2, జూన్ 2014, సోమవారం

తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ.జయశంకర్...

     తెలంగాణా కోసం జీవితాంతం పరితపించిన గొప్ప వ్యక్తి, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ.కె.జయశంకర్ తన జీవితం మొత్తం ఒక్కటే ఆకాంక్షతో బతికారు. అది ఎంతగా అంటే..వివాహబంధం వల్ల ఏర్పడే అనుబంధాలు తన ఉద్యమస్ఫూర్తికి పెనుబంధం అవుతుందేమోననేంతగా.అందుకే ఆయన ఆజన్మాంతం బ్రహ్మచారిగానే గడిపారు. తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణా విముక్తికి అంకితం చేసారు. అధ్యాపకులంతా ఒక నిరాశావాదంలో ఉండే దశలో కూడా తెలంగాణ ఉద్యమం అనివార్యంగా వస్తుందని ఆయన విశ్వసించాడు. దాని కొరకు తనను తాను సమాయత్త పరుచుకున్నాడు. ఉద్యమానికి సంబంధించి ప్రజల్ని జాగుర పరచడంలో అధ్యాపకుల పాత్ర ఉంటుందని, ఉండాలని ఆయన విశ్వసించాడు. అధ్యాపకులు తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా విశాల సామాజిక తరగతి గదిలో ఒకవైపు విద్యార్థిలా ప్రజల నుంచి నేర్చుకుంటూ, ప్రజలకు తమ విజ్ఞానాన్ని అందించాలని బలంగా భావించాడు. అలా భావించినందువల్లే తెలంగాణ అంతా తిరిగాడు. వేల ఉపన్యాసాలు ఇచ్చాడు. జయశంకర్ ఇచ్చిన వారసత్వం ఉపాధ్యాయ, అధ్యాపక వర్గానికి సదా ఒక స్ఫూర్తిని కలిగించేదే. అందుకే ఆయన ఈనాటి తరానికి క్రాంతదర్శి.
జననం..
    
నాటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కన్నపేట గ్రామంలో 1934 ఆగస్టు 6న మహాలక్ష్మి, లక్ష్మి కాంతరావు దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం తన సొంత ఊరిలోనే గడిచింది.
    హన్మకొండలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఎంఎ ఎకనామిక్స్ ను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి, పిహెచ్ డి ఎకనామిక్స్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈడీ నుంచి పూర్తి చేసారు.
ఉద్యోగ జీవితం..
    
వరంగల్ లోని సికెజి కాలేజీకి ప్రిన్సిపాల్ గా పని చేసిన ఆయన ఆ తర్వాత 1991 లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులయ్యారు. ఆయన ఏ హోదాలో ఉన్నా తెలంగాణ అంశం మాత్రం జయశంకర్ ను వదలలేదు. దాన్ని ఆయన వదలలేదు.
ఉద్యమాల వైపు జయశంకర్ అడుగులు...
    
ఆయన చదువుకునే రోజుల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. స్వాతంత్ర ఆకాంక్ష ఉన్నవారంతా వందేమాతరం అని పలకరించుకునేవారు. కానీ, హైదరాబాద్ లో మాత్రం నిజాం రాజు వందేమాతరంను నిషేధించాడు. ఆయన పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న సమయంలోనే వందేమాతరం అని నినదించాడు. ఆ తర్వాత ఆయన విద్యార్థి దశలో ఉండగానే ఉద్యమం వైపు అడుగులు వేసారు. తెలంగాణా సైనిక పాలనలో ఉన్న రోజుల్లో ఉద్యోగాలన్నీ ఆంధ్రా వారికి కట్టబెడుతున్నారని, దానికి వ్యతిరేకంగా 1952 లో 'నాన్ ముల్కి' లేదా 'ఇడ్లి సాంబార్ గో బ్యాక్' ఉద్యమాలు నడిచాయి. ఈ ఉద్యమంలో జయశంకర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోలీసు కాల్పుల్లో ఆయన తన సహచరులను కోల్పోయారు. దీనికి చలించిన ఆయన 10 మంది విద్యార్థులతో తెలంగాణా జనసభను ప్రారంభించారు. ఇది రోజురోజుకు విస్తరిస్తుండడంతో భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది. ఫజల్ అలీ కమిటీ (మొదటి ఎస్సార్సీ) రాష్ట్రానికి వచ్చినపుడు విద్యార్థి విభాగం తరపున ఆయన కమిటీని కలుసుకొని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలని బలంగా వాదించారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జయ శంకర్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు అనేకసార్లు సచివాలయం వెళ్లి మంత్రులతో మాట్లాడారు. అక్కడ వారు ఇచ్చిన అవహేళనతో కూడిన సమాధానాలు ఆయనను బాధించాయి.
మొదటి తెలంగాణా ఉద్యమం(1969)...
    
ఖమ్మం జిల్లాలో ఉద్యోగి నిరాహార దీక్షతో మొదటి తెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది. ఉస్మానియా విశ్వ విద్యాలయం రగిలి పోయింది. తెలంగాణా ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా అనేక సభలలో ఉపన్యసించారు. అనేక పత్రికలకు తెలంగాణా ఆవశ్యకతను వివరిస్తూ అయన కథనాలు, అనేక పుస్తకాలు రాసారు. తెలంగాణా ప్రజలను, విద్యార్థులను చైతన్య పరచడానికి ఆయన ఎనలేని కృషి చేసారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 369 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఆ తర్వాత 1969 లో వచ్చిన భార్గవ కమిటి ముందు ఉద్యోగ సంఘాల తరఫున జయశంకర్ తన వాదనలు వినిపించారు.
తెలంగాణా విముక్తికి జీవితం అకింతం..
    
తన జీవితం మొత్తం ఒక్కటే ఆకాంక్షతో నిరాడంబర జీవితాన్ని గడిపారు. జీవితాన్ని పూర్తిగా తెలంగాణా విముక్తికి అంకితం చేశారు. ఆర్థికశాఖ నిపుణుడు కాబట్టి ఆయన తెలంగాణా విషయంలో జరిగిన అన్యాయాలను అంకెలతో సహా చెప్పేవారు.
మలిదశ తెలంగాణా ఉద్యమం..
    
1996 లో ప్రొ.జయశంకర్ అధ్యక్షతన వరంగల్ లో జరిగిన సదస్సుకు అనూహ్యంగా వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. ఈ పరిణామంతో జయశంకర్ లో కొత్త ఆశలు చిగురించాయి. పరాయి పాలన నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని గ్రహించారు. ప్రజాసంఘాలు, కవులు, కళాకారులూ, మేధావులను ఒక్క తాటిపైకి తెచ్చారు. అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రజలలో చైతన్యం తేవడం ప్రారంభించారు.
ఎన్ ఆర్ ఐ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు..
    
1999లో ఎన్ ఆర్ఐ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరంను ఏర్పాటు చేసారు. 2000 సంవత్సరంలో ఆయన అమెరికా వెళ్లి అక్కడున్న ఎన్ ఆర్ఐలను సంఘటితం చేసారు. వాళ్ళను ఉద్యమం వైపుగా కదిలించగలిగారు. ఇక అందరు ఒక అభిప్రాయానికి వచ్చారు.
టిఆర్ఎస్ ఏర్పాటు...
    
తెలంగాణా కోసం ఒక రాజకీయ వేదిక కావాలని, అదే సమయంలో టిడిపికి రాజీనామా చేసిన కెసిఆర్ ప్రొ.జయశంకర్ ను కలిసి ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)ను ఏర్పాటు చేసారు. జయశంకర్ మాత్రం పార్టీ సిద్ధాంతకర్తగానే మిగిలిపోయి టీఆర్ఎ స్ ను వెనకుండి నడిపించారు. 2009 లో కెసిఆర్ నిరాహార దీక్ష సమయంలో ఆయన వెంట ఉన్నారు. 11 రోజుల తర్వాత తెలంగాణా అనుకూల ప్రకటన రాగానే జయశంకర్ చేతుల మీదుగా కెసిఆర్ దీక్షను విరమించారు. జయశంకర్ రాసిన "తెలంగాణా రాష్ట్రము- ఒక డిమాండ్" అనే పుస్తకంలో ఏఏ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో సవివరంగా వివరించారు. ఆయన అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దల్ని కలిసి తెలంగాణా ఆవశ్యకతను వారికీ వివరించారు. చివరిగా 2010 జనవరి 5 న చిదంబరం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష భేటికి టిఆర్ఎస్ తరపున వెళ్లి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, వాస్తవాలను వివరించారు.
జయశంకర్ మరణం...
    
జీవితాంతం తెలంగాణా కోసం పరితపించిన జయశంకర్ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ వరంగల్ లో 2011జూన్ 21న ఉదయం 11: 15 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలంగాణా జాతి పితగా ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ కొలువై ఉంటారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోనే జయశంకర్ ఆశయాలు నెరవేరనున్నాయి. ఆ దిశగా కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తుందని ఆశిద్దాం. ఈ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిర్భావ సమయాన యావత్ తెలంగాణ చెబుతోంది ఈ దివంగత ప్రొఫెసర్ కు సలాం సాహెబ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి