10, డిసెంబర్ 2012, సోమవారం

కృష్ణా జలాల వినియోగం - వాస్తవాలు



జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రైబ్యునల్-2 కృష్ణాజలాల వినియోగానికి సంబంధించి ఏప్రిల్ 20న మూడు రాష్ట్రాలకు కొన్ని తాజా ప్రతిపాదనలు అందజేసింది. వాటిపై ఇటీవల రాష్ట్రాల అభిప్రాయాలు తెలియజేయాలని వాటిని కోరింది. మూడు రాష్ట్రాలకు అది కేటాయించిన నీటి వివరాలు ఆసక్తిదాయకం. 75 శాతం విశ్వసనీయత, పునరుత్పాదక జలం ఆధారంగా బచావత్ ట్రైబ్యునల్ (ట్రైబ్యునల్-1) కేటాయించిన 585 శతకోటి ఘనపుటడుగు(టీఎంసీ)లను మహారాష్ట్ర, 734 టీఎంసీలను కర్ణాటక, 811 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వాడుకొన్న తరవాతనే... మూడు రాష్ట్రాలు 65శాతం విశ్వసనీయతతో ట్రైబ్యునల్-2 అదనంగా కేటాయించిన నీటిని వాడుకోవాలి. ఆపై మూడు రాష్ట్రాలు ట్రైబ్యునల్-2 కేటాయించిన మిగులు నీటిని ఉపయోగించుకోవాలి. నీటి సంవత్సరంలో ఒక రాష్ట్రం వినియోగం, మళ్లింపుతోపాటు, నిల్వచేసే నీటినీ ఆ సంవత్సరం కేటాయింపులో భాగంగానే పరిగణిస్తారు. ట్రైబ్యునల్ చేసిన సిఫార్సుల అమలు, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత కృష్ణాజలాల తీర్పు అమలు బోర్డుదే! కృష్ణా ట్రైబ్యునల్-2 మూడు రాష్ట్రాల ముందుంచిన ఈ ప్రతిపాదనలు, సిఫార్సులు చదువుకోవడానికి, వినడానికి బాగానే ఉంటాయి. సిబ్బందిని కేటాయించకుండా, నేరస్థులను దండించే అధికారం లేకుండా- వాటిని అమలుచేయడం బోర్డుకు సాధ్యం కాదు. మూడు రాష్ట్రాలకు వర్షాకాలం, పంటకాలం ఏక సమయంలో వస్తాయి. కేటాయించిన నీటిని అందరికీ ఒకేసారి పంపిణీ చేయవలసి వస్తుంది. దిగువన ఉన్న జలాశయాలకు నీటిని విడుదల చేయడానికి క్రమబద్ధీకరణ కట్టడాలు లేవు. నదులపై ఎన్నో జలాశయాలు, నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి.వాటివద్ద ప్రతిరోజూ నీటిమట్టాలను నమోదుచేసి, విడుదలయ్యే నీటిని నియంత్రించాల్సి ఉంటుంది. 75శాతం, 65శాతం విశ్వసనీయతతో కేటాయించిన నీరు, మిగులు నీరు మూడు రాష్ట్రాలు వరసగా ఒకదాని తరవాత మరొకటి వినియోగించేలా చూడాలి. ఈ ప్రక్రియలన్నీ ఎంతో కష్టతరమైనవి. తగిన దండనాధికారాలు లేకపోవడంవల్ల విధుల నిర్వహణలో గతంలో తుంగభద్ర బోర్డు విఫలమైంది. దానివల్ల దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీరెప్పుడూ అందక, రైతులెన్నో కష్టనష్టాలకు గురయ్యారు. ఈ అంశాలన్నింటినీ ట్రైబ్యునల్-2 దృష్టికి తీసుకువెళ్లాలి. ట్రైబ్యునల్ తీర్పును అమలుచేసే బోర్డుకు అవసరమైన సదుపాయాలు, అధికారాలు కల్పించి, దాన్ని పటిష్ఠపరచాల్సిందిగా కోరాలి.
ట్రైబ్యునల్-2 ఉత్తర్వులోని ఇతర అసంగతాలు
1. నికర జలాల విశ్వసనీయత శాతం: 
1960లో జాతీయాభివృద్ధి సంస్థ, 1969లో భారతీయ ప్రమాణాల సంస్థ, 1972లో రెండో సాగునీటి సంఘం చేసిన సూచనలు, సిఫార్సులు, అంతర్జాతీయ ప్రమాణాలు భారతదేశంలో అనుసరిస్తున్న విధానాలను బచావత్ ట్రైబ్యునల్ పరిగణనలోకి తీసుకొంది.తదనుగుణంగా 75శాతం విశ్వసనీయతతోనే, అప్పటివరకు అందుబాటులో ఉన్న 78సంవత్సరాల్లో (1894-95నుంచి 1971-72 వరకు) కృష్ణానదీ వార్షిక ప్రవాహాన్ని లెక్కగట్టి, మూడు రాష్ట్రాలకు కేటాయించింది.ఎగువ రాష్ట్రాలు 50శాతం, దిగువ రాష్ట్రం 86శాతం విశ్వసనీయతతో నికర జలాలను లెక్కించాలని కోరినా, ఆ అభ్యర్థనలను ట్రైబ్యునల్-1 తోసిపుచ్చింది.
ఈ 75శాతం విశ్వసనీయతను 2002కు ముందే నిర్ధారించినందువల్ల, దాన్ని పరిష్కరించిన వివాదంగానే పరిగణించాలి. 2002లో సవరించిన 'అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం' ఇందులో మార్పులకు అంగీకరించదు. అయినా, ట్రైబ్యునల్-2 దాన్ని పట్టించుకోలేదు. నదీజల ప్రవాహ పరిమాణాన్ని కొంతభాగం 75శాతం, మరికొంత భాగం 65శాతం విశ్వసనీయతతో బుద్ధిపూర్వకంగా నిర్ధారించి, మూడు రాష్ట్రాలకు కేటాయించడం చట్ట ఉల్లంఘనే. ఇలా గతంలో ఏ ట్రైబ్యునలూ నదీజలాలను విభజించలేదు. అదీగాక, రెండు విధాలుగా నదీజలాలను విడుదలచేసి, వినియోగించడం ఆచరణ సాధ్యంకాని పని. మన రాష్ట్రప్రభుత్వం ఈ అంశాన్ని ట్రైబ్యునల్‌కు సోదాహరణంగా వివరించి, అసంగతాన్ని సరిదిద్దాల్సిందిగా కోరాలి.
2. ప్రవాహశ్రేణి ఎంపికలో వ్యత్యాసం: 
బచావత్ ట్రైబ్యునల్ పరిగణనలోకి తీసుకొన్న 78సంవత్సరాల ప్రవాహ వివరాలకు తదుపరి లభ్యమైన 34 సంవత్సరాల (1972-73నుంచి 2005-06 వరకు) వివరాలను ఆంధ్రప్రదేశ్ జతచేసింది. మొత్తం 112 సంవత్సరాల వివరాలను పరిగణనలోకి తీసుకొని, 75శాతం విశ్వసనీయతతో వార్షికంగా లభ్యమయ్యే నికర జలాల లెక్కలను ట్రైబ్యునల్-2కు సమర్పించింది. ఇది గతంలో ట్రైబ్యునల్-1 అనుసరించిన విధానానికి అనుగుణంగా ఉంది. కానీ, 1894-95నుంచి 1950-51 వరకు 56సంవత్సరాల్లో నదీప్రవాహాన్ని అనుభవంలోని సూత్రాలు, సమీకరణల ప్రకారమే లెక్కించారని, 1951-52నుంచి 1960-61 వరకు విజయవాడ వద్ద ఆనకట్టకు గండిపడి, తిరిగి ప్రకాశం బ్యారేజి నిర్మించే వరకు ప్రవాహ పరిమాణాన్ని సక్రమంగా నమోదు చేయలేదని ట్రైబ్యునల్-2 అభిప్రాయపడింది.
1961-62నుంచి 2007-08 వరకుగల 47 సంవత్సరాల్లో మాత్రమే ఆధునిక పద్ధతిలో ప్రవాహాన్ని కొలిచి, నమోదు చేశారంటూ- దాన్నే పరిగణనలోకి తీసుకొంది.దీన్ని ఏ రాష్ట్రమూ కోరలేదు. అదీగాక ఈ 47 సంవత్సరాల్లోనూ ఒకే సంస్థ ద్వారా,ఒకే పద్ధతిలో కాకుండా, మొదటి 12 సంవత్సరాలకు(1961-62నుంచి 1973-74 వరకు) బచావత్ నివేదికలోని ప్రవాహ వివరాలను, తదుపరి 35 సంవత్సరాలకు (1974-75నుంచి 2007-08 వరకు) కేంద్ర జలసంస్థ నమోదు చేసిన ప్రవాహ వివరాలను పరిగణనలోకి తీసుకొంది.వీటిలో మొదటిది అనుభవంలోని సూత్రాలపై ఆధారపడింది. రెండోది కంప్యూటర్‌పై లెక్కించినది.ఈ రెండు వివరాల మధ్య సామ్యం ఏముందని ట్రైబ్యునల్ వాటిని పరిగణనలోనికి తీసుకుందో అర్థం కావటం లేదు. అదీగాక, వార్షిక ప్రవాహశ్రేణి ఎంత పెద్దదిగా ఉంటే, వార్షిక ప్రవాహ పరిమాణం వాస్తవికతకు అంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి, ట్రైబ్యునల్-1 పరిగణనలోకి తీసుకొన్న 78 సంవత్సరాల ప్రవాహశ్రేణికి ఏ ఒక్క రాష్ట్రమూ అభ్యంతరం చెప్పనప్పటికీ దాన్ని అంగీకరించకుండా, కేవలం 47సంవత్సరాల ప్రవాహశ్రేణినే ట్రైబ్యునల్-2 పరిగణనలోకి తీసుకోవడం సక్రమంగా లేదని సమీక్షా సమావేశంలో మనరాష్ట్రం గట్టిగా వాదించాలి.
3. మిగులు నీటి కేటాయింపు: 
75శాతం విశ్వసనీయతతో నికర జలాలను ట్రైబ్యునల్-1 నిర్ధారించింది. 25శాతం కాలావధిలో నీటి కొరత వల్ల ఎగువ రాష్ట్రాలకన్నా దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోతుందని భావించింది. 75శాతం కాలావధిలో లభించే మిగులు జలాలను వినియోగించుకోటానికి ఆంధ్రప్రదేశ్‌కు వెసులుబాటు కల్పించింది.ఈ మిగులు జలాల్లో ఎగువ రాష్ట్రాలకు భాగం కల్పించలేదు.ట్రైబ్యునల్-2 అందుకు భిన్నంగా 65శాతం విశ్వసనీయతతో నికర జలాలను నిర్ధారించడంవల్ల, నీటికొరత 25శాతంనుంచి 35శాతానికి పెరిగింది.మళ్లీ సగటు వార్షిక ప్రవాహాన్ని (58 శాతంతో) 2,578 టీఎంసీలుగా లెక్కించి, మూడు రాష్ట్రాలకు పంచడంవల్ల నీటికొరత 42 శాతానికి పెరిగి,ఆంధ్రప్రదేశ్‌కు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
2,130టీఎంసీలకు మించి లభించే మిగులు జలాలను కట్టకడనున్న ఆంధ్రప్రదేశ్ మాత్రమే వినియోగించుకొనేటట్లు ట్రైబ్యునల్-1 కల్పించిన వెసులుబాటును మార్చకుండా ఉంచాలని మన రాష్ట్రప్రభుత్వం ట్రైబ్యునల్-2ను గట్టిగా కోరాలి.
4. మిగులు జలాలతో పాటు తరుగు జలాల విభజన: 
ట్రైబ్యునల్-2 ఎంచుకొన్న 47 సంవత్సరాల ప్రవాహశ్రేణిలోని 20సంవత్సరాల్లో వార్షిక ప్రవాహ పరిమాణం మూడు రాష్ట్రాలకు విభజించిన సగటు వార్షిక ప్రవాహ పరిమాణం (2,578 టీఎంసీల) కన్నా తక్కువ. 27 సంవత్సరాల్లో మాత్రమే అది ఎక్కువగా ఉంది.ఎక్కువగా ఉన్న ప్రవాహ పరిమాణాన్ని మూడు రాష్ట్రాలకు కేటాయించినప్పుడు, తక్కువగా ఉన్న ప్రవాహ పరిమాణాన్నీ విభజించి ఉండాల్సింది.అలా జరగనందువల్ల,ఆస్తులను మాత్రమే పంచి,అప్పులను పంచకుండా వదిలివేసినట్లయింది.దీనివల్ల, ఇబ్బందులు ఎదుర్కొనేది దిగువనున్న ఆంధ్రప్రదేశ్ మాత్రమే.ఇలా తక్కువ ప్రవాహం ఉన్న సంవత్సరాలు కూడా వరసగా రెండు సంవత్సరాలు ఒక్కసారి, నాలుగు సంవత్సరాలు రెండుసార్లు, ఆరు సంవత్సరాలు ఒక్కసారి సంభవించాయి.
ఈ శ్రేణుల్లో మొదటి సంవత్సరాలు నాల్గింటికి మాత్రమే భవిష్యదుపయోగానికి జలాశయాల్లో నిల్వచేసిన నీటివల్ల ప్రయోజనం ఉంటుంది. మిగతా సంవత్సరాల్లో దిగువనున్న రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవు. కాబట్టి, మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలకు కేటాయించే అంశాన్ని ట్రైబ్యునల్-2 పునర్విచారణ చేయాలి.
5. ఆలమట్టి పూర్తి జలాశయ మట్టం: 
కర్ణాటక ప్రభుత్వం 1996లో భారతీయ విజ్ఞానసంస్థ ద్వారా బెంగళూరు, ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయించింది. ఎగువ కృష్ణా ప్రాజెక్టు కింద కేటాయించిన 173 టీఎంసీల వినియోగానికి ఆలమట్టి జలాశయ నీటిమట్టం +519.6 మీటర్లుంటే సరిపోతుందని నివేదిక సమర్పించింది. ఆ నివేదికను ట్రైబ్యునల్-2 పరిగణనలోకి తీసుకోలేదు. కర్ణాటక ప్రభుత్వ కోరికను మన్నించింది. పూర్తి జలాశయ మట్టాన్ని, కేంద్ర జలసంఘం ఆమోదం లేకుండానే +519.6మీటర్ల నుంచి +524.256 మీటర్లకు, జలాశయ నిల్వ సామర్థ్యాన్ని 173టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెంచింది.
దీనివల్ల ఆగస్టునుంచి అక్టోబరు వరకు మూడు నెలల్లో నదిలో దిగువకు ప్రవాహ పరిమాణం తగ్గి, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సకాలంలో నీరందక, ఖరీఫ్ పంట బొత్తిగా లేకుండాపోయే ప్రమాదమేర్పడింది.ప్రస్తుతం జూన్, జులై మాసాల్లో ఖరీఫ్ పంటకు ఆంధ్రప్రదేశ్‌కు 94 టీఎంసీల నీరు అవసరమవుతుంది.ట్రైబ్యునల్-2 అనుమతించిన ఎనిమిదినుంచి 10 టీఎంసీల నీరు ఏ మాత్రం చాలదు. రాష్ట్ర అవసరాలను ఇలా సోదాహరణంగా వివరించి, జూన్, జులై మాసాల్లో ఆలమట్టి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 94 టీఎంసీల నీటిని విడుదల చేయటంతోపాటు, వరసగా సంభవించే నీటికొరత సంవత్సరాల్లో దిగువ జలాశయాల్లో నీటి నిల్వ లేనప్పుడు, ఖరీఫ్ పంటకు అవసరాన్నిబట్టి, నీటిని విడుదల చేసేటట్లు ట్రైబ్యునల్-2ని కోరాలి.
అందుబాటులో ఉన్న జలరాశి అంచనాలు టీఎంసీల్లో:
వివరాలు
మహారాష్ట్రకు
కర్ణాటకకు
ఆంధ్రప్రదేశ్‌కు
మొత్తం
వ్యాఖ్య
75 శాతం విశ్వసనీయతతో పునరుత్పాదక జలం
560
25
700
34
800
11
2060
70
ట్రైబ్యునల్-1 కేటాయింపు
65 శాతం విశ్వసనీయతతో అదనంగా మిగులు జలాలు
46
35
72
105
45
145
163
285
ట్రైబ్యునల్-2 కేటాయింపు
మొత్తం
666
911
1001
2578
 
6. అనావృష్టి ప్రాంతాలకు నీటి కేటాయింపులో విచక్షణ: 
అనావృష్టి ప్రాంతాల సాకుతో ట్రైబ్యునల్-2, ఎగువ తుంగ, ఎగువ భద్ర, సింగటలూరు ప్రాజెక్టులకు తుంగభద్ర జలాశయం నుంచి 40టీఎంసీలు, ఆలమట్టినుంచి ఎగువ కృష్ణా ప్రాజెక్టుకు అదనంగా 130టీఎంసీల నీటిని కేటాయించింది.ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, రాయలసీమ ప్రాంతంలోని గాలేరు-నగరి, హంద్రీ-నీవా, దక్షిణ తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు దుర్భర అనావృష్టి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంలో ఉన్నప్పటికీ, వీటికి అవసరమైన 197టీఎంసీల్లో ఏ మాత్రం కేటాయించలేదు. కాబట్టి, మూడు రాష్ట్రాల్లోని అనావృష్టి ప్రాంతాల విస్తీర్ణాల నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌కూ తగిన పరిమాణంలో నీటిని కేటాయించి, రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల్లోని అసమానతలను సర్దుబాటు చేయాల్సిందిగా అర్థించాలి.
7. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై అభ్యంతరం తెలిపే హక్కు: 
ఎగువ రాష్ట్రాల్లో చట్ట వ్యతిరేకంగా ప్రాజెక్టులను అసంఖ్యాకంగా నిర్మిస్తున్నారని, దానివల్ల తమకు కేటాయించిన నీరు అందదని దిగువ రాష్ట్రం ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయగా, దిగువ రాష్ట్రంలోనూ అనధికారికంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఎగువ రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయి.ఒక రాష్ట్రం నిర్మించే ప్రాజెక్టువల్ల మరో రాష్ట్రానికి తగినంత నష్టం ఉంటే తప్ప, ఆ రాష్ట్రానికి అభ్యంతరం తెలిపే హక్కు ఉండదని ట్రైబ్యునల్-2 స్పష్టం చేసింది. దీనివల్ల ఎగువ రాష్ట్రాలను, దిగువ రాష్ట్రాల్ని ఒకేగాటన కట్టినట్లయింది.నదికి దిగువనున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణంవల్ల, ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదు.కానీ, కృష్ణా బేసిన్‌లో ఎగువ రాష్ట్రాల్లోని ఆలమట్టి, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల ద్వారా గణనీయమైన పరిమాణంలో నీటిని పొందే వీలుంది.
ఎగువ రాష్ట్రాలు విచక్షణ రహితంగా ప్రాజెక్టులు నిర్మించి, ఎక్కువ నీటిని వినియోగించుకొంటున్నప్పుడు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీరందక విపరీతమైన నష్టం కలుగుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి, ఎగువ రాష్ట్రాలు అక్రమంగా నిర్మించే ప్రాజెక్టులపై ట్రైబ్యునల్-2 తగిన చర్యలు తీసుకోకపోతే, తాజా తీర్పే నిరర్థకమవుతుంది.
8. తీర్పు పునఃపరిశీలన గడువు: 
గతంలో బచావత్ ట్రైబ్యునల్ 1976 మే నెలలో తుది తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును 2000 మే 31 తరవాత, అంటే- 24 సంవత్సరాల అనంతరం పునఃపరిశీలన చేయించవచ్చునని సూచించింది. ట్రైబ్యునల్-2 తమ తీర్పును 2010 డిసెంబరు 30న జారీ చేస్తూ, 40 ఏళ్ల తరవాతే పునఃపరిశీలన జరపాలని సూచించింది.మూడు రాష్ట్రాల్లో కొత్తగా నిర్మితమవుతున్న ప్రాజెక్టుల పనితీరును, తీర్పు అమలులో ఎదురయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకొని, పునర్విచారణను 25 ఏళ్ల అనంతరం, అంటే- 2035 మే 31 తరవాత చేయించాలని రాష్ట్రప్రభుత్వం సూచించాలి.
పైన వివరించిన సూచనలన్నింటినీ రాష్ట్రప్రభుత్వం ట్రైబ్యునల్ దృష్టికి తెచ్చి, తీర్పులో అవసరమైన మార్పులు చేయవలసిందిగా కోరాలి. ఈ ట్రైబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు జీవన్మరణ సమస్య. కాబట్టి ఇంతటి కీలక సమస్యపై ప్రభుత్వం తన అభిప్రాయాలు తెలియజేయడానికి రాష్ట్రంలోని వివిధ రైతు సంఘాలకు, ప్రభుత్వేతర రైతు సేవాసంస్థలకు అవకాశం కల్పించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి