స్పెషల్ స్టోరీస్
'పరివార'మే పరేకర్ బలం!
నేపథ్యాన్ని మాత్రం విస్మరించరు.
పల్లకీ ఎక్కగానే బోయీల బాధల్ని మరిచే వారెందరో వుంటారు. పల్లకీలో ప్రయాణం ప్రారంభం కాగానే తన భారాన్నంతా బోయీల భుజస్కందాలపైకి చేర్చామన్న ఆలోచనను అనువుగా విస్మరిస్తారు. కాని మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పరేకర్ అలాంటి వ్యక్తి కాదు. రాజకీయాలు తన వృత్తి కాదని అంటారాయన. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో సంఘ్ చాలక్ స్థాయి నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. గోవా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా... ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన మనోహర్ గోపాలకృష్ణ పరేకర్ తన నేపథ్యాన్ని మాత్రం విస్మరించరు. మనోహర్ పరేకర్‌గా అందరికీ తెలిసిన కేంద్ర రక్షణ మంత్రి ప్రవృత్తిపరంగా మానవతావాదిగా పేరు తెచ్చుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వ్యక్తిగత పరిచయాలున్నా ఆయన కేంద్రంలో మంత్రిపదవికోసం పైరవీలు చేయలేదు. మనోహర్ పరేకర్ సమర్థతను నిబద్ధతను గుర్తించి కేంద్రమంత్రివర్గంలోకి నరేంద్ర మోడీ ఆహ్వానించగానే ఆయనేమో ఉరుకులు పరుగులతో ఢిల్లీకి చేరలేదు. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పక్కనపెట్టి కేంద్ర మంత్రివర్గంలో చేరలేనని మనోహర్ పరేకర్ ప్రధానికి చెప్పగలిగారు. గోవా రాష్ట్రానికి మరో సమర్థుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తానని ప్రధాని వాగ్దానం చేసిన తర్వాతే పరేకర్ కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్ పరేకర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో సాధారణ సభ్యునిగా ప్రవేశించి కొంతకాలం తర్వాత ముఖ్యశిక్షక్‌గా ఎదిగారు. అప్పటికీ ఆయన స్కూల్ ఫైనల్ విద్యార్థిమాత్రమే. ఒకవైపు సంఘ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే చదువుల్లో కూడా తాను సమర్థుడిగా నిరూపించుకున్నారు. ముంబాయి ఐఐటి నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో 1978లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గోవాలోని మపూసా గ్రామానికి చెందిన మనోహర్ పరేకర్ సార్వస్వత బ్రాహ్మణ కుటుంబంలో 13 డిసెంబర్ 1955లో జన్మించారు. ఈ కుటుంబంలోని పూర్వీకులు గోవాకు సమీపంలోని పర్రా గ్రామ నివాసులు. అందుకే ఈ కుటుంబంలోని వారందరినీ పరేకర్‌గా వ్యవహరిస్తారు.
ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన తర్వాత మనోహర్ పరేకర్ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. చిన్నపాటి వ్యాపారం చేస్తూనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో పూర్తికాలం పనిచేస్తూ వచ్చారు. ముఖ్య శిక్షక్ స్థాయి నుంచి సంఘ్ చాలక్‌గా ఎదిగారు. అప్పటికీ ఆయన వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే. రామజన్మభూమి ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించి భారతీయ జనతాపార్టీ అధినాయకుల దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు బిజెపి అధినాయకత్వం ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి మనోహర్ పరేకర్‌ను ఎంపికచేసి బాధ్యతలను అప్పగించాయి. క్రమశిక్షణ, పురోగతి, లింగభేదం లేని సమాజం, చట్టానికి అతీతంగా వ్యవహరించకపోవడం జాతీయత సామాజిక స్పృహ అనేవి తన నినాదాలని మనోహర్ పరేకర్ తరచూ పేర్కొంటారు. 1994 లో తొలిసారి భారతీయ జనతాపార్టీ నుంచి గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999 జూన్ నుంచి నవంబర్ వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2000 అక్టోబర్ 24న మనోహర్ పరేకర్ గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం సజావుగా సాగలేదు. ఒకసంవత్సరం నాలుగు నెలలు మాత్రమే సి.ఎం.గా పదవిలో కొనసాగి 27 ఫిబ్రవరి 2002లో రాజీనామా చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా రెండున్నర నెలల తర్వాత 5 జూన్ 2002లో తిరిగి గోవా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత మనోహర్ పరేకర్ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వంగా మారింది. ఆయన ప్రభుత్వంలోని నలుగురు బిజెపి శాసనసభ్యుల రాజీనామాతో మైనారిటీకి పడిపోయింది. రాజకీయ సమీకరణలు తారుమారయ్యాయి. 2007లో జరిగిన ఎన్నికల్లో పరేకర్ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ వోటమి పాలైంది. దిగంబర్ కామత్ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గోవాలో అధికారంలోకి వచ్చింది. కాని ఆ తర్వాత మార్చి 2012లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ మిత్రపక్షాల కూటమి గోవా శాసనసభలోని 33 సీట్లలో 24 స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వ్చచింది. అదే జోరు అదే తీరు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం కొనసాగింది. గోవాలోని రెండు పార్లమెంటు స్థానాల్లోనూ భారతీయ జనతాపార్టీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఈ విజయంలో మనోహర్ పరేకర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలకపాత్ర పోషించారు. ఆయన సమర్ధత 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది.
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా...
మనోహర్ పరేకర్ పాలనా దక్షుడిగానే కాకుండా ప్రజల మౌలిక అవసరాలను గుర్తించగల వ్యక్తిగా పేరు సంపాదించారు. గోవాలో విలువ ఆధారిత పన్ను 20 శాతంగా వసూలు చేసేవారు. వ్యాట్ వల్ల ఎన్నో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం గమనించి గత సంవత్సరం ఏప్రిల్ 2న వ్యాట్ శాతాన్ని 20 నుంచి 0.1 కి కుదించారు. దీనితో ధరలు ఒక్కసారిగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నిత్యావసర వస్తువు ధర రూ.11 లు నుంచి 20 వరకూ తగ్గింది. పన్నులు పెంచి ప్రజల కడుపుమాడ్చే విధానాలకు పాలకులు బాధ్యులు కారాదని మనోహర్ పరేకర్ మంత్రివర్గ సమావేశంలో ఒకసారి అన్నారు. అవినీతిని సహించని ముఖ్యమంత్రిగా పరేకర్‌కు పేరొచ్చింది. గనుల శాఖలో జరిగిన తీవ్ర ఆర్థిక అవకతవకలకు కారణమైన మైనింగ్ శాఖ సంచాలకుడు అరవింద్ లోల యేకర్‌ను వెంటనే సస్పెండ్ చేసి సంచలనం సృష్టించారు. 144 మంది మైనింగ్ వ్యాపారుల లైసెన్సులను రద్దు చేశారు. గోవా రాష్ట్రంలోని జూదగృహాలు రాష్ట్ర రెవెన్యూ రాబడిలో కీలకమైనవి. వీటిని కాసినోస్ అంటారు. జూదగృహాల్లోకి ప్రవేశ రుసుమును ఏర్పాటు చేశారు. సామాన్యుడిని అనారోగ్యానికి గురిచేసే మద్యం సిగరెట్లు లాంటి వస్తువుల ధరలను పెంచి వాటి వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం పరేకర్ చేశారు. వ్యాట్‌ను తగ్గించడం వల్ల తగ్గిన రెవెన్యూ రాబడి 145 కోట్లను మద్యం, సిగరెట్ల ధరలు పెంచి రెవిన్యూ రాబడిని సమతుల్యం చేశారు. వ్యాట్‌ను తగ్గించడంతో పెట్రోలు ధరలు సైతం బాగా తగ్గాయి. అవినీతి మైనింగ్ వ్యాపారుల లైసెన్సుల రద్దువల్ల 200 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.
సాధారణ రాజకీయ నాయకుల్లో కనిపించే మభ్యపెట్టేతీరు ఆయన మాటల్లో కనిపించదు. తానేం చేసినా ప్రణాళికా బద్ధంగానే చేస్తానని, ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే తన ధ్యేయమంటూ ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాటలకు ఈ క్రింది ఉదంతమే నిదర్శనం. గోవా రాష్ట్రంలో జూదగృహాలను మూయించేందుకు ఆమ్ ఔరత్ ఆద్మీ ఎగెనెస్ట్ గ్యాంబ్లింగ్ అనే సంస్థ ఉద్యమించింది. ఉద్యమ నాయకురాలు సబీనా మార్టిన్స్‌ని చర్చలకు పిలిపించి అమ్మా? ఈ జూద గృహాల్లో ప్రవేశ రుసుము సామాన్యులకు అందుబాటులో ఉండదు కనుక, ఇక్కడి జూదం మీ ఉద్యమ పరిధిలోకి రావనే అనుకుంటున్నాను. పైగా, వాటివల్ల రాష్ట్ర రాబడి పది కోట్లు పెరుగుతుందంటూ ఆమెకు నచ్చజెప్పారు.
కాగా గోవా రాష్ట్రేతర వ్యక్తులకు మాత్రమే జూదగృహాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. గోవా రాష్ట్ర భూమిపుత్రుల అవసరాలే తనకు ముఖ్యమని పరేకర్ అన్నారు.
మనోహర్ పరేకర్ తీవ్రమైన హిందూత్వ భావన గల వారే అయినా గోవాలోని క్యాథలిక్స్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.
భద్రత కోరని ముఖ్యమంత్రి: ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినే అయినా నేను సామాన్యుడినేనని పరేకర్ అనేవారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తనకు ఉన్న భద్రతను తొలగించారు. ఆయన తన కారులో ఏ రక్షణ లేకుండా రాష్ట్రంలో తిరిగేవారు. నేనెవరికీ అన్యాయం చేయలేదు. ఏ తప్పూ చేయలేదు... చేయను కూడా! అలాంటప్పుడు రక్షణ ఎందుకన్నది ఆయన ప్రశ్న! పరేకర్ తన ఆఫీస్ ఛాంబర్‌లోని లైట్లు ఫ్యాన్లు వేసుకోవడం తిరిగి వెళ్లేటప్పుడు వాటిని ఆర్పేయడం తానే చేసేవారు. నాపని నేను చేసుకొంటాను. నా అవసరాలకు మరో సహాయకునితో పనిచేయించుకోవడం ఇష్టం ఉండదని ఆయన చెప్పేవారు. ముఖ్యమంత్రినైనంత మాత్రాన నాపని నేను చేసుకోకూడదన్న రూలు లేదు కదా... అని ప్రశ్నించేవారు. మనోహర్ పరేకర్ తనతోపాటు ప్రభుత్వ సిబ్బంది అంతా కష్టించి పనిచేయాలని ఆదేశించారు.
కేంద్రమంత్రి వర్గంలో చేరిన తర్వాత కూడా గోవాలోని మార్గావ్‌కు వెళ్లి తన పదవీకాలంలో ప్రారంభించిన పలు పథకాలను సమీక్షించారు. తనముందు గోవా రాష్ట్రానికి సంబంధించి మూడు ముఖ్య సమస్యలున్నాయనీ బోధనా భాష జూదగృహాలపై నిర్ణయం ప్రాంతీయ ప్రణాళిక అనేవి పరిష్కరించాల్సిన సమస్య అని అన్నారు. కొంకణి భాషను బోధనా భాషగా చేయాలన్నది పరేకర్ అభిమతం.
విలక్షణ వ్యక్తిత్వం: మనోహర్ పరేకర్ వ్యక్తిత్వం విలక్షణమైంది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఎంత సన్నిహితులో అంత విమర్శకులు కూడా. మొహమాటం లేకుండా మాట్లాడగల తత్వం ఆయనది. ప్రధానికే సూచనలు ఇవ్వగల ముక్కుసూటి మనిషిగా పరేకర్‌కు పేరుంది. కేంద్రంలో అత్యంత కీలకమైన రక్షణ శాఖను నిర్వహిస్తున్న పర్రేకర్ వ్యక్తిత్వంలో కొంచెమైనా మార్పు కనబడలేదు. బహుశా ఇలాంటి విలక్షణ వ్యక్తిత్వమే నరేంద్రమోడీ కీలక శాఖ అప్పగింతకు కారణమై ఉండవచ్చు. రెండు దశాబ్దాల క్రితం నరేంద్రమోడీ మనోహర్ పరేకర్ మధ్య ఆర్‌ఎస్‌ఎశ్‌లో కుదిరిన స్నేహం ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగుతూ వస్తోంది. 2013లో భారతీయ జనతాపార్టీ నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినపుడు మనోహర్ పరేకర్ సంతోషం వ్యక్తం చేస్తూనే 2002లో జరిగిన గోద్రా అల్లర్లు మోడీకి మచ్చతెచ్చిన అంశమని అన్నారు. పరేకర్ అంతముక్కుసుటిగా మాట్లాడగల వ్యక్తి. పరేకర్ చేసిన వ్యాఖ్యానం మీడియా వర్గాల్లో కలకలం రేపింది. ఆయన కొద్దిపాటి లౌక్యంగా మాట్లాడితే బాగుండేది అని ఒక బిజెపి నాయకుడు సూచిస్తే మరో బిజెపి నేత స్పందిస్తూ లౌక్యంగా మాట్లాడగల వ్యక్తిత్వం వుంటే అతను మనోహర్ పరేకర్ కాడు కదా! అన్నాడు.
కేజ్రీవాల్‌కు స్ఫూర్తి పరేకర్: మనోహర్ పరేకర్ ఏది చేసినా దాపరికాలు వుండవు. చెప్పింది ఖచ్చితంగా చేస్తారనే పేరుంది. తన పరిధికి మించిన వాగ్దానాలు చేయరు. ఏది నిర్వహించినా పారదర్శకంగా వుంటుంది. అందుకే పరేకర్‌ను మధ్యతరగతి వర్గాల వారు హీరోగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుకు సంబంధించిన కారును ఆఫీసు పనులకు మాత్రమే వినియోగించారు. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన జీవనశైలి అచ్చు మనోహర్ పరేకర్ జీవన శైలిలాగే ఉండేది. కేజ్రీవాల్ రాజకీయ రంగంలోకి రాకముందే పరేకర్ భావజాలం అవినీతికి వ్యతిరేకంగా ఉండేది. తన ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే వాళ్లెంతటి వారైనా క్షమించేవారు కాదు మనోహర్ పరేకర్! కేజ్రీవాల్ ఆలోచనా విధానాన్ని తమ ముఖ్యమంత్రి నుంచి కాపీ చేసిందేనని గోవా ప్రజలు భావించేవారు. మరో విచిత్రమేమిటంటే పరేకర్ కేజ్రీవాల్... ఇద్దరు ఐఐటి నుంచి ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారే! 2012 లో గోవాలో జరిగిన ఎన్నికలముందు మనోహర్ పరేకర్ జన సంపర్క్ యాత్ర చేస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ అనుసరించిన అవినీతి విధానాన్ని ఎండగట్టి కరప్షన్ లేని పాలనను తెస్తానని వాగ్గానం చేశారు. ఈ నినాదమే పరేకర్ విజయానికి కారణమైంది. అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదేరకమైన ప్రచార శైలిని అనుసరించాడు. అవినీతి వ్యతిరేక సంవిధానమే ఇద్దరినీ గెలిపించి ముఖ్యమంత్రులను చేసింది. ఇది యాధృచ్చికమని కొందరు... కేజ్రీవాల్ పరేకర్‌ను కాపీ చేశారని మరికొందరు అంటారు. ఏది ఏమైనా కేజ్రీవాల్ మనోహర్ పరేకర్‌లలో కొంత భావ సారూప్యం ఉంది.
కొన్ని బలహీనతలూ...!
గోవా చిన్న రాష్ట్రం కనుక రెవెన్యూ రాబడికి కొన్ని పరిమితులు వున్నాయి. ప్రజల్ని ప్రగతి పథంలో నడపాలంటే ఆదాయ వనరులు పెంచుకొనక తప్పదు. ఈ ప్రత్యయాన్ని పక్కనబెట్టి ఎన్నికలముందు వాగ్దానం చేస్తూ చట్టబద్ధంకాని మైనింగ్ కార్యకలాపాల్ని నిరోధిస్తానని అన్నారు. అలాగే జూదగృహాలను రద్దు చేస్తానని వాగ్దానం చేశారు. ఈ రెండూ వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తాయి. మనోహర్ పరేకర్ ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత ఆ రెండు వాగ్దానాలనూ విస్మరించారు. ప్రజలు... ముఖ్యంగా 36 శాతం మహిళలు పరేకర్‌ను వ్యతిరేకించారు. ఆదాయ వనరులు అధికం చేసుకునేందుకు జూదగృహాల్లోకి వెళ్లేందుకు ప్రవేశ రుసుమును పదింతలు పెంచారు.
రక్షణ శాఖ మంత్రిగా అదే వైఖరి...
ఇటీవలే కేంద్ర మంత్రి వర్గంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన మనోహర్ పరేకర్ ఆలోచనా విధానంలో మార్పు కనపడలేదు. విధుల్లో చేరగానే తన దైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. త్రివిధ దళాలకు ఆయుధాల కొనుగోళ్ళలో పార దర్శకతను ప్రస్ఫుటం చేసేందుకు ఒక సంవిధానాన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో ఆయుధాల కొనుగోళ్లను రహస్యంగా వుంచేవారు. అవినీతికి తావులేని విధంగా రక్షణ శాఖలో ఆర్థిక వ్యవహరాలు కొనసాగాలన్నది పరేకర్ ఆలోచనా విధానం! ఆయుధాలను సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో జరపాల్సిన క్రయవిక్రయాలను పారదర్శకం చేయాలని మనోహర్ పరేకర్ అంటున్నారు. నాసిరకం ఆయుధాలను సరఫరా చేసే కంపెనీలను బ్లాక్ లిస్టులో వుంచేందుకు పరేకర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు. లాబీయింగ్ చేయడంలో తప్పు లేదంటారు ఆయన. కాని లాబీయింగ్ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలిసేలా వుండాలన్నది పరేకర్ అభిప్రాయం. ఈ పారదర్శకత ఎలా ఉండాలో అనే ప్రత్యయం గురించి అప్పుడే రక్షణ శాఖలోని కీలక అధికారులతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి.
కేంద్ర రక్షణ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మనోహర్ పరేకర్ గోవాకు వెళ్లి కొత్త ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పరేకర్‌ను కలిశారు. గోవా ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను నిర్వహించిన శాఖలకు సంబంధించిన ఫైళ్లన్నీ పరేకర్ లక్ష్మీకాంత్ పర్సేకర్‌కు స్వాధీనపరిచారు. ఆ ఫైళ్లకు సంబంధించిన అన్ని విషయాలు కొత్త ముఖ్యమంత్రికి వివరించి పరిపాలన సవ్యంగా జరిగేలా చూశారు.
రాష్ట్ర రాజకీయాలకూ కేంద్ర రాజకీయాలకూ చాలా తేడా వుంటుంది. వ్యవహారశైలి బ్యూరోక్రాట్స్‌తో సంబంధాలు భిన్నంగా వుండాల్సి వస్తుంది. చాలాసార్లు ఏ కేంద్రమంత్రి అయినా తన ఆలోచనా విధానాలకు భిన్నంగా వ్యవహరించాల్సి వస్తుంది. ముక్కుసూటి నైజం కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. ప్రతిపక్షాలు మాధ్యమాలు రక్షణశాఖ వ్యవహార తీరుతెన్నులను నిశితంగా గమనిస్తూంటాయి.
మనోహర్ గోపాలకృష్ణ ప్రభు పరేకర్ వీటన్నింటినీ అధిగమించి రక్షణ శాఖను ఎలా నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే. కొంతలౌక్యం మరికొంత పార్టీ విధి విధానాలను అనుసరించి అడుగులు వేయగల్గితే ప్రధాని నరేంద్రమోడీ తనపై వుంచిన నమ్మకాన్ని పరేకర్ కాపాడుకోగలరనటంలో సందేహాలు అవసరం లేదు.
really great man
రిప్లయితొలగించండిawesome blog
రిప్లయితొలగించండిhi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg