5, నవంబర్ 2012, సోమవారం

అమెరికా పీఠం ఎవరిది?



ప్రపంచానికే ఎన్నికలన్నంత జోరుగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరింది. రానున్న నాలుగేళ్లలో దేశానికి నాయకత్వాన్ని అందించాల్సిన నేత ఎవరో ప్రజలు తీర్పు చెప్పనున్నారు. ఏడాదిగా ఈ ఎన్నికల సమరంలో తలమునకలవుతున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థుల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. దేశంలోని 50 రాష్ట్రాలలో దాదాపు 40 రాష్ట్రాలు సంప్రదాయకంగా డెమోక్రాట్లకో, రిపబ్లికన్లకో మద్దతు తెలిపేవే. కాబట్టి పోటీ నిజంగా జరిగేది ఆ మిగతా రాష్ట్రాలలోనే. ఈసారి అలాంటి 11 రాష్ట్రాలు జయాపజయాలను తేల్చనున్నాయి.

అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బరాక్ ఒబామా స్వల్ప ఆధిక్యతను కనబరుస్తున్నట్టు దేశవ్యాప్త సర్వేల అంచనా. అయితే తాజా వార్తలనుబట్టి కీలకమైన ఒహాయో, ఫ్లోరిడాలలో 6వ తేదీకి ముందుగానే జరిగిన ఓటింగ్‌లో స్పష్టమైన ఆధిక్యం ఉన్నదని తేలింది. దీన్నిబట్టి మిగతా రాష్ట్రాల్లో 60 శాతం ఓట్లను గెలుచుకుంటే తప్ప రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ శ్వేత సౌధాన్ని గెలుచుకోలేరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పోటాపోటీ సమరంలో చివరి క్షణంలో ఏమైనా జరగవచ్చు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో... ఎవరు ఎన్నికైనాగానీ మెజారిటీ ఓట్ల కంటే తక్కువ ఓట్లతోనే విజయం సాధించే అవకాశం ఉంది.

ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు కలగలిసిన పద్ధతి
ప్రజలు నేరుగా ఓటు వేసి అధ్యక్షుణ్ణి ఎన్నుకునే పత్యక్ష పద్ధతికి తోడుగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అధ్యక్షుణ్ణి ఎన్నుకునే పరోక్ష పద్ధతి కూడా కలగలిసి ఉండటమే అమెరికా అధ్యక్ష ఎన్నికల విలక్షణత. 2000 సంవత్సరం లో జార్జి డబ్ల్యూ బుష్ తన డెమోక్రటిక్ ప్రత్యర్థి అల్‌గోరే కంటే 5,43,895 తక్కువ ఓట్లు సాధించి కూడా విజయం సాధించగలిగారు. అలా మెజారిటీ ఓట్లు సాధించకుండానే అధ్యక్షునిగా ఎన్నికయ్యే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడల్లా అమెరికా అధ్యక్ష ఎన్నికల పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతుండటం పరిపాటి. అదే ఇప్పడూ జరుగుతోంది. మరోవంక ప్రపంచానికే తలమానికంగా ఎంచే అక్కడి ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెడుతున్న నిరపేక్ష అధికారాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

ఒహాయో రాష్డంలో అధికారంలో ఉన్న రిపబ్లికన్లు ఆదివారం చిట్టచివరి నిమిషంలో... ఓటర్లు ప్రతి ఒక్కరూ నింపాల్సిన ‘ప్రొవిజనల్ బ్యాలెట్ అఫర్మేషన్’ పత్రంలోని తప్పులకు ఓటర్లే బాధ్యులని కొత్త నిబంధన ప్రవేశపెట్టారు. ఎన్నికల సిబ్బంది బాధ్యతను ఓటర్లపై పెట్టడంతో ఎలాంటి పొరపాటు జరిగినా ఆ ఓటు చెల్లదు. అలా ఈ సారి కొన్ని వేల ఓట్లు చెల్లకపోయే అవకాశం ఉంది. ఫలితంగా నిర్ణయాత్మకమైన ఆ రాష్ట్రం రిపబ్లికన్‌ల వశమయ్యే పరిస్థితి ఏర్పడిం దని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ నిబంధనల వల్ల ఒహాయోతోపాటూ ఫ్లోరిడాలో కూడా భారీగా ఓట్లు చెల్లకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. రిపబ్లికన్ గవర్నర్ల ఈ ఎన్నికల క్రీడ ఫలితంగా... ఓటింగ్‌లో పుంజుకుంటారని భావిస్తున్న ఒబామా ఓటమిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదిఏమైనా ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థపై పలు చర్చలను లేవనెత్తుతున్నాయి.

రెండు పార్టీల వ్యవస్థ కాదు కానీ...
అమెరికా ప్రజాస్వామ్యాన్ని రెండుపార్టీల వ్యవస్థగా పిలుస్తుంటారు. కానీ నిజానికి రాజ్యాంగం ప్రకారం రాజకీయపార్టీలు ఎన్నయినా ఉండొచ్చు. అధ్యక్ష పదవికి సైతం ఎందరైనా పోటీపడవచ్చు. ఒబామా, రోమ్నీల హోరులో మరో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులు పోటీలో ఉన్న సంగతి మరుగునపడిపోయింది.

లిబర్టేరియన్‌పార్టీ తరఫున గ్యారీ జాన్సన్, గ్రీన్ పార్టీ తరఫున జిల్ స్టీన్‌లు కూడా బరిలో ఉన్నారు. రాజ్యాంగంలోని రెండవ అధికరణాన్ని అనుసరించి ఆ దేశంలో పుట్టిన సహజ పౌరులంతా 35 ఏళ్ల వయసుంటే అధ్యక్షునిగా పోటీచేయడానికి అర్హులే. అయితే బ్రిటన్‌లోనో, స్పెయిన్‌లోనో జరిగినట్టుగా మూడోపార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఎన్నడూ జరగలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పద్ధతే ఆచరణలో రెండుపార్టీల వ్యవస్థ అవతరించడానికి కారణమైందనే విమర్శలో వాస్తవం లేకపోలేదు. ఆ పరిస్థితివల్లే 1920ల వరకు అస్తిత్వంలో ఉన్న చిన్న, ప్రాంతీయ పార్టీలలోఅత్యధికం ప్రధాన పక్షాలు రెంటిలో విలీనమైపోకతప్పలేదు.

పార్టీ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక... నిధుల సేకరణ
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రి య సుదీర్ఘంగా సాగుతుంది. ప్రతిఏటా నవంబర్ మొద ట్లో జరిగే అధ్యక్ష ఎన్నికల ప్రచారఘట్టానికి ముందు జరిగే ఈ కసరత్తు కూడా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలాగే భారీగా సాగుతుంది. నిజానికి పార్టీ అధ్యక్ష అభ్యర్థి కాగోరేవారు వారెవరైనా ముందుగానే అందుకు సిద్ధం కావాల్సి ఉం టుంది. అలాంటివారు ముందుగా ఫెడరల్ ఎన్నికల కమిషన్ (ఎఫ్‌ఈసీ) వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుం ది. అప్పటి నుంచి 5 వేల డాలర్లకు పైబడిన విరాళాలకు, ఖర్చులకు 15 రోజులకొకసారి ఎఫ్‌ఈసీకి చెప్పాల్సి ఉంటుంది. ప్రతిసారీ పెరిగిపోతున్న అభ్యర్థుల వ్యయాలను తట్టుకోవడానికి నిధుల సేకరణ కీలకంగా మారుతోంది. అభ్యర్థుల నిధుల సేకరణ సామర్థ్యం కూడా జయాపజయాలను ప్రభావితం చేసే అంశంగా మారింది.
ఈసారి రికార్డు స్థాయిలో ఇద్దరు అభ్యర్థులు 100 కోట్ల డాలర్ల మార్కును చేరారు. ఇంతవరకు తేలినదాన్నిబట్టి ఒబామా మొత్తం 93 కోట్ల నుంచి 108 కోట్ల డాలర్ల వరకూ, రోమ్నీ 88.1 నుంచి 113 కోట్ల డాలర్ల వరకు సేకరించారు. పార్టీలు తమ మద్దతుదార్ల జీతాల నుంచి, పార్టీ నుంచి నిధులను సేకరిస్తాయి. అయితే రాజకీయ కార్యాచరణ కమిటీలు, సూపర్ పీఏసీలు సమకూర్చే నిధులే కీల కం. పార్టీల మద్దతుదార్లు పీఏసీలను ఏర్పాటు చేసి నిధులను వసూలు చేస్తారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గత ఎన్నికల నుంచి సూపర్ పీఏసీలు ఏర్పడ్డాయి. ఇవి నేరుగా అభ్యర్థులకు లేదా పార్టీలకు నిధులను ఇవ్వడానికి వీల్లేదు. తమకు నచ్చిన అభ్యర్థి తరపున అవే స్వయంగా ప్రచారాన్ని సాగించాల్సి ఉంటుంది. వ్యయాలపై గరిష్ట పరిమితులు అంటూలేవు. పీఏసీలు ఏవైనా ఆచరణలో కార్పొరేటు సంస్థలుగానే మిగిలాయి. అధ్యక్ష ఎన్నికలు బహు ఖరీదైనవిగా మారేక్రమంలో అభ్యర్థిత్వానికి పోటీపడేవారు కూడా దేశవ్యాప్తంగా నిధుల సేకరణ కోసం సుడి గాలిలా పర్యటనలు సాగించాల్సివస్తోంది. ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు ప్రారంభం కావాల్సిన క్యాంపయిన్ ఇంకా చాలా ముందుగానే మొదలవుతోంది.

పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం
అధ్యక్ష అభ్యర్థిత్వ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగడంపై విమర్శలున్నా అదే, అభ్యర్థుల ఎంపికలో అత్యంత ప్రజాస్వామిక పద్ధతి అనే అభిప్రాయం కూడా ఉంది. అక్కడి ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఎన్నికల నిబంధనల్లో తేడాలున్నట్టే పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలోనూ తేడాలు ఉంటాయి. అభ్యర్థిత్వం కోసం పోటీపడేవారు ముందుగా ప్రైమరీలలో గెలుపొందాల్సి ఉంటుంది. ప్రైమరీ అంటే ఒక నియోజకవర్గమని చెప్పుకోవచ్చు. అందులోని ఓటర్లు అందరూ అభ్యర్థి ఎంపికలో పాల్గొనే అవకాశమున్నది. కొన్ని రాష్ట్రాలలో ప్రైమరీ ఎన్నికలతోపా టూ, కాకస్ (కూటమి)ల ఎంపిక కూడా ఉంది. కాకస్ అంటే ప్రైమరీలోని రిజిస్టర్డ్ పార్టీ ఓటర్లు అభ్యర్థిని ఎన్నుకోవడం. ఈ ప్రైమరీలు, కాకస్‌లలోనే అభ్యర్థులను ఖరా రు చేసే పార్టీ సదస్సులకు ప్రతినిధులుగా ఎన్నికవుతారు. ఆ తర్వాత జరిగే పార్టీ సదస్సు లాంఛనప్రాయమే. వివిధ రాష్ట్రాల ప్రైమరీల ఎన్నికలలో ఎన్నికైన ప్రతినిధుల సంఖ్య ను బట్టి ముందే అభ్యర్థిత్వం ఖరారవుతుంది.

ఓటింగ్
ఓటర్లు అధ్యక్షునికి ఓటేస్తారు-ఎలక్టొరల్ కాలేజీని ఎన్నుకుంటారు. నవంబర్ 6న ఎన్నికలు ముగిసేసరికే ఎన్నికల సరళిని బట్టి ఫలితం తేలిపోతుంది. ఆ రాత్రికే ఫలితాలు తెలిసిపోతాయి. విడివిడిగా ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్లు ఓటు చేసేది అధ్యక్ష అభ్యర్థికే. కానీ వాళ్లు అధ్యక్షుడిని ఎన్నుకోరు. అధ్యక్షుణ్ణి ఎన్నుకునే ఎలొక్టరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఓటర్లు తమకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌లో ఉన్న ఒక్కోపార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులిద్దరి జంటకు ఓటు వేస్తారు. అధ్యక్షునికి ఓటేయడమంటే ఉపాధ్యక్షునికి కూడా ఓటు వేయడమనే అర్థం. ఈ నెల 17న జరిగే అధ్యక్ష ఎలక్టొరల్ కాలేజీ సమావేశం అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకుంటుంది. అయితే 6న జరిగే బ్యాలెట్ ఫలితాలను బట్టే మొత్తం 538 ఎలక్టొరల్ ఓట్లలో 270 ఓట్లను సాధించినవారు అధ్యక్షుడని తేలిపోతుంది.

ఎలక్టొరల్ కాలేజీ-‘గెలిచిన వారికే అన్నీ’
ప్రతి రాష్ట్రంనుంచి సెనేట్, ప్రతినిధుల సభ సభ్యులతో సమానంగా ఆ రాష్ట్రం నుంచి ఎలక్టొరల్ సభ్యులు ఉం టారు. అన్నిరాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు కూడా అధ్యక్ష ఎన్నికల్లో స్థానం లేకుండాపోయే పరిస్థితిని నివారించడానికి ఫెడరల్ వ్యవస్థ ప్రయత్నించింది. ప్రతి రాష్ట్రానికి నిర్ణీత సంఖ్యలో ఎలక్టొరల్ కాలేజీ సభ్యులను నిర్ణయిం చారు. పెద్దరాష్ట్రం కాలిఫోర్నియాకు 55 ఓట్లుండగా, 5.68 లక్షల జనాభా ఉన్న వ్యోమింగ్‌కు 3 ఓట్లు ఉన్నాయి. ఇలా మొత్తం 50 రాష్ట్రాలు, కొలంబియా జిల్లాలకు కలిపి ఉన్నవి 538 ఎలక్టొరల్ ఓట్లు. అయితే రాష్ట్రంలో ఏ అభ్యర్థికి సాధారణ మెజారిటీ లభిస్తే ఆ పార్టీ అభ్యర్థికే అక్కడి మొత్తం ఎలక్టొరల్ ఓట్లు లభించే పద్ధతి 48 రాష్ట్రాల్లో అమల్లో ఉంది.

కీలకమైన ఒహాయోలో 18 ఓట్లున్నాయి. అక్కడ రోమ్నీకి ఒక్క ఓటు అధికంగా వచ్చినా మొత్తం 18 ఓట్లు ఆయనకే దక్కుతాయి. అందుకే అది నిర్ణయాత్మకమైనదిగా మారింది. ‘గెలిచినవారికి అన్నీ’ అనే ఈ పద్ధతిలో గత ఎన్నికల్లో ఒబామా 28 రాష్ట్రాలలో విడివిడిగా గెలిచి ఆ రాష్ట్రాలలోని మొత్తం 365 ఓట్లను గెలుచుకోగా, జాన్‌మెక్ కెయిన్‌కు ఒక్క ఓటు కూడారాలేదు! అందుకే ఈ పద్ధతిపై విమర్శలు చెలరేగుతున్నాయి. నిజానికి ఎలక్టొరల్ కాలేజీ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అభ్యర్థికే ఓటు చేయాలని ఫెడరల్ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ సగానికిపైగా రాష్ట్రాలు ఆ స్వేచ్ఛను నిషేధించాయి. ఎలక్టొరల్ కాలేజీకి ఆ స్వేచ్ఛ ఉన్న రాష్ట్రాల నుంచి కూడా క్రాస్ ఓటింగ్ అరుదుగానే జరిగింది... అదీ ఎన్నడో... గతంలో! ఎన్ని విమర్శలున్నా ఎన్నికల పద్ధతి మౌలిక స్వభావాన్ని మార్చే ఏ ప్రయత్నమైనా రాజ్యాంగం మౌలిక స్వభావాన్ని మార్చే ప్రమాదం ఉండొచ్చు. అమెరికా రెండు పార్టీల ప్రజాస్వామ్యంగా వర్ధిల్లడం అనివార్యం కావొచ్చు.
(వాషింగ్టన్ నుంచి...)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి