంది.

బాబ్లీతో నష్టం జరిగేది ఇలా
బాబ్లీ బ్యారేజీ వద్ద గోదావరి నది లోతు 1070 అడుగులు. 1071 అడుగుల దాకా ఒక అడుగు మేర రాతి కట్టడం. ఆ పైన 38 అడుగుల ఎత్తైన గేట్లు. అంటే బాబ్లీ పూర్తిస్థాయి నీటిమట్టం 1109 అడుగులు. గేట్లు తెరిస్తే 1071 అడుగుల నుంచి 1091 అడుగుల దాకా ఏర్పడే బాబ్లీ జలాశయం శ్రీరాంసాగర్‌లో భాగమే. ఒకవేళ గేట్లు దించితే 1109 అడుగుల నుంచి 1071 అడుగుల వరకున్న నీటి నిలువ 2.74 టీఎంసీలే. 1071 అడుగుల నుంచి 1091 అడుగుల(శ్రీరాంసాగర్ పూర్తి జలమట్టం) దాకా ఉన్న నీటి పరిమాణం ఇంకా చాలా తక్కువ. అది 0.65 టీఎంసీలు మాత్రమే. 1091 అడుగులపైన బాబ్లీ జలాశయం నీటిపై మనకెలాంటి ఇబ్బంది లేదు. 1091 కింద గేట్లు మూస్తే శ్రీరాంసాగర్‌లో 0.65 టీఎంసీలు, గేట్లు తెరిస్తే 1091 అడుగుల నుంచి 1071 అడుగుల దాకా సుమారు 65 టీఎంసీల నీరు బాబ్లీలో ఉంటుంది. దీంతో ఈ నీటిని ఎంతైనా లాక్కునే అవకాశం మహారాష్ట్రకు ఉంటుంది. బాబ్లీ మొత్తం నీటి సామర్థ్యం 2.74 టీఎంసీలేనని, అందులో 0.65 టీఎంసీల నీరు మాత్రమే శ్రీరాంసాగర్‌కు చెందిన నీరు అని మహారాష్ట్ర వాదిస్తోంది. అవసరమైతే ఈ నీటిని తిరిగి ఏపీకి ఇచ్చేస్తామని చెబుతోంది. కానీ, ఈ ముసుగులో 65 టీఎంసీల దాకా నీటిని వాడుకునే అవకాశం ఉందని మన రాష్ట్ర నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాబ్లీకి ఎగువన మరో 11 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇసుక మేటల మూలంగా ఎస్‌ఆర్‌ఎస్పీ నీటిని నిలుపుకునే శక్తిని కోల్పోయింది. మొత్తం 196 టీఎంసీల నీరు ఎస్‌ఆర్‌ఎస్పీ వినియోగించుకోవాల్సి ఉండగా మహారాష్ట్ర అక్రమ కట్టడాలు, ఇతర నిర్మాణాల మూలంగా 150 టీఎంసీల నీరు కూడా రావడం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టుపైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సుమా రు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడింది. బాబ్లీకి సుప్రీం అనుమతి ఇవ్వడంతో ఈ ఆయకట్టు పరిస్థితి ప్రమాదంలో పడింది.

ఈ పాపం సర్కారుదే!
బాబ్లీ పట్ల ఆది నుంచీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రస్తుతం పరిస్థితి తలెత్తిందన్న విమర్శలున్నాయి. 2004 ఆగస్టు 9న బాబ్లీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం, వెంటనే పనులు ప్రారంభించింది. ఈ విషయమై చాలా ఆలస్యంగా మేల్కొన్న నాటి రాష్ట్ర ప్రభుత్వం..బాబ్లీని ఆపేందుకు 2006లో సుప్రీంలో పిటిషన్ వేసింది. దీనిపై 2007లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గేట్లు బిగించొద్దని ఆదేశించింది. 2008 మార్చి 26న సుప్రీం బాబ్లీ చట్టబద్ధతపై విచారణకు ఆదేశించింది. ఈ లోగా ట్రయల్ రన్ పేరుతో గేట్లు అమర్చింది. దీంతో రాష్ట్రం కోర్టుధిక్కార పిటిషన్‌ను వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ 2009లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2012 నవంబర్ 8న సుప్రీంలో వాదనలు పూర్తయ్యాయి. గురువారం తుది తీర్పును వెలువరించింది. ఇలా కేసు నడుస్తుండగానే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ సహా మరో 1ఖైపాజెక్టులు నిర్మించింది. తెలంగాణతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టుపై వాదనలు వినిపించడంలో మన ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.

ఇప్పుడేం చేయాలి?
తాజా తీర్పులో బాబ్లీపై కేంద్ర జలసంఘం నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించడం ఒక్కటే మనకు కాస్త ఊరటనిచ్చే విషయం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తీర్పు మేరకు కేవలం 2.74 టీఎంసీల నీటికి మించకుండా మహారాష్ట్ర వాడుకునేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. తెలంగాణతో ముడిపడి ఉన్న చేవేళ్ల-వూపాణహిత, ఇచ్చంపల్లి, పెన్‌గంగ ప్రాజెక్టులపై మహారాష్ట్ర సహకారం ఎంతైనా అవసరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్రంతో భవిష్యత్తులో ఘర్షణతో వెళ్లకుండా, సామరస్యపూర్వకంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని నిపుణులు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి