22, ఏప్రిల్ 2014, మంగళవారం

ఆత్మను పీడిస్తున్న టైటానియం......


21:20 - April 3, 2014
      ఆత్మ తడవదు.. కాలదు... చావులేదు.. గీతలో చెప్పిందేదైనా... ఇప్పుడు వై ఎస్ ఆత్మకు గడ్డుకాలం వచ్చిందా? ఆత్మను దెయ్యాలు వెంటాడుతున్నాయా? కోర్టులు కేసుల్లో ఇరుక్కోబోతున్నారా? రాజశేఖరుడి కాలంలో ఒంటి చేత్తో చక్రం తిప్పిన కెవీపికి ఇప్పుడు కొత్త కష్టం పుట్టుకొచ్చింది.. ముడుపులు తీసుకున్నారంటూ అమెరికా ప్రభుత్వం కేసులు పెట్టింది. టైటానియమ్ మైనింగ్ అనుమతిలో అక్రమాలు జరిపి మనీ లాండరింగ్‌కు పాల్పడటం, విదేశీ వ్యాపారులతో చేతులు కలిపి కుట్ర, కుంభకోణానికి పాల్పడటం వంటి అభియోగాలు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల కిందటి విషయం ఇప్పుడు బయటికొచ్చింది.
వైఎస్ దైహమైతే, కెవీపీ ఆత్మగా ప్రచారంలోకి ….
        
వైఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ వై ఎస్ దైహమైతే, కెవీపీ ఆత్మగా ప్రచారంలోకి వచ్చారు. కానీ, అనూహ్యంగా వై ఎస్ చనిపోవటంతో చీకటి వ్యూహాల మార్గంలోంచి కొంతకాలానికి బయటికొచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల రంగంలోకి దిగారు. వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్ కు దూరమైనా కెవీపీ మాత్రం హై కమాండ్ కనుసన్నల్లోనే కొనసాగుతున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలయినా, జగన్ ని కాపాడేందుకు దొడ్డి దోవన ఎన్ని ప్రయత్నాలు చేసినా, పైకి మాత్రం కెవీపీ మౌన ప్రేక్షకుడిలానే దర్శనమిచ్చారు. ఆ తర్వాత కాలంలో అనేక మలుపుల తర్వాత కూడా ఆయన ఏ మాత్రం చెదరలేదు.. బెదర లేదు..
కోటగిరి వెంకట ప్రభాకర రామచంద్రరావు....(కేవీపీ)
        
ఇలా చెబితే గుర్తుపట్టడం కష్టం. కానీ, కెవీపీ అంటే మాత్రం పాలిటిక్స్ పై కనీస అవగాహన ఉన్న ఏ ఒక్కరికైనా, ఇట్టే అర్థమైపోతుంది. ఆ వ్యక్తి ఎవరో ఎంతటి శక్తిమంతుడో ఎవరికైనా సులువుగా తెలిసిపోతుంది. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా వైఎస్ సీఎం అయినప్పటికీ, అన్నీ తానై అధికారం చెలాయించారు. కెవీపీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే నాడు పాలనంటే కెవీపీ... కెవీపీ అంటే పాలన. ఎన్నో అక్రమాలకు పాల్పడి జగన్ తప్పు చేశారని, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారని నిరూపించే ప్రయత్నం చేసిన సీబీఐ... కెవీపీపై దృష్టి పెట్టలేదు. వై ఎస్ పాలనలో అన్నీ తానై వ్యవహరించిన కెవీపీని సీబీఐ ఎందుకు ఉపేక్షిస్తుందనే ఆరోపణలెన్నో వెల్లువెత్తాయి. వై ఎస్ ఛరిష్మాతో చెలరేగుతున్న జగన్ విషయంలో దూకుడుగా వెళ్లిన సీబీఐ...కెవీపీ పై చర్యల గురించి మాత్రం ఆచితూచి వ్యవహరించింది. కేవలం ప్రశ్నించి వదిలేసింది..
సీబీఐ ప్రశ్నించి వదిలేసింది.....
       
జగన్ విషయంలో చాలా దూకుడుగా కనిపించిన సీబీఐ కెవీపీని కేవలం ప్రశ్నించి వదిలేసింది. వాస్తవానికి వై ఎస్ కాలంలో ఆయనకి రిసెప్షన్ కౌంటర్ లా ఉన్న కెవీపీ ప్రమేయం లేకుండా ఏ పనీ జరగలేదంటారు. అంటే జరిగిన మంచి, చెడులో భాగం ఉన్నప్పటికీ ఆ తర్వాత దాని ప్రభావం పడకుండా మేనేజ్ చేసుకోగలిగారు. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి జగన్ వైపు కెవీపీ వెళ్లకుండా ఉండాలంటే ఆ మాత్రం వెసులుబాటు ఇవ్వటం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావించిందా? లేదా స్వయంగా ఆయన దగ్గరే ఏదన్నా బలమైన అస్త్రం ఉందా? ఢిల్లీ ఫండ్స్ పంపే పనిలో ఈయనది కీలకపాత్రా? ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి...
కెవీపీ మెడకు టైటానియం ఉచ్చు....
       
దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో అన్నీ తానై చక్రం తిప్పిన కెవిపి రామచంద్రరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? టైటానియం ఖనిజం తవ్వుకునేందుకు అనుమతి కోసం పెద్ద మొత్తంలో లంచం అడిగారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 111 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాజ్యసభ సభ్యుడు కెవీపీతో సహా ఆరుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా జరిగిన అవినీతి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. వైయస్ హయాంలో జరిగిన ముడుపుల బాగోతాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్ బీఐ ఛేదించింది. ఆంధ్రప్రదేశ్ లో టైటానియం ఖనిజాన్ని తవ్వుకునేందుకు అనుమతి కోసం జరిగిన ముడుపుల కుంభకోణాన్ని ఎఫ్ బిఐ బయటపెట్టింది.
కెవిపితో సహా ఆరుగురి పై అభియోగాలు...
        
ఉక్రెయిన్ కు చెందిన ప్రముఖ వ్యాపారి ఫిర్టాష్ భారతీయ ప్రముఖులకు 111 కోట్ల ముడుపులు ముట్టజెప్పారు. ఇందుకు సంబంధించి కెవిపితో సహా హంగేరి వ్యాపారవేత్త అండ్రాస్ నోవ్, ఉక్రెయిన్ కు చెందిన సురేన్ జెవోర్జియాన్, అమెరికాలో స్థిరపడ్డ భారతీయుడు గజేంద్రపాల్, శ్రీలంకకు పెరియాస్వామి సుందరలింగంపై అమెరికా ప్రభుత్వం అభియోగాల్ని నమోదు చేసింది. వీరంతా అక్రమ వ్యాపారానికి కుట్ర పన్నడం, నల్లధనం చెలామణీ చేయడం, అక్రమ వ్యాపారానికి సహకరించేందుకు దేశాల మధ్య ప్రయాణించడం అనే నేరాలకు పాల్పడ్డట్టు న్యాయస్థానం నిర్ధారించింది. అవినీతికి పాల్పడినందుకు ఈ ఆరుగురి నుంచి 64 కోట్లు వసూలూ చేయాలని అభియోగపత్రంలో ప్రతిపాదించారు.
వైఎస్ హయాంలో జరిగిన ఒప్పందం....
       
2006లో వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఒప్పందం ఇది. అపుడు కెవిపి రామచంద్రరావు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని టైటానియం ఉత్పత్తులకు అవసరమైన గనులు సొంతం చేసుకునేందుకు అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఆశించింది. ఇందులో భాగంగా ఈ ఖనిజాన్ని వెలికి తీసే పనిని ఉక్రెయిన్ కు చెందిన డిఎఫ్ సంస్థకు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ లో టైటానియం గనుల ద్వారా షికాగోకు చెందిన ఓ కంపెనీ ఏటా 3 వేల కోట్లు ఆర్జిస్తుందని అంచనా- ప్రస్తుతం ఈ కంపెనీని ఎ గా పిలుస్తున్నారు. గనులు దక్కాలంటే రాష్ట్ర, కేంద్ర స్థాయిలో అనేక అనుమతులు తప్పనిసరి. అనుమతులు సంపాదిస్తే కనకవర్షం కురిసే అవకాశముండటంతో... కోట్లాది రూపాయల ముడుపులు వెదజల్లటానికి సిద్ధమయ్యారు. కెవీపీతో సహా ఆరుగురు కలిసి గనుల అనుమతుల కోసం భారత్ లోని అధికారులకు ప్రజాప్రతినిధులకు ముడుపులు ముట్టజెప్పడానికి అమెరికా ఆర్థిక సంస్థలను అంతర్జాతీయ నగదు లావాదేవీలకు వాడుకున్నట్టు అభియోగపత్రం పేర్కొంది. 2006 ఏప్రిల్‌లో ఈ దందా మొదలైంది. లంచాల సొమ్మును భారత్‌లోని సంబంధిత అధికారుల ఖాతాల్లోకి చేర్చేందుకు కేవీపీ, హంగేరీ వ్యాపారవేత్త ఆండ్రస్ నాప్, ఉక్రెయిన్ కు చెందిన సురెన్ జెవొర్గ్యాన్, మరో భారతీయుడు గజేంద్రలాల్, శ్రీలంకకు చెందిన పెరియార్ సుందరలింగం కలసి అమెరికాలోని ఆర్థిక సంస్థలను ఉపయోగించుకున్నారు.
డీఎఫ్ కంపెనీల లావాదేవీల రూపంలో భారత్ కు..
         
డీఎఫ్ కంపెనీల లావాదేవీల రూపంలో ఈ సొమ్మును భారత్ కు చేరవేశారు. వారి అక్రమ వ్యాపార కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకు బెదిరింపులకు కూడా వీరు వెనకాడలేదని అభియోగపత్రం తేల్చింది. గనుల అనుమతి కోసం 111 కోట్ల రూపాయల ముడుపులను కేంద్ర, రాష్ట్ర అధికారులతో పాటు ముఖ్యులకు ముట్టజెప్పాలని ఫిర్టాష్ తన సహాయకుడికి నిర్దేశించారని అభియోగాలు పేర్కొంటున్నాయి. ఎవరెవరికి ఎంత ముడుపులు చెల్లించాలో ఖరారు చేసేందుకు సుందరలింగం కేవీపీ సమావేశమయ్యేవారు. తనకు ఎంత కావాలో ఈ సమావేశంలో ఆయన స్పష్టం చేసినట్టు అభియోగపత్రంలో తెలిపింది. కేవీపికి చెల్లించాల్సిన ముడుపులను విదేశాల్లోని ఏ ఏ బ్యాంకు ఖాతాల్లో వేయాలో సుందరలింగమే చూసేవాడు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరిపే ప్రమాదం ఉందని అనుమతుల కోసం వచ్చిన వారిని కేవిపి బెదిరించేవాడని అభియోగాల్లో పేర్కొన్నారు.
57 ఆర్థిక లావాదేవీలు
       
మొత్తంమీద... 2006 ఏప్రిల్ 28 నుంచి 2010 జూలై 13 మధ్య... వివిధ వ్యక్తులు, సంస్థల పేరిట 57 ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అభియోగపత్రం వెల్లడించింది. సుమారు 64 కోట్లు బదిలీ అయ్యాయి. వీటిలో కొన్ని గ్రూప్-డీఎఫ్ కంపెనీ ద్వారానే జరిగాయి. గ్రూప్ -డీఎఫ్ లిమిటెడ్‌లో ఫిర్తాష్‌కు చెందిన వాటాలను, ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని అభియోగ పత్రాల్లో స్పష్టం చేశారు. బదిలీ అయిన 64 కోట్ల రూపాయలను కెవీపీతో సహా ఆరుగురు నుంచి వసూలు చేయాలని అభియోగపత్రం పేర్కొంది.
ఇక్కడ మేనేజ్ చేశారు.. మరి అక్కడో...
         
అమెరికా ప్రభుత్వం.. ఆత్మ, అంతరాత్మల హయాంలో జరిగిందంటూ టైటానియం స్కామును బయటపెట్టింది. టైటానియం అనేది ఒక ఖనిజం. ఉప్పునీటిని, నైట్రో-హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ను, క్లోరిన్‌ను తట్టుకుని నిలబడగలిగిన శక్తి ఈ టైటానియానికి ఉంది. దీంతో దీనికి పారిశ్రామికంగా చాలా ప్రాధాన్యత ఉంది. స్టీల్‌, పెయింట్స్‌, విమానాలు సహా ఎన్నో ఇండస్ర్టీల్లో దీనిని వినియోగిస్తారు. అందుకే ఇక్కడి టైటానియంపై కన్నేసిన విదేశీ కంపెనీలు ఇక్కడి నేతలు అధికారులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినట్టు ముడుపులు ముట్టజెప్పినట్టు ఇప్పుడు అభియోగాలొచ్చాయి.. ఈ అక్రమ వ్యాపారం అమలుకు తమ దేశ భూభాగాన్ని, తమ దేశంలోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నారంటూ అమెరికాలోని కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీన్ని అంతర్జాతీయ కుంభకోణంగా, ద్రవ్య అక్రమ చలామణీగా అభివర్ణించింది. గత ఏడాది జూన్ 13వ తేదీన ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ సీల్ చేసిన ఈ కేసు వివరాలను బుధవారం వెల్లడించింది. ఈ అంతర్జాతీయ ముఠా నుంచి కెవిపి తనకోసం, తన తరఫు వారి కోసం ముడుపులు ఆశించారంటూ ఆయనపై ఐదు అబియోగాలు మోపింది.
తెరచాటు నాయకుడు....
        
కేవిపి రామచంద్రరావు. రాజశేఖర్ రెడ్డి జమానాలో తెరచాటు నాయకుడు. ఆంతరంగిక సలహాదారుడు. గుళ్లో దేవుడి అనుగ్రహం పొందాలి అంటే ముందు పూజారి అనుగ్రహం ఉండాలి అన్నట్టు ముఖ్యమంత్రి కోసం ఎవరు ఆఫీసుకు వెళ్ళినా ముందు కేవిపిని కలిసి ఒక అండర్‌స్టాండింగ్‌కు వస్తేనే రాజా వారి దర్శనం అయ్యేదట. ప్రజలెన్నుకోకపోయినా, ముఖ్యమంత్రితో సమానంగా అధికారం చెలాయించిన కెవీపీ, యంత్రాంగం అంతా ఆయన గుప్పిట్లో ఉంచుకొని మంత్రాంగం నడిపారు. చీఫ్ సెక్రెటరీ, డిజీపి మొదలు సెక్రటేరియట్ అంతా ఆయన కనుసన్నల్లోనే మెలిగింది. అంతెందుకు ప్రత్యక్ష ఎన్నికలో నిలబడి గెలవకపోయినా, రాజ్యసభ లోకి కూడా అడుగు పెట్టారు.కెవీపీకి తెలియకుండా వైయస్ కూడ ఏ పని చేసే వారు కాదనే వాదనలున్నాయి..... కానీ, ఎన్ని ఆరోపణలొచ్చినా, అవినీతి జరిగిందనే వాదనలున్నా కెవిపిని ఏ మాత్రం టచ్ చేయలేకపోయారు. దీనికి కారణాలు ఇప్పటికీ ఆశ్చర్యకరమే. అధిష్టానానికి కెవీపీ నుండి అంత గట్టి ప్రయోజనాలున్నాయనుకోవాలా లేక జగన్ బలం తగ్గించే ప్రయత్నమా అనే వాదనలున్నాయి.. ఇప్పుడా ఆత్మతో సాన్నిహిత్యమే మెడకు చుట్టుకోబోతోందా? గతంలో చేసిన ఘన కార్యాలే ఇప్పుడు దోషిని చేయబోతున్నాయా? కోర్టు కేసుగా, వెంటాడబోతోందా? అమెరికా వదలేది లేదంటోంది? ముడుపులు వసూలు చేయాల్సిందే అంటోంది. ఏం జరగనుంది? కెవిపి నుంచి అమెరికా సొమ్ము వసూలు చేయటమంటూ జరిగితే అది మామూలు ప్రకంపనాలు సృష్టించదు. దాని ప్రభావం ఒక్క కెవీపీ పైనే కాదు.. నాటి మహానేతపైనా, కాంగ్రెస్ పార్టీపైనా ఉండే అవకాశాలున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి