9, ఆగస్టు 2014, శనివారం

తిరుమలలో అద్బుతం....మూగకు మాటలు

Sakshi | Updated: August 09, 2014 14:23 (IST)
తిరుమలలో అద్బుతం....మూగకు మాటలువీడియోకి క్లిక్ చేయండి
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్ కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా?

వివరాల్లోకి వెళితే....లండన్ కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్ కు లండన్ లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు.

కాగా  చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే దీపక్ కుటుంబ సభ్యులను కలుసుకుని అభినందించారు. వారికి స్వామివారి ప్రసాదాలను అందించారు.ఇదో అద్బుతం అని,ఇలాంటివి తెలిక మరెన్నో అద్భుతాలు జరుతున్నాయని అందుకే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోటానికి రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారని ఆలయ అధికారి చిన్నంగారి రమణ అన్నారు. స్వామివారిని మనసారా వేడుకుంటే కోర్కెలు తప్పకుండా తీరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి