10, డిసెంబర్ 2012, సోమవారం

సూర్యతేజంతో ఉత్తేజం


* పెద్దఎత్తున సౌర, పవన విద్యుత్తు పథకాలు
* ప్రోత్సాహకాలతో ఆకట్టుకుంటున్న సర్కారు
* అక్కడి గ్రామాల్లోనూ సోలార్‌ వెలుగులే

రష్యాలో ఓ వ్యోమగామి భార్య.. బడికి వెళ్తున్న కొడుకుతో చెప్పింది... ''కన్నా నేను రొట్టెల కోసం రేషన్‌ దుకాణానికి వెళ్తున్నాను. వచ్చేసరికి సాయంత్రమైపోతుందేమో! నాన్న నిన్ను బడిలో దించేసి 'చంద్రమండల యాత్రకు' వెళ్తారట... సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారు కనుక వస్తూ నిన్ను బడినుంచి తీసుకువచ్చేస్తార్లే''...
సోవియట్‌ రష్యా పతనానికి ముందు అక్కడ వ్యాప్తిలో ఉన్న ఓ జోక్‌ ఇది. అప్పట్లో ఆ దేశంలో చంద్రమండలానికి వెళ్లి రావడం సులభంగానూ, రేషన్‌ దొరకడం మాత్రం గగనంగానూ ఉండేదట! తర్వాత రష్యా ఎలా పతనమైందో అందరికీ తెలిసిందే!
నాయకులు ప్రజావసరాలను గుర్తించకుండా తమ ప్రాధాన్యాలను తాము ఏర్పరుచుకుని సాగిపోతుంటే అంతేమరి! నేతలకైనా... పార్టీలకైనా... చివరకు దేశాలకైనా అదే సూత్రం!! విద్యుత్తు విషయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ సహా చాలా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులు ఇలాగే ఉన్నాయి.
...గుజరాత్‌ మాత్రమే దీనికి కాస్త మినహాయింపులా కనిపిస్తోంది.
ప్రకృతి వరప్రసాదమైన సూర్యుడి నుంచి వచ్చే కాంతిని ఒడిసిపట్టుకుంటున్న గుజరాత్‌ సౌర విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశం మొత్తంమీద ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్తులో సగానికి పైగా ఇక్కడిదే కావడం విశేషం. భూసేకరణ అవసరం లేకుండా సాగునీటి కాలువపై సౌర ఫలకాలను ఏర్పాటుచేయడం గుజరాతీల సృజనకు, వ్యాపార దృక్పథానికి నిదర్శనం. అక్కడ గ్రామాల్లో వీధి దీపాలకూ సోలార్‌ ప్యానెళ్లు కనిపిస్తాయి. భవనాల మీద సెల్‌టవర్లకు అద్దెకిచ్చినట్లుగా సౌర ఫలకాల ఏర్పాటు కోసం అద్దెకు ఇచ్చుకోవచ్చు.
బొగ్గు ఆధారిత థర్మల్‌ ప్రాజెక్టులతో కాలుష్య భయం వెంటాడుతోంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. గ్యాస్‌ ప్రాజెక్టులకేమో సరఫరా లేదు. ఇక అణు విద్యుత్తు ప్రాజెక్టులపై దాదాపు యుద్ధాలే నడుస్తున్నాయి. జల విద్యుత్తేమో వరుణుడి కరుణపైనే ఆధారం. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ఏ వివాదమూ, కాలుష్యం భయం లేనివి సంప్రదాయేతర వనరులైన పవన, సౌర విద్యుత్తు ప్రాజెక్టులే. వాటిని ఒడుపుగా పట్టుకోవడంలో గుజరాత్‌ దేశంలోనే ముందుంది.
దేశవ్యాప్తంగా సౌర విద్యుత్తు సామర్థ్యం మొత్తం 1,010 మెగావాట్లు. ఇందులో గుజరాత్‌ వాటా సగానికి పైనే... అంటే 695 మెగావాట్లు. చెట్టూపుట్టలపైనా, కాలువలపైనా, చివరకు ఇళ్లపైనా ఎక్కడ చూసినా సోలార్‌ ఫలకాలే కనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుల కేటాయింపులో అవకతవకలు, అధికార దుర్వినియోగం జరిగాయనే అభియోగాలు ఉన్నా... వాటిని పక్కన పెట్టి రాష్ట్రానికి అందుతున్న విద్యుత్తు వెలుగుల్ని చూస్తే మాత్రం ఆశ్చర్యమేస్తుంది! స్వల్ప వ్యవధిలో ఇది సాధ్యమేనా? అనిపిస్తుంది. ప్రకృతిపరంగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న తీరు చూసి ముచ్చటేస్తుంది.
ప్రకృతి వరం...
మనదేశంలో సూర్యకాంతి దేదీప్యమానంగా వెలుగొందే ప్రాంతాల్లో గుజరాత్‌ ఒకటి. భౌగోళికంగా ఉన్న పరిస్థితుల్ని బట్టి అక్కడ సూర్యకిరణాలు నిట్టనిలువునా పడతాయి. అందుకే సోలార్‌ విద్యుత్తులో ఉత్పదకత గరిష్ఠంగా 25 శాతం ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని ఆ రాష్ట్రం సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుంటోంది. పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు జారీచేయడంతో సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులు బారులు తీరుతున్నాయి. అక్కడ సౌర విద్యుత్తు యంత్రాల తయారీ పరిశ్రమను కూడా నెలకొల్పనున్నట్లు గుజరాత్‌ విద్యుత్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. దీని వలన ప్రస్తుతం యూనిట్‌ రూ. 15 పడుతున్న సౌర విద్యుత్తును ఎనిమిది రూపాయలకే ఉత్పత్తి చేయొచ్చని తెలిపాయి. ఇది కూడా పూర్తయితే ఆ రాష్ట్రంలో ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది.
ఆసియాలోనే పెద్ద సౌర విద్యుత్తు పార్కు
పటాన్‌జిల్లా చర్నక గ్రామ సమీపంలో ప్రభుత్వం మూడువేల ఎకరాలలో 'సౌర విద్యుత్తు పార్కు' ఏర్పాటుచేసింది. ప్రభుత్వం 971 మెగావాట్లకు ఒప్పందాలు పూర్తి చేసింది. ఇందులో 601 మెగావాట్లు ఉత్పత్తిలోకి వచ్చింది. 2017 నాటికి 2000 మెగావాట్లు సాధించాలనేది లక్ష్యం.
ఒక మెగావాట్‌ యూనిట్‌ నుంచి రోజుకు తక్కువలో తక్కువ 5 వేల యూనిట్లు ఉత్పత్తి అవుతుందని సౌర విద్యుత్తు పార్కు నిర్వహణ మేనేజర్‌ తాకరి 'ఈనాడు-ఈటీవీ'కి తెలిపారు.
'సౌర విద్యుత్తు ఉత్పత్తిలో దేశానికి ఆదర్శంగా ఉంటామని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు ఇవ్వడం తమ కర్తవ్యమని' ఆ రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి సౌరభ్‌ పటేల్‌ తనను కలిసిన 'ఈనాడు-ఈటీవీ' ప్రతినిధులతో పేర్కొన్నారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి