20, ఫిబ్రవరి 2013, బుధవారం

అత్యంత సిగ్గుచేటు! జలియన్ వాలాబాగ్ ఘటనపై కామెరాన్ అమరులకు బ్రిటిష్ ప్రధాని నివాళి స్వర్ణ దేవాలయం సందర్శన

 
అమృతసర్, ఫిబ్రవరి 20: బ్రిటిష్ పాలనలో జలియన్‌వాలాబాగ్‌లో 1500మందికిపైగా భారతీయులను అత్యంత క్రూరంగా హతమార్చిన తొమ్మిదిన్నర దశా బ్దాల తర్వాత అదో 'అత్యంత సిగ్గుచేటు' సంఘటనగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అభివర్ణించారు. బుధ వారం ఆయన అక్కడ మోకాళ్లమీద వంగి, అమరులకు నివాళి అర్పించారు. రెండు చేతులు జోడించి నిమిషం పాటు మౌనం పాటించారు. "బ్రిటిష్ చరిత్రలోనే ఇది అత్యంత సిగ్గుపడాల్సిన చర్య. విన్‌స్టన్ చర్చిల్ దీన్ని చాలా క్రూరమైనదని అభివర్ణించడం సమంజసమే. ఇక్కడేం జరిగిందో మనమెన్నటికీ మర్చిపోకూడదు'' అని అక్కడి సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆయన ఆ ప్రాంతానికి రాగానే కొన్ని సంస్థలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అమరులకు పుష్పాంజలి ఘటించారు.

అమర్‌జ్యోతి వద్ద కొద్దిసేపు మౌనంగా నిల్చున్నారు. పార్కులో 25 నిమిషాలు గడిపారు. కామెరాన్ రాక సందర్భంగా మీడియాను దూరంగా ఉంచారు. ఫొటోగ్రాఫర్లను మాత్రం కొంత సమీపా నికి అనుమతించారు. అంతకుముందు కామెరాన్ స్వర్ణ దేవాలయంలో వస్త్రం సమర్పించారు. హర్‌మందిర్ సాహెబ్‌లో ఆయనకు మర్యాదపూర్వకంగా వస్త్రం అందించారు. ఆయనతోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్ బాదల్, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్ సింగ్ ఉన్నారు.

బ్రిటన్‌లో భారతీయ విద్యార్థుల పర్యటన
లండన్: ఒకవైపు బ్రిటిష్ ప్రధాని భారత్‌లో పర్యటిస్తుండగా ఇంగ్లండ్‌లో ఉన్నతవిద్యాభ్యాసం చేస్తున్న 30 మంది భారత విద్యార్థులు 10 డౌనింగ్ స్ట్రీట్‌ను సందర్శించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది 'జూబ్లీ స్కాలర్స్'ను ఇందుకు ఎంపికచేశారు. ఈ అనుభవం ఎంతో అద్భుతమని వారు ఈ సందర్భంగా హర్షం వ్యక్తంచేశారు.

ఇన్నాళ్లకు.. ఇన్నేళ్లకు..
అది 1919 ఏప్రిల్ 13వ తేదీ... పంజాబ్‌లో కొత్త సంవత్సరం "బైశాఖి'' ప్రారంభమైన రోజు. జలియన్‌వాలా బాగ్ మైదానంలో వేడుకలకు జనం పెద్దసంఖ్యలో చేరారు. అదే తమకు ఆఖరి రోజని, బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ తమ మరణశాసనం రాస్తాడని వారెవరికీ తెలియదు. హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. కకావికలైన సామాన్యులపై 150 మంది పోలీసులతో కర్కశంగా గుళ్ల వర్షం కురిపించి 1500 మందికిపైగా ప్రాణాలను బలిగొన్నాడు డయ్యర్. నిమిషాల్లో ఆ ప్రదేశాన్ని శ్మశానంగా మార్చేశాడు.

ఈ ఘోరంపై క్షమాపణ చెప్పాలన్న భారత్ డిమాండ్‌కు బ్రిటిష్ పాలకులు తలొగ్గలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక యాభై ఏళ్లకు (1997) రెండో ఎలిజబెత్ మహారాణి, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించినా పశ్చాత్తాపం ప్రకటించలేదు. ఇన్నాళ్లకు... ఇన్నేళ్లకు ప్రప్రథమంగా బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. 94 ఏళ్ల తర్వాత నాటి ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి