13, ఆగస్టు 2014, బుధవారం

చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం


నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.
ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్‌ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్‌ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ , మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్‌కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్‌ రూపొందిందో!

9, ఆగస్టు 2014, శనివారం

తిరుమలలో అద్బుతం....మూగకు మాటలు

Sakshi | Updated: August 09, 2014 14:23 (IST)
తిరుమలలో అద్బుతం....మూగకు మాటలువీడియోకి క్లిక్ చేయండి
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్ కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా?

వివరాల్లోకి వెళితే....లండన్ కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్ కు లండన్ లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు.

కాగా  చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే దీపక్ కుటుంబ సభ్యులను కలుసుకుని అభినందించారు. వారికి స్వామివారి ప్రసాదాలను అందించారు.ఇదో అద్బుతం అని,ఇలాంటివి తెలిక మరెన్నో అద్భుతాలు జరుతున్నాయని అందుకే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోటానికి రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారని ఆలయ అధికారి చిన్నంగారి రమణ అన్నారు. స్వామివారిని మనసారా వేడుకుంటే కోర్కెలు తప్పకుండా తీరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.