-పీపీఏల రద్దుకు ఆంధ్రా సర్కార్ నిర్ణయం
-ఈఆర్సీకి ఏపీ జెన్‌కో లేఖ .. విభజన చట్టానికి విరుద్ధంగా నిర్ణయం
-తెలంగాణ మీద ఆంధ్రాబాబుల యుద్ధ ప్రకటన..
-పీపీఏల రద్దుతో తెలంగాణకు 518 మెగావాట్ల విద్యుత్‌లోటు
-ఈఆర్సీకి ఏపీ జెన్‌కో లేఖ .. విభజన చట్టానికి విరుద్ధంగా నిర్ణయం
-తెలంగాణ మీద ఆంధ్రాబాబుల యుద్ధ ప్రకటన..
-పీపీఏల రద్దుతో తెలంగాణకు 518 మెగావాట్ల విద్యుత్‌లోటు
హైదరాబాద్, జూన్ 17 (టీ మీడియా):తెలంగాణ స్వాతంత్య్రంపై కడుపులో ఉన్న విషాన్ని ఆంధ్రా బాబులు వివిధ రూపాల్లో కక్కుతూనే ఉన్నారు. నవజాత శిశువు గొంతు నులిమే వారి అరాచకత్వం మరోసారి బయటపడింది. ఏపీజెన్‌కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) నుంచి వైదొలుగుతూ ఏపీ సర్కారు అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్(కమర్షియల్) నుంచి మంగళవారం ఉదయం ఈఆర్సీకి లేఖ అందింది. దీనివల్ల తెలంగాణలోని జెన్‌కో ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణకు, సీమాంధ్ర జెన్‌కో యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కొత్త ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కానున్నాయి. ఫలితంగా తెలంగాణకు ఇపుడున్న విద్యుత్ లోటుకు తోడు అదనంగా 518 మెగావాట్ల విద్యుత్‌లోటు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఒప్పందాల ఆమోదంలో జాప్యం..
ఉమ్మడి రాష్ట్రంలో జెన్‌కో పరిధిలో 8,924.9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. అందులో తెలంగాణలో 4,235.3 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటు, సీమాంధ్రలో 4,689.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్లు ఉన్నాయి. మొత్తంగా 6,530 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జెన్‌కో ప్రాజెక్టులతో నాలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు(వరంగల్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం) విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ పీపీఏలు 2002 సంవత్సరంతో ముగిశాయి. పీపీఏలను మరికొంతకాలంపాటు కొనసాగించాలని నాలుగు డిస్కమ్‌లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించాయి. ఏపీ జెన్‌కో యాజమాన్యం సైతం పీపీఏలను ఆమోదించాలని పలు దఫాలుగా ఈఆర్సీకి విజ్ఞప్తి చేసింది. అయితే ఈఆర్సీ మాత్రం నిర్ణయం తీసుకోకుండా ఏళ్ళతరబడి జాప్యం చేసింది. ఇదే క్రమంలో జెన్‌కో పరిధిలో వచ్చే కొత్త పవర్ ప్రాజెక్టులకు 2009 సంవత్సరంలోనే పీపీఏలు కుదుర్చుకున్నా వాటిని సైతం ఈఆర్సీ అధికారికంగా ఈనాటివరకు ఆమోదించలేదు.
విభజన చట్టంలో స్పష్టంగా కేటాయింపులు..
ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన సమయంలో రెండు ప్రాంతాల్లో విద్యుత్ వినియోగాన్ని లెక్కించి ఎవరికీ నష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ద్వారా రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణకు 53.89 శాతం, సీమాంధ్రకు 46.11 శాతం వాటా నిర్ణయం జరిగింది. రాష్ట్ర విభజన క్రమంలో భాగస్వాములైన నిపుణులు వివాదాలకు ఆస్కారం లేకుండా విద్యుత్ విభజన చేశారు. భౌగోళికంగా ఎక్కడి విద్యుత్ ప్రాజెక్టు ఆ రాష్ర్టానికి చెందడంతోపాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం విద్యుత్ లభ్యత ఇరు రాష్ర్టాలకు ఉంటుందని విభజన చట్టం స్పష్టంగా పేర్కొంది.
అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారంగా విద్యుత్ వినియోగాన్ని బట్టి విద్యుత్ విభజన జరగడాన్ని ఆంధ్రాబాబులుజీర్ణించుకోలేకపోతున్నారు. మిగతా విషయాలన్నీ జనాభా ఆధారంగా విభజించినప్పుడు విద్యుత్ విభజన సైతం జనాభా ఆధారంగానే ఉండాలని ఏపీ సర్కారు వాదిస్తోంది. అలా జరిగితే తెలంగాణ విద్యుత్ కోతతో విలవిలలాడుతుంది. ఈ క్రమంలో వారికి ఇప్పటివరకు ఈఆర్సీ జెన్‌కో పీపీఏలకు అనుమతివ్వని విషయం లడ్డూలా దొరికింది. దానితో పీపీఏలు అమలులో లేనందున అవి కొనసాగుతున్నట్లు కాదని, ఏపీ జెన్‌కో సమర్పించిన పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ పరిశీలించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో సదరు పీపీఏలను ఏపీ జెన్‌కో రద్దు చేసుకుంటున్నట్లుగా ఈఆర్సీకి మంగళవారం లేఖ అందింది.
ఈఆర్సీ వద్ద పెండింగ్‌లో 27 ప్రాజెక్టు పీపీఏలు గత ఐదేళ్ళకుపైగా ఏపీఈఆర్సీ 27 పవర్ ప్రాజెక్టులకు
సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు పెండింగ్‌లో ఉంచుకోవడం గమనార్హం. వాస్తవానికి పీపీఏల ప్రతిపాదనలు ఒకటి రెండు సంవత్సరాల్లో ఈఆర్సీ ఖరారుచేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాటిని పీపీఏ ప్రతిపాదనలు అందజేసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీల(డిస్కమ్స్)కు తిరిగి పంపించాల్సి ఉంది. కానీ 2009 సంవత్సరం నుంచి ఈఆర్సీ జెన్‌కోకు సంబంధించిన ఏ ఒక్క పీపీఏను ఖరారు చేయకపోవడం గర్హనీయం. ఇదిలా ఉండగా, ఏపీ సర్కార్ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నది.
మన్ముందు న్యాయపోరాటమే..
ఏపీ జెన్‌కో విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) రద్దు చేయాలని ఆంధ్రా సర్కార్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇరు రాష్ర్టాల న్యాయపోరాటాలకు నాంది అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చుననే భావన వ్యక్తమవుతోంది. వాస్తవానికి పీపీఏలు నిర్ణీతకాలంలో ఈఆర్సీ ఎందుకు ఆమోదించలేదు ? ఇందుకు బాధ్యులెవ్వరు ? ఈఆర్సీ నిర్లక్ష్యంతో నెలకొన్న పరిస్థితులకు ఎవర్ని నిందించాలి ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగానికి సంబంధించిన పీపీఏ ప్రతిపాదనలు 2009లో ఈఆర్సీకి అందితే వాటిని పక్కన బెట్టి ఇంతకాలం ఈఆర్సీ చేసిన రాచకార్యాలు ఏమిటనేది ఎవ్వరికీ అంతుబట్టడంలేదు. ఇదిలా ఉండగా, ఈఆర్సీ వద్ద పీపీఏల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నకాలంలోనూ ప్రతియేడాది పీపీఏ ప్రకారంగానే పెట్టుబడి వ్యయంతో పాటు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను జెన్‌కో, డిస్కమ్‌లు అనుసరించినందున సదరు పీపీఏలు అమలులో ఉన్నట్టేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. దరఖాస్తుదారుడి విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే సదరు దరఖాస్తును సంపూర్ణంగా అమోదించినట్లేనని సుప్రీంకోర్టు తీర్పులు సైతం ఉన్నాయని చెబుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి