4, నవంబర్ 2012, ఆదివారం

వైభవంగా బొత్స కుమార్తె పెళ్లి

బొత్స కుమార్తె పెళ్లికి అధికార దుర్వినియోగం

హైదరాబాద్, నవంబర్ 3: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుమార్తె వివాహానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకుల కుటుంబ విషయాలు, వ్యక్తిగత వ్యవహారాలపై మాట్లాడకూడదని కానీ బొత్స కుటుంబంలో పెళ్లి వల్ల ప్రజలు పడ్డ బాధలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా విమర్శిస్తున్నట్టు తెలిపారు. వివాహానికి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం యావత్తు సొంత మనుషుల్లా పని చేశారని విమర్శించారు. పదిహేను రోజుల ముందు నుంచే రవాణాశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు బొత్స కుమార్తె వివాహ వేడుక బాధ్యతలో మునిగిపోయారని అన్నారు. నీలం తుఫాను కారణంగా రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వేలాది ఇళ్లు ముంపునకు గురయ్యాయి, వారిని ఏ అధికారి ఇంత వరకు పరామర్శించలేదని అన్నారు. కానీ కొద్ది రోజుల క్రితమే ఆర్‌టిఏ అధికారులు వాహనాలను పట్టుకొని డాక్యుమెంట్లు సీజ్ చేశారని, దాదాపు ఐదువందల వాహనాలను బలవంతంగా రప్పించి, అతిధుల కోసం వాడుకున్నారని ఆరోపించారు. విశాఖపట్నం, విజయనగరం, జిల్లా ప్రధాన రహదారిని మూసివేసి ఆర్టీసి బస్సులను భోగాపురం మీదుగా మళ్లించారని విమర్శించారు. ఆరు కిలో మీటర్ల అదనపు ప్రయాణానికి అధిక చార్జీలు వసూలు చేయడంతో భోగాపురం వద్ద ప్రయాణీకులు ధర్నా చేశారని తెలిపారు. నీళ్లు లేక రైతులు గగ్గోలు పెడుతుంటే బొత్స ఏకంగా 20 బోర్లను తవ్వించారని , రైతులకు రెండు గంటలు కూడా విద్యుత్ ఇవ్వకుండా పెళ్లికి మాత్రం పదిహేను రోజులుగా ప్రత్యేక విద్యుత్ లైన్లను తీసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. మూడు జిల్లాల విద్యుత్ మొత్తాన్ని పెళ్లికి ఉపయోగించడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పెళ్లికి 700 మంది పోలీసులను ఉపయోగించారని విమర్శించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి