19, డిసెంబర్ 2012, బుధవారం

తరలిపోతున్న నల్లధనం


అక్రమార్కులు యధేచ్చగా నల్లధనాన్ని తాము అనుకున్న చోటుకు తరలిస్తున్నారు. గత పది సంవత్సరాల్లో మన దేశం నుంచి అక్షరాలా ఆరు లక్షల 74 వేల కోట్ల రూపాయలు పరాయి దేశాలకు తరలిపోయాయి.
Written by Parvathi On 12/19/2012 2:39:00 PM
దేశంలో నల్లధనానికి అడ్డుకట్ట పడటం లేదు. ప్రపంచం మొత్తమ్మీద నల్లధనం భారత్ నుంచి ఎక్కువగా తరలిపోతుంది. స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బును దాచిపెడుతున్నవారిలో మన దేశానికి చెందినవారే అగ్రస్థానంలో ఉంటున్నారు. మనదేశం నల్లధనం రూపేణా నష్టపోయిన మొత్తం దాదాపు 123 బిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

అక్రమార్కులు యధేచ్చగా నల్లధనాన్ని తాము అనుకున్న చోటుకు తరలిస్తున్నారు. గత పది సంవత్సరాల్లో మన దేశం నుంచి అక్షరాలా ఆరు లక్షల 74 వేల కోట్ల రూపాయలు పరాయి దేశాలకు తరలిపోయినట్టు గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటి సంస్థ తన నివేదికలో పేర్కొంది. అక్రమ మార్గాల్లో డబ్బు తరలివెళ్తున్న 150 దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. 2001 - 2010ల మధ్య 6లక్షల 74 వేల కోట్ల రూపాయలు దేశం నుంచి తరలిపోయింది.

భారత్ ఆర్ధిక వ్యవస్థకు ఆరు లక్షల కోట్లు చాలా పెద్ద మొత్తమని జీఎఫ్‌ఐ పేర్కొంది. విద్యా, ఆరోగ్య, మౌలిక సదుపాయాల రంగాలను ఈ డబ్బుతో అభివృద్ది చేసే అవకాశముందని నివేదిక రూపకర్తలు అభిప్రాయపడ్డారు. 123 బిలియన్ డాలర్లు తరలిపోవడం వల్ల భారత ఆర్థిక వ్యవస్ధ తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచం మొత్తమ్మీద చూసినప్పుడు భారతదేశం నుంచి వస్తున్న నల్లధనమే ఎక్కువనే విషయాన్ని వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అస్సాంజే ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

అసలు నల్లధనం అంటే ఏమిటి? ఆదాయపు పన్ను సహా ఏ ఇతర పన్నులు చెల్లించకుండా, ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా దాచుకున్న సొమ్మును ‘నల్లధనం’గా వ్యవహరిస్తారు. విదేశీ బ్యాంకుల్లో ఇది డిపాజిట్ల రూపంలో ఉంటే దేశీయంగా అక్రమ లావాదేవీలతో పోటీ ఆర్థిక వ్యవస్థను నడుపుతుంటుంది.

ధనం అంటే ఒక్క కరెన్సీ (రూపాయలు లేదా డాలర్లు వగైరా) రూపంలోనే ఉండనక్కరలేదు. బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు తదితర విలువైన లోహాల రూపంలో ఉన్నా, ఇతర వస్తువులు, ఆస్తుల రూపంలో ఉన్నా, పన్నులు చెల్లించకుండా, లెక్కలు చూపకుండా ఉంటే అది నల్లధనంగానే పరిగణించబడుతుంది.

అక్రమ, చట్టవిరుద్ధ లావాదేవీల ద్వారానే నల్లధనం సృష్టించడం సాధ్యమవుతుంది. భారీగా డబ్బు కేటాయింపులు జరిగే అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, షేర్‌మర్కెట్, ఎగుమతులు-దిగుమతుల వ్యాపారం, ఇతర వర్తక-వాణిజ్యాల్లో దొంగ లెక్కలు చూపడం ద్వారా ఆయా వ్యక్తులకు నల్లధనం సమకూరుతుంది.

గత సంవత్సరం జనవరిలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం వివిధ విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనం నిల్వల గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తిరిగి మన ఖజానాకు చేరితే రాత్రికి రాత్రే భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించటం ఖాయం.

కాగా నల్లధనం తరలించిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో నిలిచింది. పదేళ్ల కాలంలో చైనాకు చెందిన కోటి కోట్ల రూపాయలు ఇతర దేశాలకు తరలివెళ్లిందని జీఎఫ్‌ఐ నివేదిక పేర్కొంది. తర్వాత స్థానాల్లో మెక్సికో,మలేషియా ,సౌదీ అరేబియా , రష్యా , ఫిలిప్ఫీన్స్, నైజీరియా దేశాలు నిలిచాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి